సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ఎన్నికల హామీలో చెప్పిన విధంగా రైతులకు పెట్టుబడి సాయంగా రూ.12,500 కాకుండా రూ.13,500 ఇవ్వాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. నాలుగేళ్లలో రూ.50 వేలు ఇస్తామంటూ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నప్పటికీ దానిని ఐదేళ్లకు పొడిగిస్తూ రూ.67,500 ఇస్తామని స్పష్టం చేశారు. రైతు మరణిస్తే.. ఆ కుటుంబానికి అర్హత ఉంటే, ఆ రైతు భార్యకు రైతు భరోసా వర్తింపజేసేలా మార్గదర్శకాలను సైతం సడలిస్తామని చెప్పారు.
అర్హులైన వారందరికీ ఎట్టి పరిస్థితుల్లోనూ సంతృప్తికర స్థాయిలో రైతు భరోసా ఇవ్వాలన్న లక్ష్యంతో అర్హులందరూ దరఖాస్తు చేసుకోవడానికి నవంబరు 15 వరకు గడువు పొడిగిస్తున్నామని సీఎం వెల్లడించారు. సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన వ్యవసాయ మిషన్ సమావేశమైంది. మంగళవారం (అక్టోబర్ 15) నాడు నెల్లూరు సమీపంలో రైతు భరోసా పథకాన్ని ప్రారంభించనున్న దృష్ట్యా లబ్ధిదారుల ఎంపికపై ఈ సమావేశంలో సీఎం ఆరా తీశారు. ఇదే సమయంలో మిషన్‌లో సభ్యులుగా కొనసాగుతున్న రైతు ప్రతినిధులు వ్యవసాయరంగంలో తాజా పరిస్థితులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
సచివాలయంలో సోమవారం జరిగిన వ్యవసాయ మిషన్ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఈ ఏడాది వర్షాలు పడ్డా, సకాలంలో వర్షాలు కురవలేదని, ఖరీఫ్ సాగు కూడా సాధారణ స్థాయి దాటలేదని సీఎంకు వివరించారు. రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టతరంగా ఉన్నప్పటికీ హామీల అమలుకు, రైతుల ప్రయోజనాల కోసం అత్యంత సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఈ తరుణంలో రైతు భరోసా కింద ఇచ్చే మొత్తాన్ని కూడా పెంచాలని విజ్ఞప్తి చేశారు. పంట ఇంటికి వచ్చే సమయంలో రైతులు ఘనంగా జరుపుకునే సంక్రాంతి పండుగ సమయంలో కొంత పెంచి ఇవ్వాలని కోరారు. రైతు భరోసా కింద ఇచ్చే మొత్తాన్ని రెండు సీజన్లకు, మూడు విడతలుగా ఇచ్చినా అభ్యంతరంలేదన్నారు. రైతు ప్రతినిధులు చేసిన సూచనలపై సమావేశంలో చాలాసేపు చర్చ జరిగింది.
ఎనిమిది నెలలు ముందుగానే అమలు
అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే, అనుకున్న దానికంటే ముందుగానే రైతు భరోసా ఇవ్వగలమా? లేదా? అని ఆలోచించామని సమావేశంలో సీఎం అన్నారు. ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లపాటు, మొత్తంగా రూ.50 వేలు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చామని, అధికారంలోకి వచ్చాక 8 నెలలు ముందుగానే ఇస్తూ, ఈ పథకాన్ని ఐదేళ్లకు వర్తింప చేస్తూ నిర్ణయం తీసుకున్నామని సీఎం చెప్పారు. అధికారంలోకి వచ్చే నాటికి ఖరీఫ్ సమయం ముగిసినందున రబీకైనా అక్టోబర్‌లో ఇవ్వాలని నిర్ణయించామన్నారు. రాష్ట్రం ఆర్థికంగా తీవ్ర సమస్యల్లో ఉన్నప్పటికీ రైతులు కూడా కష్టాలు ఎదుర్కొంటున్నందున వారికి ఎంతచేసినా తప్పులేదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఇది రైతుల పక్షపాత ప్రభుత్వమని, అందుకే వైఎస్సార్ రైతు భరోసా కింద ఇస్తున్న మొత్తాన్ని రైతు ప్రతినిధులు కోరినట్టుగా మరో వెయ్యి రూపాయలు పెంచుతున్నట్టుగా సమావేశంలో ప్రకటించారు. అధికంగా పనులు కల్పించేది వ్యవసాయ రంగమే అయినందున వీరి ప్రతిపాదనలను అంగీకరిస్తున్నామని చెప్పారు.
లబ్ధిదారుల సంఖ్యపై ఆరా
రైతు భరోసాకు ఎంపికైన లబ్ధిదారుల సంఖ్యపై ముఖ్యమంత్రి జగన్ ఆరాతీశారు. గత ప్రభుత్వం కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకానికి 43 లక్షల మంది రైతులతో జాబితాను పంపిందని అధికారులు సీఎంకు వివరించారు. అంతకంటే మిన్నగా ఈ పథకం ద్వారా పారదర్శకంగా సుమారుగా 51 లక్షల మంది రైతులు ఎంపిక కానున్నారని సీఎం చెప్పారు. ఈసారి మరో 3 లక్షల మంది భూములు లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు రైతులకూ పథకం వర్తిస్తుందని సీఎం పేర్కొన్నారు. రైతుభరోసా ఈసారి అక్టోబర్‌లో ప్రారంభం అయిన దృష్ట్యా వచ్చే మే నుంచి కౌలు రైతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందన్నారు. అక్టోబర్ 15 తర్వాత కూడా నెలరోజుల పాటు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వాలన్నారు. నాలుగేళ్లలో రూ.50 వేల బదులు రూ.67,500 ఇవ్వబోతున్నామని, గతంలో చెప్పిన దానికంటే ఇది రూ.17,500 అధికం అని చెప్పారు. మే నెలలో రూ.7,500, అక్టోబర్‌లో పంటకోసే సమయంలో లేదా రబీ సన్నాహాల కోసం రూ.4,000, సంక్రాంతి సమయంలో రూ.2 వేలు ఇద్దామన్న రైతు ప్రతినిధుల సూచనను పరిగణలోకి తీసుకుని ఆ మేరకు పథకాన్ని అమలు చేద్దామని సీఎం ప్రకటించారు.
గ్రామీణ స్థానిక సంస్థల ప్రతినిధులూ అర్హులే
సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు.. లాంటి ప్రజాప్రతినిధులు ఈ పథకానికి అనర్హులుగా ప్రకటిస్తున్నారంటూ సీఎంకు వ్యవసాయ మిషన్ సభ్యులు వివరించారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎంపీలు తప్ప మిగతా ప్రజా ప్రతినిధులందరికీ రైతు భరోసా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఆక్వా కల్చర్ కిందకు మార్చిన భూములు, రియల్ ఎస్టేట్ భూములు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను కట్టేవారిని రైతు భరోసాకు అనర్హులుగా ప్రకటించామని అధికారులు వివరించారు. మార్గదర్శకాలను తప్పనిసరిగా అందరికీ అందుబాటులో ఉంచాలని, ఎవరెవరికి పథకం వర్తించదో.. ఆ వివరాలను ప్రదర్శించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అర్హులైన వారికి పథకం వర్తించలేదంటే వెంటనే చర్యలు తీసుకోవాలని, దీనికోసం వచ్చే విజ్ఞాపన పత్రాలను వెంటనే పరిష్కరించేలా సరైన యంత్రాంగం ఉండాలని ఆదేశించారు. రైతు భరోసాను సంతృప్తికర స్థాయిలో అమలు చేయాలని, గ్రామ వలంటీర్లను, గ్రామ సచివాలయాలను పూర్తి స్థాయిలో వాడుకోవాలన్నారు.
వచ్చే కేబినెట్‌లో అజెండాగా చిరుధాన్యాలు, వరి బోర్డులు
వచ్చే ఖరీఫ్ నాటికి చిరుధాన్యాలపై ప్రమోషన్ స్కీంను తీసుకురావాలని సీఎం ఆదేశించారు. అందుకు తగినట్టుగా విత్తనాలను కూడా సిద్ధం చేసుకోవాలన్నారు. చిరుధాన్యాలు, వరి బోర్డుల ఏర్పాటుకు వెంటనే ప్రయత్నాలు మొదలు పెట్టాలని, అక్టోబర్ 16 నాటి కేబినెట్ సమావేశంలో అజెండాగా ఈ అంశం పెట్టాలన్నారు. నెలాఖరు నాటికి చైర్మన్ల నియామకాన్ని పూర్తి చేయాలని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ కాలేజీల్లో ప్రమాణాలు పడిపోతున్న విషయాన్ని మిషన్ సభ్యులు సీఎంకు నివేదించారు. దీనిపై స్పందిస్తూ ప్రమాణాలు లేని కాలేజీలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాలేజీల్లో నాణ్యత లేకపోతే వ్యవసాయ రంగమే దెబ్బ తింటుందన్నారు. వ్యవసాయ, అనుబంధ శాఖలకు, వ్యవసాయ యూనిర్సిటీలకు మధ్య మరింత సమన్వయం ఏర్పడేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఈ నెలాఖరులోగా వ్యవసాయ మార్కెట్ కమిటీల నియామకాలను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
కేటాయింపులు కాగితాలకే పరిమితం కాకూడదు
ధరల స్థిరీకరణకు బడ్జెట్‌లో రూ.3 వేల కోట్లు కేటాయించామని, ఆ నిధులను అవసరమైనప్పుడు వినియోగించాలని ముఖ్యమంత్రి సూచించారు. బడ్జెట్లో కేటాయింపులు కాగితాలకే పరిమతం కాకూడదని, ప్రత్యేకంగా ధరల స్థిరీకరణ నిధి ఫలితాలు రైతులకు అందాలని స్పష్టం చేశారు. పామాయిల్ ఏపీలో రికవరీ 17.2 శాతం ఉంటే, తెలంగాణలో 18.94 శాతం ఉందని సీఎం దృష్టికి రైతు ప్రతినిధులు తీసుకు వచ్చారు. పెదవేగి ప్లాంటులో కొందరు ఉద్యోగుల అక్రమాలను కూడా వారు ప్రస్తావించగా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
కో–ఆపరేటివ్ రంగంలో చక్కెర కర్మాగారాల పరిస్థితి బాగోలేదని, గడిచిన ఐదేళ్లలో వాటిని పట్టించుకోలేదని, వచ్చే రెండేళ్లలో వాటిని పునరుద్ధరిస్తామని సీఎం చెప్పారు. చక్కెర ఫ్యాక్టరీలను పూర్తి స్థాయి ఆపరేషన్స్‌లోకి తీసుకురావడమే కాకుండా, మంచి మార్కెటింగ్ అవకాశాలను కల్పించేలా తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ శాఖ శాఖ) పిల్లి సుభాష్ చంద్రబోస్, జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మార్కెటింగ్, మత్స్య, పశు సంవర్థక శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి, ప్రముఖ పాత్రికేయుడు, వ్యవసాయ నిపుణుడు పాలగుమ్మి సాయినాథ్, మిషన్ సభ్యులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
‘వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్’గా ఈ పథకానికి పేరు పెడదాం. కేంద్రం నుంచి వచ్చే నిధులు, తెచ్చుకునే రుణాలు, గ్రాంట్లు ఇవన్నీ కలిపితేనే బడ్జెట్.. అందువల్ల ఈ విషయంలో ఇతరత్రా ఆలోచనలు వద్దు. ఫెడరల్ స్ఫూర్తికి నిదర్శనంగా నిలుద్దాం. దీనిమీద కూడా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు రచ్చ చేసే స్థాయికి వెళ్లడం దురదృష్టకరం.
టమాటా రైతులను ఆదుకోవడానికి అన్ని చర్యలూ తీసుకోవాలి. బెంగళూరు, చెన్నై మార్కెట్లలో రేట్లను పరిగణనలోకి తీసుకుని ఆ మేరకు ప్రభుత్వం జోక్యం చేసుకుని ధరలు స్థిరీకరించాలి. ప్రాసెసింగ్ యూనిట్లపై దృష్టి పెట్టి టమాటా ధర సమస్యకు శాశ్వత పరిష్కారం ఆలోచించాలి. పసుపు విషయంలో కూడా ఇలాంటి ఆలోచనే చేయాలి.
రైతుల కోరిక మేరకే రైతు భరోసా ప్రోత్సాహకాన్ని మూడు దఫాలుగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన వ్యవసాయ మిషన్ సమావేశ వివరాలను మంత్రులు కన్నబాబు, పిల్లి సుభాష్‌చంద్రబోస్, పి.అనిల్‌కుమార్ యాదవ్, మోపిదేవి వెంకటరమణ, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి మీడియాకు వెల్లడించారు.
ఎవరేమన్నారంటే..
ఇది చాలా గొప్ప పథకం
రైతులకు వ్యవసాయ పెట్టుబడికి సాయం అందించే గొప్ప పథకమిది. ఇలాంటి పథకాన్ని ప్రజల్లోకి సవ్యంగా తీసుకెళ్లాలి. ఇంత గొప్ప పథకాన్ని ప్రవేశ పెడుతున్నప్పుడు మంచి అంశాలను మరుగున పరిచి తప్పుడు ప్రచారం చేసే అవకాశాలుంటాయి. ఇందుకు ఆస్కారం లేకుండా పథకం లక్ష్యాలు, రైతులకు కలిగే వాస్తవ ప్రయోజనాలు ప్రజల్లోకి వెళ్లేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
– పాలగుమ్మి సాయినాథ్, వ్యవసాయ మిషన్ సభ్యుడు
సంక్రాంతికి కొంత ఇవ్వండి
రైతులకు పెద్ద పండగైన సంక్రాంతికి ధాన్యం ఇళ్లకు వస్తుంది. అందువల్ల ఆ పండుగ పూట రైతులు సంతోషంగా ఉండేందుకు వీలుగా రైతు భరోసా కింద కొంత ఆర్థిక సాయం అందిస్తే బావుంటుంది. అక్టోబర్‌లో రైతులకు వ్యవసాయ పెట్టుబడి కింద ఆర్థిక సాయం చేయడం చాలా అవసరం. మొత్తం ఒకేసారి కాకుండా మూడు విడతలగా సాయం అందించాలి.
– డాక్టర్ మల్లారెడ్డి, వ్యవసాయ మిషన్ సభ్యుడు
త్వరలో మిల్లెట్ బోర్డు
ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో మిల్లెట్స్ అత్యధికంగా సాగు చేస్తున్నారు. వారికి అండగా ఉండటానికి మిల్లెట్ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 16న జరిగే క్యాబినెట్ సమావేశంలో దీనిపై ఒక నిర్ణయం తీసుకోనున్నారు. వచ్చే నెల 18న వ్యవసాయ కమిషన్ మరోసారి సమావేశం కానుంది.
– ఎంవీఎస్ నాగిరెడ్డి, వ్యవసాయ కమిషన్ వైస్ చైర్మన్
భూ యజమానులు సహకరించాలి
కౌలు రైతులకు రైతు భరోసా లభించేలా భూ యజమానులు సహకరించాలి. భూ యజమానుల రక్షణ కోసం కౌలు రైతుల చట్టం తీసుకొచ్చాం. అనవసర భయాలు పెట్టుకోవద్దు. కౌలు రైతులకు సహకారం అందకపోతే కౌలు బాగా తగ్గిపోతుంది. గతంలో ఎకరానికి 30–35 బస్తాలున్న కౌలు ఇప్పుడు 28 బస్తాలకు పడిపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే భూ యజమానులే నష్టపోతారు.
– సుభాష్‌చంద్రబోస్, రెవెన్యూ శాఖ మంత్రి
ఉల్లిని ప్రభుత్వమే కొంటుంది
ధరలు తగ్గినప్పుడు ఉల్లి, టమాటాలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. ఇదే విధానాన్ని ఇతర పంటలకు వర్తింప చేస్తాం. ఇందుకోసం రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాం. వాల్‌మార్ట్‌కు సరఫరా చేయగా.. మిగిలిన సరుకుల్ని హాస్టల్స్, అంగన్‌వాడీ కేంద్రాల్లో వినియోగిస్తాం.
– మోపిదేవి వెంకటరమణ, మార్కెటింగ్ శాఖ మంత్రి
రైతుకు భరోసా
కష్టాల్లో ఉన్న రైతులకు వైఎస్సార్ రైతు భరోసా పథకం ఒక ధైర్యాన్ని ఇస్తుంది. 53 లక్షల మంది లబ్ధి పొందే ఈ కార్యక్రమం ప్రారంభానికి నెల్లూరు జిల్లాను ఎంచుకోవడం సంతోషకరం.
– పి.అనిల్‌కుమార్ యాదవ్, జల వనరుల శాఖ మంత్రి
రైతుల మేలు కోసమే..
రైతు భరోసా ప్రోత్సాహకం మొత్తాన్ని ఒకేసారి కాకుండా విత్తనాలు కొనుక్కునే విధంగా అక్టోబర్‌లో కొంత మొత్తం ఇవ్వాలని రైతులు అడిగారు. అందువల్లే మే, అక్టోబర్, జనవరి నెలల్లో మూడు దఫాలుగా ఇవ్వాలని నిర్ణయించాం. ఈ పథకం కింద మరింత ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చేందుకు నిబంధనలు సడలించాలని సీఎం సూచించారు.
– కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి
రైతు మరణిస్తే అతని భార్యకు భరోసా..
రైతు మరణిస్తే.. అతని భార్యకు రైతుభరోసా ఇచ్చేలా మార్గదర్శకాల్లో మార్పు చేయండి. పిల్లలు ఉద్యోగులై ఆదాయపు పన్ను కడుతున్నా, వ్యవసాయం చేస్తున్న వారి తల్లిదండ్రులకూ ఈ పథకాన్ని వర్తింపు చేయాలి. రైతుభరోసా కింద ఇచ్చే మొత్తాన్ని బ్యాంకులు మినహాయించుకోలేని విధంగా అన్ ఇన్‌కంబర్డ్ ఖాతాలకే నగదు జమ కావాలి. అర్హులైన వారికి పథకం వర్తించలేదంటే వెంటనే చర్యలు తీసుకోవాలి.
– సీఎం వైఎస్ జగన్
Comments
Please login to add a commentAdd a comment