నేటి నుంచే ఎంసెట్ కౌన్సెలింగ్
Published Mon, Aug 19 2013 5:28 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
ఎచ్చెర్ల క్యాంపస్,న్యూస్‌లైన్: ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో ఎటువంటి మార్పులేదని ఉప ముఖ్య మంత్రి, సాంకేతిక విద్యాశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేయడంతో ఒకవైపు శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల పాలిటెక్నిక్ హెల్ప్‌లైన్ సెంటర్‌లో ఏర్పాట్లు ప్రారంభించారు. మరోవైపు దీన్ని నిర్వహించాల్సిన పాలిటెక్నిక్ లెక్చరర్ల సంఘం కౌన్సెలింగ్‌ను బహిష్కరిస్తామని ప్రకటించడంతో అభ్యర్థుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగం గా ఆర్టీసీ బస్సులు తిరగడం లేదు.
పైవేట్ వాహనాలను కూడా ఉద్యమకారులు ఎక్కడికక్కడ రాస్తారోకోలు, రోడ్డు దిగ్బంధనాలతో అడ్డుకుంటున్నారు. పైగా జిలా అంతటికీ ఒక్క శ్రీకాకుళం పాలిటెక్నిక్‌లోనే హెల్ప్‌లైన్ కేంద్రం ఉంది. అందరూ ఇక్కడికే రావాల్సి ఉంటుంది. వ్యయప్రయాసలకోర్చి ఇక్కడికి వచ్చినా అధ్యపకుల సహాయ నిరాకరణ కారణంగా కౌన్సెలింగ్ జరుగుతుందో లేదోనన్న ఆందోళన అభ్యర్థులను, వారి తల్లిదండ్రులను వెంటాడుతోంది. వీటితో పనిలేకుండా అధికారులు మాత్రం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే దృవీకరణ పత్రాల పరిశీలనకు అవసరమైన మెటీరియల్‌ను సాంకేతిక విద్యాశాఖ అందజేసింది. కౌన్సెలింగ్‌లో భాగంగా సోమవారం నుంచి ధ్రువీకరణ పత్రాలు పరిశీలిస్తారు.
ఏ ర్యాంకు వారికి ఎప్పుడు
తేదీ - ర్యాంకు
19 ... 1 నుంచి 15 వేలు
20... 15001 నుంచి 30 వేలు
21... 30001 నుంచి 45 వేలు
22... 45001 నుంచి 60 వేలు
23... 60001 నుంచి 80 వేలు
24... 80001 నుంచి లక్ష
25... 100001 నుంచి 120000
26... 120001 నుంచి 140000
27... 140001 నుంచి 160000
28... 160001 నుంచి180000
29... 180001 నుంచి 2 లక్షలు
30.. 200001 ఆపైన
ఆప్షన్ల ఎంట్రీ ఎప్పుడు
22, 23 తేదీలు.. 40 వేలలోపు ర్యాంకు
24, 25 తేదీలు... 40001 నుంచి 80000
26, 27 తేదీలు... 80001 నుంచి 120000
28, 29 తేదీలు... 120001 నుంచి 160000
30, 31 తేదీలు... 160001 నుంచి 200000
అక్టోబర్ 1... 200001 నుంచి ఆపైన
ఆప్షన్ల మార్పునకు అవకాశం
అక్టోబర్ 2.. లక్షలోపు ర్యాంకు వారు
అక్టోబర్ 3.. లక్ష ర్యాంకు దాటిన వారు
హెల్ప్‌లైన్ సెంటర్‌లో కూడా ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు.
ఇవి అవసరం
కౌన్సెలింగ్‌కు హాజరయ్యే ఓసీ, బీసీలు రూ.600, ఎస్సీ, ఎస్టీలు రూ.300 ఫీజు చెల్లించాలి. ఒరిజనల్ ధ్రువీకరణ పత్రాలతోపాటు వాటి జిరాక్సు కాపీల సెట్లు తీసుకురావాలి. ఎంసెట్ హాల్‌టిక్కెట్, ర్యాంకు కార్డు, 10వ తరగతి, ఇంటర్ మార్కుల మెమోలు, 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, ఈ ఏడాది జనవరి తరువాత జారీ చేసిన కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అవసరం. ఇంటర్మీడియట్‌లో ఓసీలకు 45 శాతం, ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు 40 శాతం మార్కులు తప్పనిసరి. సీట్ల ఎలాట్‌మెంట్లు అక్టోబర్ 5న లభిస్తాయి. స్పోర్ట్స్, ఫిజికల్లీ ఛాలెంజ్‌డ్, ఎన్.సి.సి, తదితర కేటగిరీలకు చెందిన అభ్యర్థులు మాత్రం కౌన్సెలింగ్‌కు హైదరాబాద్ వెళ్లాల్సి ఉంటుంది.
స్క్రాచ్ కార్డు కీలకం
వెబ్ కౌన్సెలింగ్ ఆప్షన్లు ఇచ్చాక ధ్రువీకరణ పత్రాల పరిశీలన అనంతం స్క్రాచ్ కార్డు ఇస్తారు. ఆప్షన్ల ఎంట్రీ అనంతరం ఈ కార్డు నెంబర్ పాస్‌వర్డ్‌గా ఇస్తారు. చాలా మంది దళారులు ఈ నెంబర్ ఆధారంగా విద్యార్థుల ఆప్షన్లు మర్చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అందువల్ల ఈ నెంబర్‌ను గోప్యంగా ఉంచాలి.
ఇవీ ఇబ్బందులు
ఏర్పాట్ల విషయం పక్కన పెడితే కౌన్సెలింగ్ నిర్వహణలో ప్రత్యక్షంగా ఎదురయ్యే ఇబ్బందుల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇవే అభ్యర్థుల ఆందోళనకు కారణమవుతున్నాయి.
= జిల్లాలో ప్రభుత్వ పురుషుల పాలిటెక్నిక్‌లో హెల్ప్‌లైన్ కేంద్రం ఉంది. పాలిటెక్నిక్ అధ్యాపకులు కూడా సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా విధులు బహిష్కరించనున్నట్లు ప్రకటించారు. హెల్ప్‌లైన్ కేంద్రంలో ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు సుమారు 20 మంది అధ్యాపకులు అవసరం. వీరికి సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చింది. గత ఐదేళ్లుగా కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొంటున్న వీరు లేకుండా వేరే వారితో నిర్వహించటం కష్టసాధ్యం.
= ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించే విద్యార్థులకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అత్యంత కీలకం. గత కొద్దిరోజులుగా రెవెన్యూ ఉద్యోగులు సమైక్యాంధ్ర సమ్మెలో పాల్గొంటున్నారు. దాంతో దరఖాస్తు చేసుకున్నవారందరికీ ఇంత వరకు ధ్రువీకరణ పత్రాలు జారీ కాలేదు.దీన్ని దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులు స్వీయ ధ్రువీకరణ ఇస్తే అనుమతించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. కళాశాలల్లో చేరాక ధ్రువీకరణ పత్రాలు అందజేసే వెసులుబాటు కల్పించింది.
= రాష్ట్రం యూనిట్‌గా కౌన్సెలింగ్ జరుగుతుంది. ర్యాంకు ఆధారంగా రాష్ట్రంలోని 23 జిల్లాల్లో ఏ కళాశాలలోనైనా విద్యార్థులు సీటు పొందవచ్చు. అందువల్ల సీమాంధ్రలో వాయిదా వేసి తెలంగాణలో నిర్వహించడానికి అవకాశం లేదు.
= ఆర్టీసీ బస్సులే లేకపోవటంతో ఆ ప్రభావం తప్పనిసరిగా కౌన్సెలింగ్‌పై పడుతుంది. హెల్ప్‌లైన్ కేంద్రాలకు అభ్యర్థులు సకాలంలో చేరడం కష్టమే.
విద్యార్థులకు అనుకూలంగా
విద్యార్థులకు ఇబ్బంది లేకుండా కౌన్సెలింగ్ నిర్వహించటమే లక్ష్యం. 40 వేల లోపు ర్యాంకు విద్యార్థులు ఈనెల 23 వరకు కౌన్సెలింగ్‌కు హాజరు కావచ్చు. అవసరమైతే హెల్ప్‌లైన్ సెంటర్‌లోనే ఆప్షన్లు నమోదు చేయించుకోవచ్చు.
-డాక్టర్ వి.ఎస్.దత్,పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్
ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలి
నోటిఫికేషన్‌లో సాంకేతిక విద్యాశాఖ ప్రస్తావించిన ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలి. ఉదయం 9 గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభం అవుతుంది. విద్యార్థుల హాజరును బట్టి సాయంత్రం వరకు కొనసాగిస్తాం.
-మేజర్ కె.శివకుమార్,కౌన్సెలింగ్ ఇన్‌చార్జి
Advertisement
Advertisement