సాక్షి, అమరావతి: ‘‘ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటి పరిష్కారంపై దృష్టి పెట్టకుండా, ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా మీరు రాజకీయంగా ఎదగాలనుకుంటున్నారు. మీరు సభలు నిర్వహిస్తే మేము రావాలా? మీ ఎదుగుదల కోసం మమ్మల్ని వాడుకుంటారా?’’ అని ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబుపై ప్రభుత్వ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 23వ తేదీన గుంటూరులో సభ నిర్వహించాలని అశోక్‌బాబు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వంలో నామినేటెడ్ పదవి కోసమే ఆయన ఈ సభ తలపెట్టారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. నాలుగున్నరేళ్లుగా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా ముఖ్యమంత్రికి వంతపాడిన ఆయన ఇప్పుడు గుంటూరులో సభ పేరుతో డ్రామాలు ఆడుతున్నారని తీవ్రంగా విమర్శిస్తున్నారు. రాజకీయాల్లో దిగేందుకే తమను వాడుకుంటున్నారని మండిపడుతున్నారు. టీడీపీ ప్రభుత్వానికి, అశోక్‌బాబుకు మధ్య ఉన్న సన్నిహిత సంబంధాల గురించి అందరికీ తెలుసని అంటున్నారు.
ఏం చేశారని మీ వెంట రావాలి?
ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబుకు పలువురు ఉద్యోగులు లేఖాస్త్రాలు సంధించారు. తమ సంక్షేమం కోసం ఇప్పటిదాకా మీరేం చేశారని మీ వెంట నడవాలని అశోక్‌బాబును నిలదీశారు. లేఖల్లోని కీలక అంశాలవీ...
⇒ మీరు(అశోక్‌బాబు) మీ అవసరాల కోసం ఎన్నోసార్లు ముఖ్యమంత్రిని కలిశారు. ఒక్కసారైనా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ గురించి మాట్లాడారా?
⇒ జీవో నెం.27ను విడుదల చేసి కాంట్రాక్టు ఉద్యోగుల హక్కులను ప్రభుత్వం కాలరాస్తుంటే.. ఆ జీవోను మీరు సమర్థించినందుకు మీ వెంట రావాలా?
⇒ కాంట్రాక్టు సిబ్బంది క్రమబద్ధీకరణ కోసం ఒక్కసారైనా మంత్రివర్గ ఉపసంఘాన్ని కలిశారా?
⇒ సీపీఎస్ రద్దు గురించి ఏరోజైనా మీరు ముఖ్యమంత్రితో మాట్లాడిన సందర్భాలున్నాయా?
⇒ సీపీఎస్ కోసం కమిటీ వేసి కాలయాపన చేయండని ముఖ్యమంత్రికి చెప్పిన మాట వాస్తవం కాదా?
⇒ జీవో నెం.27తో లబ్ధి పొందిన అతికొద్ది మందితో మీరు సన్మానాలు చేయించుకోవడం నిజం కాదా?
⇒ ప్రభుత్వ ఉద్యోగులకు 15వ పీఆర్‌సీ జాప్యం జరిగితే మధ్యంతర భృతి గురించి ఒక్కమాటైనా అడిగారా?
అశోక్‌బాబును విశ్వసించడం లేదు
‘‘ప్రభుత్వ ఉద్యోగులెవరూ అశోక్‌బాబును విశ్వసించడం లేదు. ఆయన వెంట నడిచేవారు ఎవరూ లేరు. సీపీఎస్‌పై పూటకోమాట మాట్లాడుతున్నారు. నూతన పెన్షన్ విధానం రద్దు అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చిన 653, 654, 655 జీవోలను రద్దు చేస్తే చాలు. అసెంబ్లీ తీర్మానం కూడా అవసరం లేదు’’
– పాలేల రామాంజనేయులు యాదవ్, అధ్యక్షులు, ఏపీ సీపీఎస్ ఎంప్లాయీస్ అసోషియేషన్
కాంట్రాక్టు ఉద్యోగులు ఇప్పుడే గుర్తొచ్చారా?
‘‘నాలుగున్నరేళ్లుగా కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యల గురించి ఒక్కసారి కూడా మాట్లాడని అశోక్‌బాబు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో సభలు నిర్వహించి, ఉద్యోగులను రమ్మని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. నాలుగున్నరేళ్లుగా ఆయనకు కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలు, వారి పోరాటాలు కనిపించలేదా? ఇప్పుడే గుర్తొచ్చాయా?
– ఏవీ శేషయ్య, కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు, నెల్లూరు
Comments
Please login to add a commentAdd a comment