సాక్షి, హైదరాబాద్: స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్(ఎస్‌బీహెచ్)లోని ఏపీ ఉన్నత విద్యామండలి ఖాతాను బ్యాంకు అధికారులు (ఫ్రీజ్)నిలిపివేశారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి చేసిన ఫిర్యాదుతో ఎస్‌బీహెచ్ ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌లోని శాంతినగర్ ఎస్‌బీహెచ్ శాఖ అధికారులు ఈ మేరకు ఏపీ ఉన్నత విద్యామండలికి గురువారం లేఖ అందించారు.
తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ఉన్నత విద్యామండలి ఫిర్యాదు మేరకు ఖాతాలు నిలిపివేస్తున్నామని, వివాదం ఏమైనా ఉంటే 2 విద్యామండళ్లూ పరిష్కరించుకొని వస్తేనే ఖాతాలను తిరిగి కొనసాగిస్తామని ఆ లేఖలో స్పష్టం చేశారు. ఏపీ ఉన్నత విద్యామండలికి శాంతినగర్ బ్రాంచిలో రూ.25 కోట్ల వరకు వివిధ డిపాజిట్లు ఉన్నాయి. వీటిని బ్యాంకు ఫ్రీజ్ చేసింది. ఈ పరిణామంపై ఏపీ ఉన్నత విద్యామండలి అధికారులు తీవ్రంగానే స్పందించాలని నిర్ణయించారు. దీనిపై ఇప్పటికే బ్యాంకు అధికారులను నిలదీసిన మండలి అధికారులు.. న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించారు.
దీనిపై ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాలరెడ్డి స్పందిస్తూ.. ఎస్‌బీహెచ్ తీరు తీవ్ర ఆక్షేపణీయమని, చట్టాన్ని ఉల్లంఘించడమేనని విమర్శించారు. కాగా, ఖాతాల నిలిపివేతతో వివిధ సెట్ల నిర్వహణ, ఏర్పాట్లు నిలిచిపోనున్నాయని మండలి అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు ఎస్‌బీహెచ్ తీరును ఏపీ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.
బ్యాంక్ ఉన్నతాధికారులతో దీనిపై చర్చించడంతోపాటు అవసరమైతే ఎస్‌బీహెచ్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టే అంశాన్ని కూడా పరిశీలనలోకి తీసుకోవాలని ఉన్నతాధికారులు భావిస్తున్నట్టు మండలి వర్గాలు తెలిపాయి. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన లేఖలో ఎక్కడా ఫ్రీజ్ చేయాలని కోరకపోయినా.. ఎస్‌బీహెచ్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించడంపై ప్రభుత్వం మండిపడుతున్నట్టు తెలిసింది.
ఏపీ విద్యామండలి ఖాతాల నిలిపివేత
Published Fri, Jan 30 2015 1:42 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM
Advertisement
Advertisement