
విద్యుత్ సమ్మె ఉధృతం.. రాష్ట్రమంతా కోతలు
రాష్ట్రంలో విద్యుత్ ఉద్యోగుల సమ్మె ఉధృత రూపం దాల్చింది. దీంతో ఉత్పత్తి పడిపోయి రాష్ట్రమంతా కోతలు అమలవుతున్నాయి.
రాష్ట్రంలో విద్యుత్ ఉద్యోగుల సమ్మె ఉధృత రూపం దాల్చింది. సమ్మెపై ఉద్యోగులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో విద్యుత్ ఉత్పాదక సంస్థల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. దాదాపు 4,500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలిగింది. పాల్వంచ, భూపాలపల్లి ఉత్పత్తి కేంద్రాల్లో సమ్మె కొనసాగుతోంది. శ్రీశైలం జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంపై కూడా సమ్మె ప్రభావం పడింది. ఉత్పత్తి గణనీయంగా పడిపోవడంతో హైదరాబాద్ సహా అన్ని జిల్లాలో విద్యుత్ కోతలు తీవ్రంగా అమలవుతున్నాయి. సోమవారం ఉదయం మరోసారి యాజయాన్యంతో విద్యుత్ జేఏసీ చర్చలు జరపనుంది.
ఉత్తరాంధ్రలోకూడా జెన్కో ఉద్యోగుల సమ్మె ఉధృతంగా ఉంది. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మాచ్‌కండ్, దొంకరాయి, సీలేరు, మోతుగూడెంలలో 480 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో గాజువాక, తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని బొమ్మూరు సబ్‌స్టేషన్లకు సరఫరా నిలిచిపోయింది. పలు పట్టణాలు, గ్రామాలు అంధకారంలో మునిగిపోయాయి.