పాక్షిక మద్య నిషేధం దిశగా తొలి అడుగు | AP Government First Step Towards Partial Liquor Prohibition | Sakshi
Sakshi News home page

పాక్షిక మద్య నిషేధం దిశగా తొలి అడుగు

Published Fri, Aug 9 2019 8:37 AM | Last Updated on Fri, Aug 9 2019 8:41 AM

AP Government First Step Towards Partial Liquor Prohibition - Sakshi

సాక్షి, అమరావతి : పాక్షిక మద్య నిషేధం దిశగా నూతన ప్రభుత్వం తొలి అడుగు వేసింది. అమ్మకాల్లో పారదర్శకతకు ప్రాధాన్యమిస్తూ మొత్తం ప్రక్రియను ఉన్నతాధికారులకు అప్పగించింది. ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేసేందుకు నాలుగు కమిటీలు ఖరారయ్యాయి. షాపులు, ప్రదేశాల ఎంపిక,   కాంట్రాక్టు/ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో సిబ్బంది నియామకం, మద్యం షాపుల్లో ఫర్నిచర్, మౌలిక సదుపాయాల కల్పనకు, డిపోల నుంచి షాపులకు సరుకు రవాణా చార్జీలను ఖరారు చేసేందుకు ఈ నాలుగు కమిటీలకు బాధ్యతలు అప్పగించారు. ఆయా జిల్లాల వారీగా ఈ కమిటీలు ఏర్పాటు చేసుకుని ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

టెండర్ల ద్వారా పారదర్శకత...
నూతన పాలసీలో అన్నీ టెండర్ల ద్వారానే చేపట్టి పారదర్శకతకు పెద్దపీట వేయాలని ప్రభుత్వ ఆదేశాలు జారీ అయ్యాయి. సిబ్బంది. నియామక ప్రక్రియ మినహా మిగిలిన అన్నింటికీ (షాపుల్లో ఫర్నిచర్, రవాణా చార్జీల ఖరారు, షాపులకు అద్దె) టెండర్లు నిర్వహించనున్నారు. అన్ని కమిటీలకు జిల్లా సంయుక్త కలెక్టర్లు చైర్మన్లుగా, కన్వీనర్లుగా ఆయా డిపోల నోడల్‌ మేనేజర్లు వ్యవహరించనున్నారు. కమిటీలో సభ్యులుగా ఆయా జిల్లాల ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్లు, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్లు, మద్యం షాపు ఏర్పాటయ్యే స్టేషన్‌ హౌస్‌ ఆఫీసరు, డిపో మేనేజర్లు ఉంటారు. మద్యం సరుకు రవాణా చార్జీల నిర్ణయ కమిటీలో రీజినల్‌ ట్రాన్స్‌పోర్టు ఆఫీసరును సభ్యుడిగా నియమించారు.

ఉపాధిలో బీసీలకు ప్రాధాన్యం...
అక్టోబర్‌ నుంచి మొదలయ్యే ప్రభుత్వ దుకాణాల్లో 15 వేల మందికి ఉద్యోగాలను కల్పించనున్నారు. బీసీలకు 29 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం మొత్తం 50 శాతం రిజర్వేషన్లను కల్పించారు. దశల వారీగా మద్యపాన నిషేధం అమల్లో భాగంగా తొలి దశలో 20 శాతం మేర మద్యం షాపుల్ని తగ్గించనున్నారు. మొత్తం 4,380 మద్యం షాపులు ఉండగా వాటిలో 880 షాపులు తగ్గనున్నాయి. అంటే 3,500 మద్యం షాపులు మాత్రమే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్నాయి.

ఉద్యోగాలకు రెండ్రోజుల్లో నోటిఫికేషన్‌
15 వేల ఉద్యోగాల్లో 7,500 ఉద్యోగాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 50 శాతం దక్కనున్నాయి. అంటే 7,500 ఉద్యోగాలు ఈ వర్గాలకు కేటాయించాలి. ఉద్యోగాల కల్పనలో భాగంగా సూపర్‌వైజర్‌కు మండలం యూనిట్‌గా, సేల్స్‌మెన్‌కు గ్రామం యూనిట్‌గా స్ధానికతను నిర్ధారిస్తారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు రెండ్రోజుల్లో నోటిఫికేషన్‌ జారీ కానుంది. 

ప్రభుత్వ మద్యం షాపులో పోస్టుల సంఖ్య అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో ఇలా...
ఉద్యోగం          అర్బన్‌            గ్రామీణం
సూపర్‌ వైజర్‌    1                    1
సేల్స్‌మెన్‌         3                    2
సెక్యూరిటీ గార్డ్‌   1                    1

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement