సాక్షి, అమరావతి : ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన హత్యాయత్నం ఘటన కేసును అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏకు అప్పగిస్తూ కేంద్ర ఇచ్చిన నోటిఫికేషన్ చెల్లదంటూ ఏపీ ప్రభుత్వం హైకోర్ట్‌లో రిట్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. వెంటనే ఎన్‌ఐఏ విచారణపై స్టే విధించాలని ప్రభుత్వం ఈ పిటిషన్‌లో పేర్కొంది. అయితే ఈ పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరగ్గా.. తక్షణమే విచారణను నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం వాదించింది. గత హైకోర్టు ఆదేశాల మేరకు ఈ పిటిషన్‌పై ఎన్‌ఐఏ అధికారులు కౌంటర్ దాఖలు చేయగా.. తమ వాదనను వినిపించేందుకు ఏపీ ప్రభుత్వం మరింత గడువు కోరింది. దీంతో ఈ కేసు విచారణను కోర్టు ఫిబ్రవరి 12కు వాయిదా వేసింది.
హైకోర్టులో ఎన్ఐఏ చార్జ్‌షీట్ దాఖలు చేసే సమయం దగ్గరపడుతుండటంతో టీడీపీ ప్రభుత్వం ఈ కేసును నిలువరించేందుకు శతవిధాల ప్రయత్నిస్తోంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఎన్ఐఏకు ఇవ్వాలని సిట్ అధికారులను హైకోర్టు ఆదేశించినప్పటికీ వారిలో ఎలాంటి చలనం లేదు. హైకోర్టు తుదితీర్పు వచ్చేంతవరకు ఎన్‌ఐఏకు సహకరించేది లేదని రాష్ట్ర ప్రభుత్వం ఖరాఖండిగా ప్రకటించేసింది.
Comments
Please login to add a commentAdd a comment