
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోంగార్డుల జీతాలు పెంచుతూ మంగళవారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న రూ. 300ల నుంచి రూ. 400లకు వేతనాలను పెంచుతున్నట్లు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది. ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో హోంగార్డులను క్రమబద్ధీకరిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్‌రాజు గుర్తు చేశారు. రూ. 100 వేతనం పెంచడం వల్ల హోం గార్డులకు ఎలాంటి లాభం ఉండదన్నారు.
మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో జీతాలు చాలా తక్కువగా ఉన్నాయంటూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ప్రకారం రూ. 672లు చెల్లించాలని కోరారు. ఇదిలావుండగా అసెంబ్లీలో విష్ణుకుమార్‌రాజు ప్రసంగానికి టీడీపీ సభ్యులు అడ్డుతగిలారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతిలో ప్రధాని మోదీ హామీ ఇచ్చిన సంగతిని వారు గుర్తు చేశారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనందున హోం గార్డుల వేతనాలను సుప్రీం తీర్పును అనుసరించి పెంచలేకపోతున్నామని హోం శాఖ మంత్రి చినరాజప్ప తెలిపారు. రూ. 100 కంటే ఎక్కువగా పెంచడం అసాధ్యమని అన్నారు. విధి నిర్వహణలో మరణిస్తే రూ. 5 లక్షల పరిహారం చెల్లించనున్నట్లు హోం మంత్రి ఎన్.చిన్నరాజప్ప శాసనసభ వేదికగా చెప్పారు. అలాగే కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీలో వీరికి 5 సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment