
ఏదైతే అయ్యింది, లెక్కలైతే బయటకు వచ్చాయి కదా!
ఆంధ్రప్రదేశ్ రాజధాని చుట్టూ జరుగుతున్న భూభాగోతాలు, వందలకోట్ల కుంభకోణాల వ్యవహారాన్ని చూసి టీడీపీ నాయకులే ముక్కున వేలేసుకుంటున్నారట. తమతోనే ఉంటూ తమకు తెలియకుండానే కొందరు నాయకులు ఎంతో పైకి ఎదిగిపోవడాన్ని చూసి జీర్ణించుకోలేక పోతున్నారట. కొందరు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీనాయకులు నడుపుతున్న రహస్య మంత్రాంగం, భూముల కొనుగోలు, బినామీ వ్యవహారాలు బయటపడడంతో లెక్కలన్నీ బయటకు వచ్చాయని, ఇది ఒకందుకు మంచిదేనని వారు లోలోపల సర్దిచెప్పుకుంటున్నారట.
పార్టీనాయకులు కొందరు ముందుచూపుతో వ్యవహరిస్తూ, ఎవరికీ దొరకకుండా వ్యవహారాలను చక్కబెట్టుకోవడం చూసి షాకవుతున్నారట. ఏదిఏమైనా లెక్క తేలింది కదా, అన్ని విషయాలు బయటకు రావాల్సిందేనని సర్దిచెప్పుకుంటున్నారట. తమకు తెలియకుండానే వందలకోట్ల భూదందాలు నిర్వహించినందుకు వారికి అంతకు అంత కావాల్సిందేనని పనిలోపనిగా శపిస్తున్నారట. సీనియర్‌నాయకులు సైతం ఈ విధంగా కూడా చేయవచ్చా అని ఆశ్చర్యపోతున్నారట. ఇటీవల ఒక సీనియర్ ఎమ్మెల్యే సైతం ముందు చూపు అంటే ఆ నాయకులదేనని, తాము ఇన్నేళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నా ఇంత తక్కువ కాలంలో ఇంతగా ఎదగవచ్చునని కలకనలేదని, ముందు వచ్చిన చెవుల కంటే వెనుక వచ్చిన కొమ్ములే వాడి అని మరోసారి నిరూపితమైందని ముక్తాయింపునిచ్చారట...