
అచ్చన్నాయుడు ఆధిపత్యానికి ప్రయత్నిస్తున్నారా?
ఎచ్చెర్ల: ఎచ్చెర్ల నియోజక వర్గంలో రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చన్నాయుడు ఆధిపత్యానికి ప్రయత్నిస్తున్నారా? కళా వెంకటరావు ప్రాబల్యం తగ్గించే ప్రయత్నం చేస్తున్నారా?.. ప్రస్తుతం ఈ అంశం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మంత్రి అచ్చన్నాయుడు ఎచ్చెర్ల సమీపంలోని ఎస్.పురంలో గల 21వ శతాబ్ద గురుకులం (జిల్లా వృత్తి విద్యా కే ంద్రం)ను గురువారం అధికారకంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏజేసీ పి.రజనీకాంతరావు, ఎచ్చెర్ల మండలాధికారులు, ఇందిర క్రాంతి పథం అధికారులు పాల్గొన్నారు. అయితే ఎమ్మెల్యే కళా వెంకటరావు, సీనియర్ టీడీపీ నాయకులు, రాష్ట్ర టీడీపీ సభ్యత్వ కన్వీనర్ రాలేదు. వీరికి సమాచారం ఇవ్వలేదని తెలిసింది. ప్రోటోకాల్ ప్రకారం అధికారులు ఎమ్మెల్యే తదితరులకు తప్పని సరిగా సమాచారం ఇవ్వాలి.
అయితే అధికారులు సమాచారం ఇవ్వలేదా? మంత్రినే ఇవ్వవద్దని అధికారులకు సూచించారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఎచ్చెర్ల మండలంలోని ఎంపీటీసీలు సభ్యులు, సర్పంచ్‌లంతా హాజరవగా ఒకరిద్దరు కళావర్గంగా ముద్రపడ్డ వారు మాత్రమే కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు చౌదిరి నారాయణమూర్తి, జిల్లాపరిషత్ ఛైర్ పర్సన్ చౌదిరి ధనలక్ష్మి, ఎంపీపీ బీవీరమణారెడ్డి, ఇతర టీడీపీ నాయకులు సైతం పాల్గొన్నారు. అయితే ఎమ్మెల్యే మాత్రం రాలేదు. మంత్రి, కళా వర్గాలు మధ్య వర్గ విభేదాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. మంత్రివర్గలో విస్తరణలో కళాకు చోటు లభించకపోవటంతో విభేదాలు ఎక్కువయ్యాయి. గతంలో రాజాం నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ కావటంతో కళా ఇక్కడ నుంచి పోటీ చేశారు. 2009 ఎన్నికల్లో పీఆర్‌పీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు.
మళ్లీ టీడీపీలోకి కళా వచ్చినా నాయకులు మధ్య సఖ్యత కుదరలేదు. ప్రస్తుతం ఎచ్చెర్ల నియోజకవర్గం శ్రీకాకుళం సమీపంలో ఉన్నా విజయనగరం పార్లమెంట్ నియోజక వర్గంలో ఉంది. కళా పీఆర్‌పీలో ఉన్న సమయంలో దివంతగ కింజరాపు ఎర్రన్నాయుడు పూర్తిగా ఈ నియోజకవర్గంలో చక్రం తిప్పారు. ఇక్కడ చౌదిరి నారాయణమార్తి, బీవీ రమణారెడ్డి వంటివారిని ప్రోత్సహిస్తూ వచ్చారు. మరో పక్క కళా వెంకటరావు మంత్రి వర్గ విస్తరణలో స్థానం లభించకపోవటం, చౌదిరి ధనలక్ష్మి జడ్పీ ఛైర్‌పర్సన్‌గా ఉంటూ అచ్చెన్నకు విధేయతగా ఉండటంతో కళా వర్గం సైతం ఎక్కుగా పనులు కోసం వీరిపైనే ఆధారపడాల్సి వస్తోంది. కళా వ ర్గాన్ని బలహీన పర్చేందుకు శాయశక్తుల ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణ అచ్చెన్న వర్గంపై ఉంది. ఈనేపథ్యంలో ఎచ్చెర్లలో ప్రోటోకాల్ పాటించకుండా మంత్రి అచ్చన్న కార్యక్రమాలు నిర్వహించటం ఈ ఆరోపణలకు మద్దతు ఇస్తోంది.