APNGOs
హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తున్న ఎపిఎన్జిఓ సంఘం సమ్మెకు దిగాలని నిర్ణయించింది. ఈ నెల 12 అర్థరాత్రి నుంచి సమ్మె చేపట్టాలని ఎపిఎన్జిఓ సంఘం నేతలు తీర్మానించారు. ఈ మేరకు వారు సమ్మె నోటీసును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతికి అందజేశారు. రాజకీయ లబ్ది కోసమే రాష్ట్రాన్ని విభజిస్తున్నారని వారు ఆరోపించారు. దీన్ని తాము సహించమని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. జీతాలు నష్టపోయినా, ఉద్యోగాలకే ప్రమాదం వచ్చినా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే తమ డిమాండ్‌లో మార్పు ఉండదని సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు ప్రకటించారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు యుపిఏ భాగస్వామ్య పక్షాలు, సిడబ్ల్యూసి ఆమోదం తెలపడంతో సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృత రూపం దాల్చింది. ఎపి ఎన్జీఓలు కూడా తమ ఆందోళనను ఉధృతం చేశారు. హైదరాబాద్ నుంచి సీమాంధ్ర ఉద్యోగులు వెళ్లిపోవాలన్న టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు వ్యాఖ్యలు అలజడిని సృష్టించాయి. దాంతో ఎపి ఎన్జీఓలు ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెకు పిలుపు ఇచ్చారు. కేంద్ర మంత్రులు, ఎంపిలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వారి ఇళ్లను కూడా ముట్టడించారు. కొన్ని చోట్ల వారిని నిలదీశారు. ఈ రోజు సమ్మె నోటీసు ఇచ్చారు.