వివాదాల సుడిగుండాలు
తెలంగాణలో స్థానికత
1956కు ముందు నుంచి తెలంగాణలో నివసిస్తున్న వారిని వూత్రమే స్థానికులుగా పరిగణిస్తామని, వారి కుటుంబాల పిల్లలకు మాత్రమే ఫీజుల చెల్లింపు పథకాన్ని (ఫాస్ట్) వర్తింపజేస్తామని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది చట్ట విరుద్ధమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తోంది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే స్థానికతను నిర్ధారించి ఫాస్ట్‌ను వర్తింపజేయాలంటోంది. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించడంలేదు.
ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి 1956 తర్వాత ఇక్కడికి వచ్చి స్థిరపడ్డ కుటుంబాలకు చెందిన పేద విద్యార్థుల పరిస్థితి రెండు ప్రభుత్వాల వ్యవహారశైలి వల్ల ఇబ్బందికరంగా మారింది. 1956 స్థానికత అంశంపై తెలంగాణ ప్రభుత్వం అధికారులతో ఏర్పాటు చేసిన కమిటీ ఉత్తర్వులపై కొందరు కోర్టుకు వెళ్లారు. ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సుల్లో చేరినా ఫీజు చెల్లించే స్తోమత లేక చాలామంది చదువుకు స్వస్తి చెప్పాల్సిన దుస్థితి ఏర్పడింది.
ఉన్నతాధికారుల పంపిణీ
అఖిల భారత సర్వీసు అధికారులను రెండు రాష్ట్రాలకు కేటాయించే ప్రక్రియ కూడా ఆరు నెలల సుదీర్ఘ కాలంలో పూర్తికాలేదు. ఐఏఎస్‌లు చాలనందునే అభివృద్ధి పనుల విషయంలోనూ, విధాన నిర్ణయాల అమల్లోనూ సమస్యలు ఎదుర్కొంటున్నామని, ఈ సమస్య లేకపోతే రాష్ట్ర ప్రగతిని పరుగులు పెట్టించేవారమని స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ అధికారుల పంపిణీ విషయంలో ప్రత్యూష్‌సిన్హా చేసిన కసరత్తుపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పునఃపరిశీలించాలని ఫైలును వెనక్కు పంపినట్లు ఢిల్లీ అధికార వర్గాలు అంటున్నాయి.
ఎన్‌జీ రంగా వర్సిటీ పేరు మార్పు
ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని విభజించకముందే తెలంగాణ ప్రభుత్వం జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అనే పేరు పెట్టి ఉన్నతాధికారిని కూడా నియమించడం వివాదాస్పదంగా మారింది. అంబేద్కర్ విశ్వవిద్యాలయం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, ద్రవిడ యూనివర్సిటీల విభజన విషయంలో ఇరు ప్రభుత్వాలు చర్చించి సానుకూల నిర్ణయం తీసుకున్నట్లే వ్యవసాయ విశ్వవిద్యాలయం విషయంలోనూ తీసుకుంటే సమస్యే ఉండేది కాదనే అభిప్రాయం రెండు రాష్ట్రాల ఉన్నతాధికారుల్లో ఉంది.
నాక్‌పై సీఎంల బెట్టు
నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ విషయంలోనూ ఇరు రాష్ట్రాలు బెట్టుకుపోతున్నాయి. సహకార సంస్థ కింద ఏర్పాటైన నాక్‌లో డెరైక్టర్‌గా భిక్షమయ్యను నియమించి ఆ సంస్థను తెలంగాణ ప్రభుత్వం తన అధీనంలోకి తెచ్చుకునే యత్నం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యకార్యదర్శి శాంబాబ్‌ను డెరైక్టర్ జనరల్‌గా నియమించడం, ఆయన బాధ్యతలు తీసుకోవడానికి వెళ్లడంతో అడ్డుకోవడం వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాక్ పాలక మండలిని పునర్‌వ్యవస్థీకరిస్తూ.. ముఖ్యమంత్రి చైర్మన్‌గా ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మరుసటి రోజే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం అధ్యక్షతన పాలక మండలిని నియమించింది. తరచుగా సీఎం కేసీఆర్ నాక్‌లోనే కూర్చుని వ్యూహాలు రచిస్తుండడం గమనార్హం.
రాష్ట్ర ఉద్యోగుల విభజన
రాష్ట్రస్థాయి ఉద్యోగుల విభజనకు సంబంధించి కమల్‌నాథన్ కమిటీ గత ఆరు నెలల కాలంలో ఎన్నిసార్లు సమావేశమైనా ఇంకా ఈ కసరత్తు పూర్తికాలేదు. వచ్చే మార్చి నాటికి గాని పూర్తి చేయలేమని స్వయంగా కమల్‌నాథన్ వ్యాఖ్యానించడం గమనార్హం.
ప్రభుత్వ రంగ సంస్థలపై వైరం
రాష్ట్ర పునర్‌వ్యవస్థీరణ చట్టం ప్రకారం జనాభా ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు 58: 42 నిష్పత్తిలో వాటాలు కలిగిన ప్రభుత్వ రంగ సంస్థల బ్యాంకు అకౌంట్ల ఫ్రీజ్ వల్ల అనేక సవుస్యలు ఎదుర్కొంటున్నాయి. పునర్‌వ్యవస్థీకరణ చట్టం తొమ్మిదో షెడ్యూలులో ఉన్న సంస్థల ఆస్తుల వాటాల విషయంలోనూ, విభజన పూర్తయ్యే వరకూ సమన్వయంతో నడుపుకునే అంశంలోనూ రెండు రాష్ట్రాలు సరైన విధంగా వ్యవహరించలేకపోయాయి.
కార్మిక సంక్షేమ నిధికి చెందిన ఫిక్స్‌డ్ డిపాజిట్లలో రూ. 428 కోట్ల మొత్తాన్ని, ఇరు రాష్ట్రాలకు చెందాల్సిన ఆంధ్రప్రదేశ్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీకి చెందిన రూ. 28 కోట్లను హైదరాబాద్ బ్యాంకు నుంచి తమకు తెలపకుండా విజయవాడలోని బ్యాంకుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరలించిందంటూ తెలంగాణ ప్రభుత్వం ఏకంగా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందంటే రెండు రాష్ట్రాల మధ్య వైరం ఏస్థాయిలో ఉందో అర్థమవుతోంది. దీని ప్రభావం తొమ్మిదో షెడ్యూలులోని ప్రభుత్వ రంగ సంస్థలపై పడింది.
నిథిమ్‌పై పంతాలు
నిథిమ్ సంస్థ విషయంలో ఇరు రాష్ట్రాలు పంతాలకు వెళ్లాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి చందనాఖన్ నిథిమ్‌లో బాధ్యతలు నిర్వహించడానికి వెళ్లడంతో ఆమెను తెలంగాణ ఉద్యోగులు అడ్డుకోవడం, ఆమె అక్కడే ధర్నా చేయడం వంటి వివాదాలు తలెత్తాయి.
గవర్నర్ అధికారాలపైనా
రెండు రాష్ట్రాలకు ఒకే గవర్నర్ ఉండటం, ఆయనకు విశేషాధికారాలు కల్పించడంపై తెలంగాణ సర్కారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై ఏకంగా పార్లమెంట్‌లోనే తన నిరసన తెలియజేసింది.
టెర్మినల్‌కు ఎన్‌టీఆర్ పేరు పైనా
తాజాగా రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్‌టీఆర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ తెలంగాణ సర్కారు అసెంబ్లీలో తీర్మానం చేసింది.
ఆరోగ్యశ్రీ ట్రస్టు పరిస్థితి
ప్రస్తుతం ఉభయ రాష్ట్రాలకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఒకటే పనిచేస్తోంది. ఇప్పటికే దీన్ని విభజించాలని తెలంగాణ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మరో రెండు మాసాల్లో ఈ విభజన జరగొచ్చు. అయితే పేషెంట్లకు రోగనిర్ధారణ, ఆస్పత్రులకు ఆర్థిక అనుమతులు అన్నీ ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. ఆరోగ్యశ్రీ విడిపోతే ట్రస్ట్ కార్యాలయ భవనం తెలంగాణకు వెళుతుంది. ఆ తర్వాత ఇలాంటి సాంకేతిక సంపత్తిని ఏర్పాటు చేసుకోవడంలో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి.