ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతానికే
* రాష్ట్రస్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీపై అధికార యంత్రాంగం నిర్ణయం
* తొలుత ప్రొవిజనల్ జాబితా.. జీవో 610 ఆధారంగా స్థానికత
* తెలంగాణ రాష్ట్రానికి ఉద్యోగులు కేటాయిస్తూ మే 25లోగా ఆదేశాలు
* రెండు ప్రభుత్వాలు ఏర్పాటయ్యాకే ఉద్యోగుల తుది పంపిణీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీని మే 25లోగా పూర్తి చేయాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. తొలుత ఏ ప్రాంతానికి చెందినవారిని ఆ ప్రాంతానికే కేటాయిస్తూ ప్రొవిజనల్ జాబితాను విడుదల చేయనున్నారు. జీవో 610 ప్రాతిపదికన స్థానికతను పరిగణనలోకి తీసుకోవాలని ఉద్యోగుల పంపిణీపై సీనియర్ ఐఏఎస్ అధికారి కమలనాథన్ అధ్యక్షతన ఏర్పాటైన రాష్ట్ర సలహా కమిటీ నిర్ణయానికి వచ్చింది.
జీవో 610 మేరకు నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు నాలుగేళ్లు ఎక్కడ చదివితే దానినే స్థానికతగా పరిగణనలోకి తీసుకోనున్నారు. ఈ మేరకు మే 25లోగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఉద్యోగులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. మిగిలిన ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందినవారుగా పరిగణిస్తారు. వారి గురించి ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదని అధికారులు తేల్చారు.
ఉద్యోగుల తుది పంపిణీని మాత్రం ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఏర్పాటైన తర్వాతే చేయాలని రాష్ట్ర సలహా కమిటీ నిర్ణయించింది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించిన తర్వాతే ఉద్యోగుల తుది పంపిణీని పూర్తి చేయాలని అది భావిస్తోంది. ప్రభుత్వాలు ఏర్పాటు కాకుండా ఉద్యోగుల తుది పంపిణీ సాధ్యం కాదని, ఇందులో వచ్చే సమస్యలను ఇప్పుడు పరిష్కరించలేమని అధికారులు చేతులెత్తేశారు.
8న సలహా కమిటీ భేటీ
ఉద్యోగుల పంపిణీకి సంబంధించిన కీలకమైన మార్గదర్శకాలను ఖరారు చేయడం కోసం ఈ నెల 8న ఢిల్లీలో కమలనాథన్ అధ్యక్షతన రాష్ట్ర సలహా కమిటీ సమావేశం కానుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పి.వి.రమేశ్, సాగునీటి శాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి, ఏపీఐఐసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ జయేశ్‌రంజన్, బి.వెంకటేశం, కేంద్ర వ్యక్తిగత సిబ్బంది, శిక్షణ విభాగం సంయుక్త కార్యదర్శి అర్చన వర్మ ఈ భేటీలో పాల్గొంటారు.
ఈ సమావేశంలో ఖరారు చేసే మార్గదర్శకాలకు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ ఆమోదం కూడా తీసుకోవాల్సి ఉంది. ఎన్నికలు పూర్తయిన తర్వాత ప్రధాని ఎటువంటి ఆమోదాలు తెలపరని రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. దీంతో రాష్ట్ర విభజనకు సంబంధించి రాష్ట్రస్థాయి ఉద్యోగులు, అఖిల భారత సర్వీసు అధికారుల పంపిణీ మార్గదర్శకాలపై ఈ నెల 12లోగానే ప్రధాని చేత ఆమోదం పొందాలని అధికార యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర స్థాయి ఉద్యోగుల పంపిణీలో భార్య-భర్త, ఎస్సీ, ఎస్టీ, అనారోగ్యం, ఐదేళ్లలో పదవీ విరమణ చేసే ఉద్యోగులకు ఆప్షన్లను రాష్ట్ర సలహా కమిటీ మార్గదర్శకాల్లో ప్రతిపాదించనుంది.