అమరావతి: అంకెలు ఘనంగా ఉన్నాయ్... చూపడానికే తప్ప ఖర్చు చేసేందుకు కాదన్నట్లుగా ప్రభుత్వం బడ్జెట్‌ను రూపొందించి అపహాస్యం చేసిందని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. శాసనసభ, మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2017–18 బడ్జెట్ కేటాయింపులపై ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మూడు బడ్జెట్‌లలో కేటాయించిన నిధుల్లో 30 శాతం మించి ఖర్చు చేయలేదని, ఈ ఏడాది కూడా అంతేనని అన్నారు. రైతు రుణమాఫీకి ఈ బడ్జెట్‌లోనూ అన్యాయమే జరిగిందన్నారు. ప్రస్తుతం కేటాయించిన రూ.3,600 కోట్లు వడ్డీకి కూడా సరిపోవన్నారు. మొత్తంగా ఇప్పటివరకు కేటాయించిన నిధులు రూ.12,200 కోట్లు మాత్రమేనన్నారు. అంటే చంద్రబాబు కుదించిన రూ. 24 వేల కోట్లకు కూడా రుణమాఫీ చేయడం లేదని కేటాయింపులనుబట్టి అర్థమవుతోందన్నారు.
డ్వాక్రా గ్రూపు సభ్యులకు రూ.1600 కోట్లు క్యాపిటల్ ఇన్‌ఫ్యూజన్ పేరుతో కేటాయింపులు చేశారని, దీన్నిబట్టి చూస్తే డ్వాక్రా రుణాల మాఫీ కూడా లేనట్లేనని ఆయన అన్నారు. నిరుద్యోగ యువతకు రూ.2 వేలు ఇస్తామని ఎన్నికలపుడు హామీ ఇచ్చి ప్రస్తుత బడ్జెట్‌లో వారికి ఆర్థిక సహాయం పేరిట రూ.500 కోట్లు కేటాయించారని, ఈ లెక్కన ఒక్కొక్కరికి రూ.100లు కూడా రావన్నారు. బడ్జెట్ సందర్భంగా ఇప్పటివరకు కేవలం 869 ఉద్యోగాలు ఇచ్చామని, మరో 10 వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన విషయాన్ని పరిశీలిస్తే ఇంటికో ఉద్యోగం హామీ కూడా మోసమేనని తేలిపోయిందన్నారు. విద్యుత్ రంగానికి బడ్జెట్‌లో రూ.3,735 కోట్ల కేటాయింపులు చూపించారని, అయితే ఇందులో సుమారు రూ.2 వేల కోట్లు సబ్సిడీకే సరిపోతుందన్నారు. కనుక విద్యుత్ చార్జీలను పెంచి ఆర్థిక లోటును పూడ్చుకోవాలనే ప్రభుత్వం ఆలోచన చేస్తున్నటు అర్థమవుతోందన్నారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు పేదలకు ఒక్క ఇల్లూ నిర్మించలేదు.. ఈ బడ్జెట్‌లో కేటాయించిన రూ.1457 కోట్లు జీతభత్యాలకే సరిపోతాయన్నారు. గూడు లేని పేదలకు ఈ బడ్జెట్‌లో కూడా తీవ్ర అన్యాయమే చేశారన్నారు. ప్రత్యేక హోదాను 14వ ఆర్థిక సంఘం వద్దని చెప్పిందనడం పచ్చి అబద్ధమన్నారు. బడ్జెట్ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా వద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పిందని ఆర్థిక మంత్రి ప్రకటించడం రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించడానికేనని రఘువీరా విమర్శించారు. కరవు సహాయం ప్రస్తావన కూడా బడ్జెట్‌లో లేకపోవడం శోచనీయమన్నారు.
‘రైతు రుణమాఫీకి బడ్జెట్‌లో అన్యాయం’
Published Wed, Mar 15 2017 7:33 PM | Last Updated on Fri, Jul 12 2019 6:01 PM
Advertisement
Advertisement