'అశోక్బాబుకు ఇంగిత జ్ఞానం లేదా'
ఏపీఎన్జీవో తాత్కాలిక అధ్యక్షుడు పి.అశోక్బాబుది ఏకపక్ష ధోరణితో నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఏపీఎన్జీవో నేత సుబ్బరాయన్ ఆరోపించారు. శనివారం హైదరాబాద్లోని సచివాలయంలో సుబ్బరాయన్ మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ ఏపీఎన్జీవోలు గతంతో 66 రోజులు ఉద్యమాన్ని చేశారు. ఆ ఉద్యమాన్ని నీరుగార్చిన ఘనత అశోక్ బాబుదని ఆయన వ్యాఖ్యానించారు. చరిత్రాత్మక ఏపీఎన్జనీవో సంస్థ ఇప్పుడు అసమర్థ నాయకత్వం కింద నడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ రకంగా స్వార్థపరుల నాయకత్వం కింద ఏపీఎన్జీవో నడుస్తోందన్నారు.
రాజకీయ లబ్దికోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం సమైక్య ఉద్యమాన్ని వాడుకున్నారంటూ ఆయన అశోక్బాబుపై నిప్పులు చెరిగారు. రాజకీయ నేతలను కూడా ఉద్యమంలోకి రానీయలేదని సుబ్బరాయన్ పేర్కొన్నారు. రాజకీయపార్టీలను కలుపుకోకపోతే విభజన బిల్లును అసెంబ్లీ, పార్లమెంట్లలో అడ్డుకునేది ఎవరని ఆయన ప్రశ్నించారు. ఒక్క ఉద్యోగులు ఉద్యమం చేస్తే రాజకీయ నిర్ణయం మారుతుందా అంటు అశోక్బాబుపై మండిపడ్డారు. అశోక్బాబు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా అని ప్రశ్నించారు.
అశోక్బాబు దిశా నిర్దేశం లేని వ్యక్తి అని సుబ్బరాయన్ అభివర్ణించారు. అశోక్బాబు కేవలం ఒక్క రాజకీయాల గురించి మాత్రమే మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ ఉద్యోగసంఘాలు చేపట్టిన ఉద్యమాన్ని చూసి అశోక్ బాబు పాఠాలు కూడా నేర్చుకోలేదని వ్యాఖ్యానించారు. అశోక్బాబు కనీసం పొలిటికల్ జేఏసీని కూడా నిర్మాణం చేయలేదని సుబ్బరాయన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.