ఆయన మాట.. లక్షల మంది ఉద్యోగుల జీవితాలకు ప్రగతి బాటఆయన లక్ష్యం.. ప్రతి ఉద్యోగీ తన గుండెలపై చేయి వేసుకుని నిర్భయంగా జీవించడమే ధ్యేయంఆయన మార్గం.. సమస్యలను పారదోలుతూ సాగిపోయే సంక్షేమ పయనం.. ఇదిగో శాసన సభ వేదికగా ఆమోదించిన మరో చారిత్రాత్మక బిల్లే దీనికి సాక్ష్యం. ..ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమవ్వాలనే కల.. ఏళ్ల తరబడి శిలగా మారిన వేళ.. పాదయాత్రికుడై వచ్చిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేనున్నానంటూ అభయమిచ్చారు. ఆనాడే కార్మికుల గుండెల్లో ఆవేదన తడిని చూసి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని ప్రకటించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి అధికారం చేపట్టిన కొద్ది రోజుల్లోనే కమిటీ ఏర్పాటు చేసి.. హామీ అమలుకు ముందడుగు వేశారు. ఇప్పుడు శాసన సభలో విలీన బిల్లుకు పచ్చజెండా ఊపి ఆర్టీసీ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపారు.
సాక్షి, గుంటూరు: ప్రజా సంకల్పయాత్ర, సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన వాగ్దానాన్ని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిలబెట్టుకున్నారు. ప్రపంచం మొత్తం ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తున్న సమయంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి చరిత్ర సృష్టించారు. ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును సోమవారం శాసన సభ ఆమోదించింది. ఈ బిల్లుతో ఆర్టీసీ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇకపై కార్మికులు కాదు..
ప్రభుత్వం తీసుకువచ్చే ఏపీఎస్ ఆర్టీసీ విలీనం చట్టం ద్వారా ఇప్పటి వరకు ప్రభుత్వ అనుబంధ సంస్థగా ఉన్న ఆర్టీసీ.. పూర్తిగా ప్రభుత్వ సంస్థ మారనుంది. ఆర్టీసీ కార్మికులు సైతం రాబోయే రోజుల్లో ఉద్యోగులుగా మారనున్నారు. జనవరి 1 నుంచి ఆర్టీసీ కార్మికులంతా పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపబడతారు. జిల్లాలో డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది కలిపి 4,851 మంది ఆర్టీసీ కార్మికులు ఉన్నారు. వీరంతా జనవరి 1 తర్వాత ప్రభుత్వ ఉద్యోగులే.
చరిత్రలో నిలిచిపోతారు..
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రజా సంకల్పయాత్రలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజుల్లోనే ఇందు కోసం కమిటీని ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వం ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయడానికి కుదరదని చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా 52 వేల మంది ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించిన సీఎం జగన్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు.
– ఎం హనుమంతరావు,స్టేట్ ఎంప్లాయిస్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్
Comments
Please login to add a commentAdd a comment