విడిపోతే ఆర్టీసీ మూతే
సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే ఐదున్నర వేల కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్న ఆర్టీసీ రాష్ట్ర విభజన జరిగిన మరుక్షణం మూతపడుతుందని, సీమాంధ్ర 13 జిల్లాల్లోని 70 వేలకు పైగా ఉద్యోగులు రోడ్డున పడుతారని ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు చంద్రశేఖరరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సీమాంధ్ర ప్రాంతం నుంచి హైదరాబాద్ నగరానికి బస్సులు నడుస్తున్నందునే ఆదాయం వస్తోందని, ఆ బస్సులు రావడం ఆగిపోతే ఆర్టీసీ మూసేయక తప్పదని ఆయన హెచ్చరించారు. సమైక్య రాష్ట్రపరిరక్షణ వేదిక పేరిట ఏపీఎన్జీవోలు శనివారం ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆర్టీసీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఓ శాఖగా నడిపించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర విభజన తప్పదు.. మీకేం కావాలో అడగండంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ చెబుతున్నారని, గతంలో విశాలాంధ్ర కోసం ఇప్పటికే కర్నూలు రాజధానిని వదులుకున్నామని, ఖనిజ సంపద అధికంగా ఉన్న బళ్లారి జిల్లాను, తుంగభద్ర నీటిని కూడా వదులుకున్నామని వాటిని తిరిగి ఇస్తారా? అని ఆయన ప్రశ్నించారు. 60 సంవత్సరాల తర్వాత ఇప్పుడు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను వదులుకోవాలంటే తాము కట్టుబట్టలతో వె ళ్లిపోవాలా? అని నిలదీశారు. తాము చేస్తున్న ఉద్యమం తెలంగాణ ప్రాంతానికి లేదా ఆ ప్రాంత ప్రజలకు వ్యతిరేకం కాదని చంద్రశేఖరరెడ్డి స్పష్టం చేశారు. తమ ప్రాంతంలో విశాఖ ఉక్కు మినహా ఒక్క భారీ పరిశ్రమనైనా ఏర్పాటు చేశారా? అని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన జరిగితే రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లోని కరువు ప్రాంతాలు ఎడారిగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా నదిపై నిర్మిస్తున్న పలు ప్రాజెక్టులు మిగులు జలాలపై ఆధారపడి నిర్మిస్తున్నారని అలాంటి ప్రాజెక్టుల మనుగడ ప్రశ్నార్థకమవుతుందన్నారు. కర్నూలు రాజధానిని త్యాగం చేయడం వల్లనే హైదరాబాద్ అభివృద్ధి వెలుగుల్లో మెరిసిపోతోందని ఆయన పేర్కొన్నారు.