సాక్షి, హైదారబాద్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఏపీఎస్ ఆర్టీసీ ఎన్‌ఎంయూ సీమాంధ్ర కమిటీ బుధవారం ఆర్టీసీ ఎండీకి సమ్మె నోటీసు ఇచ్చింది. గుంటూరు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు నోటీసు ఇచ్చినట్టు ఆ విభాగం అదనపు ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. వెంటనే రాష్ట్ర విభజన ప్రక్రియను నిలిపివేయాలని, ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేనిపక్షంలో సమ్మెకు దిగుతామని అందులో పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్ర విభజన ప్రక్రియను నిలిపివేస్తే మెరుపు సమ్మెకు దిగుతామని ఎన్‌ఎంయూ తెలంగాణ ప్రాంత కమిటీ హెచ్చరించింది. సమ్మెకు దిగకుండానే సీమాంధ్ర ఉద్యమానికి సంఘీభావం తెలపాలని ఎంప్లాయీస్ యూనియన్ భావిస్తోంది. గురువారం జరిగే బంద్‌కు మద్దతివ్వాలని తీర్మానించింది.