సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఇప్పటికే ఎంప్లాయీస్ యూనియన్, టీజేఎంయూ సమ్మె నోటీసు ఇవ్వగా, గుర్తింపు కార్మిక సంఘమైన టీఎంయూ, మరో ప్రధాన సంఘం ఎన్‌ఎంయూలు బుధవారం నోటీసులిచ్చాయి. టీఎంయూ నేతలు అశ్వత్థామరెడ్డి, థామస్‌రెడ్డి తదితరులు బస్‌భవన్‌లో ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మకు సమ్మె నోటీసు ఇచ్చారు. ఎన్‌ఎంయూ నేతలు కూడా మంత్రి సమక్షంలోనే ఇన్‌చార్జి ఎండీకి సమ్మె నోటీసు ఇచ్చారు.
ఈ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులతో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ బస్‌భవన్‌లో అత్యవరసర భేటీ అయ్యారు. అయితే రవాణా శాఖ మంత్రిగా కొత్తగా బాధ్యతలు స్వీకరించడంతో ఆర్టీసీ, రవాణా శాఖలపై అవగాహన, అధికారులతో పరిచయం కోసమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారని చెబుతున్నారు. సంస్థ ప్రస్తుత పరిస్థితి, అప్పులు, వాటిపై చెల్లిస్తున్న వడ్డీ, వేతనాలకు డబ్బుల్లేని పరిస్థితి ఉందని అధికారులు వివరించారు. ఆర్టీసీలో సమ్మె మొదలైతే తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు.
వీటిపై తాను ముఖ్యమంత్రితో మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చారు. ఆర్టీసీకి ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ నుంచి రావాల్సిన పెండింగ్ బకాయిలు విడుదలయ్యేలా చూస్తానని పేర్కొన్నారు. కాగా, ఆర్టీసీ కూడా సొంత వనరులు పెంచుకోవాలని, ఆదాయాన్ని పెంచుకునేలా ప్రణాళికలు రూపొందించాలని మంత్రి సూచించారు. ఈ సందర్భంగా సంస్థ స్వరూపం, బస్సుల నిర్వహణ, సంస్థాగత విషయాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు.
కాగా, సమావేశానికి ముందు ఎన్‌ఎంయూ నేత నాగేశ్వర్‌రావు ఆధ్వర్యంలో బస్‌భవన్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. బడ్జెట్‌లో ఆర్టీసీకి కేవలం రూ.550 కేటాయించటం సంస్థను అవమానపరచడమే అని ఆరోపించారు. రూ.800 కోట్ల పాతబకాయిలు చెల్లించి బడ్జెట్ కేటాయింపులను కనీసం రూ.3 వేల కోట్లకు పెంచాలని డిమాండ్ చేశారు. కార్మిక సంఘాల డిమాండ్లపై తాను సీఎంతో మాట్లాడతానని, ఎవరూ తొందరపడొద్దని కార్మిక సంఘాల నేతలకు మంత్రి హామీ ఇచ్చారు.
రవాణా శాఖ అధికారులతోనూ..
రవాణా శాఖ అధికారులతోనూ మంత్రి సుదీర్ఘరంగా చర్చించారు. రవాణా శాఖ సమకూర్చుకుంటున్న ఆదాయంతో పాటు విధివిధానాలను మంత్రి తెలుసుకున్నారు. శాఖలో పారదర్శకత కోసం ఆన్‌లైన్ విధానంతో పాటు ఎం–వాలెట్ సేవల్ని అందుబాటులోకి తీసుకురావడంతో పాటు చెక్‌పోస్టుల దగ్గర వాహనాలను తనిఖీ చేయడం, అక్రమ రవాణాను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. 2019 ఆగస్టు వరకు రూ.1,418 కోట్లు ఆదాయం వచ్చిందని, రోడ్డు భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు.
పర్యావరణానికి హాని కలిగేలా ఉన్న వాహనాల నియంత్రణపై దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు. సమావేశంలో రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, ఆర్టీసీ ఈడీలు పురుషోత్తం నాయక్, టీవీ రావు, యాదగిరి, రవాణా శాఖ సంయుక్త కమిషనర్లు రమేశ్, పాండురంగ నాయక్‌తోపాటు పలువురు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment