
ఆర్చరీలో హ్యాట్రిక్‌తో అదరగొట్టిన ఆణిముత్యం
విజయవాడ స్పోర్ట్స్, న్యూస్‌లైన్ : ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో జరుగుతున్న చెరుకూరి లెనిన్-ఓల్గా స్మారక 6వ మినీ జాతీయ ఆర్చరీ పోటీలలో ఓల్గా ఆర్చరీ అకాడమీకి చెందిన ఆర్చర్ కె.జ్యోత్స్న మరోసారి సత్తాచాటింది. కాంపౌండ్ బాలికల విభాగం, వ్యక్తిగత ఒలింపిక్ రౌండ్‌లో వరుసగా మూడో ఏడాది స్వర్ణపతకం సాధించింది. శుక్రవారం జరిగిన ఈ పోటీలో 139 పాయింట్లు సాధించింది. సమీప ప్రత్యర్థిపై 15 పాయింట్లు ఆధిక్యంతో విజయం అందుకుంది.
రెండో రోజు ఫలితాలు..
కాంపౌండ్ విభాగం బాలుర వ్యక్తిగత ఒలింపిక్ రౌండ్‌లో మైనేని చరిత్ రజత పతకం కైవసం చేసుకున్నాడు. కాగా క్వాలిఫయింగ్ రౌండ్‌లో టాపర్‌గా నిలిచిన (ఓల్గా) ఆర్చర్ మహేష్ ఒలింపిక్ రౌండ్‌లో క్వార్టర్ ఫైనల్‌లో ఓటమి చవిచూశాడు. మరో పూల్ నుంచి దూసుకువచ్చిన మైనేని చరిత్ సెమీస్‌లో జార్ఖండ్ ఆర్చర్‌పై గెలుపొంది, మహారాష్ట్ర ఆర్చర్‌పై ఫైనల్‌లో ఓడిపోయాడు.
రికర్వు విభాగంలో మహారాష్ట్ర ఆర్చర్లు సత్తా చాటగా, 30 మీటర్లు, 20 మీటర్ల విభాగం రెండింటిలోనూ బొమ్మదేవర ధీరజ్ స్వర్ణపతకాలు గెలుపొందాడు.
బాలుర రికర్వు 50 మీటర్ల విభాగంలో మహారాష్ట్రకు చెందిన యష్‌దీప్ బోగే, అషతోష్‌బడే, అలోక్ గౌరవ్, 40 మీటర్ల విభాగంలో యష్‌దీప్ భోగే (మహారాష్ట్ర), సురయ్‌జముదా(జార్ఖండ్), అషతోష్ బడే (జార్ఖండ్), 30 మీటర్ల విభాగంలో బి.ధీరజ్(ఏపీ), యష్‌దీప్ భోగే(మహారాష్ట్ర), సురాయ్ జముదా (జార్ఖండ్), 20 మీటర్ల విభాగంలో బి.ధీరజ్(ఏపీ), సీహెచ్.రిష్‌కేష్ సింగ్(మణిపూర్), యషదీప్‌భోగే (మహారాష్ట్ర) వరుసగా మొదటి మూడు స్థానాలు కైవసం చేసుకున్నారు.
బాలికల రికర్వు 50 మీటర్ల విభాగంలో మధురా, ఉన్నాటి రవి (మహారాష్ట్ర), బీఎం రిత్విక (ఏపీ), 40 మీటర్ల విభాగంలో కెతికీ జాదవ్ , ఉన్నాటి రవి, మధురా(మహారాష్ట్ర), 30 మీటర్ల విభాగంలో ఉన్నాటి రవి, రాధాశర్మ(ఢిల్లీ), వై.రోషిణీ దేవి(మణీపూర్), 20 మీటర్ల విభాగంలో ఆర్.రోషిణీదేవి (మణీపూర్), రాధాశర్మ(ఢిల్లీ), కెట్కిజాదవ్ (మహారాష్ట్ర) వరుసగా మొదటి మూడు స్థానాలు కైవసం చేసుకున్నారు.
ఇండియన్ రౌండ్ బౌ 30 మీటర్ల బాలికల విభాగంలో బి.నవ్యశ్రీ(ఏపీ) స్వర్ణపతకం సాధించగా, సిజాసబరిన్(అసోం), కోమలిక బారీ (జార్ఖండ్), 20 మీటర్ల విభాగంలో బంకీరా, కోమలిక బారీ’(జార్ఖండ్), జ్యోతి (హర్యానా) వరుసగా మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. శనివారం కాంపౌండ్ మిక్సిడ్ రౌండ్, రికర్వు ఒలింపిక్ రౌండ్ పోటీలు జరుగనున్నాయి. కాగా, మ్యాచ్‌లు అనంతరం ఆట విడుపు కోసం ఏర్పాటు చేసి డీజే కార్యక్రమంలో ఆర్చర్లు సందడిచేశారు.