శ్రీకాకుళం పాతబస్టాండ్: బీసీ లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేసి పది నెలలు గడిచింది. రుణాలను సద్వినియోగం చేసుకున్నారు. కొందరు బ్యాంకులకు తిరిగి చెల్లించారు. వీరికి ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి రాయితీ మాత్రం విడుదల కాలేదు. మరో రెండు నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ఈ లోగా రాయితీలు మంజూరు చేయాలంటూ అధికారులు, నేతలకు విన్నవిస్తున్నా పట్టించుకునేవారే లేరు. ఈ ఏడాది బీసీ రుణాలు కూడా పూర్తిగా మంజూరు కాకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
నిబంధనల పేరిట జాప్యం
రాష్ట్ర ప్రభుత్వం జన్మభూమి కమిటీ సిఫార్సులు, నిబంధనల పేరిట గత ఏడాది రుణాల మంజూరులో జాప్యం చేసింది. మార్చిలో అందాల్సిన రుణాలు జూన్‌లో అందజేశారు. ఎంపిక చేసిన లబ్ధిదారులు జాబితాలను బీసీ కార్పొరేషన్ అధికారులు ఆన్‌లైన్ చేసి ప్రభుత్వానికి నివేదించారు. దీనిప్రకారం రాయితీలు లబ్ధిదారుల ఖాతాలకు ప్రభుత్వం జమచేయాలి. ఇంతవరకు సగం మందికి రాయితీ డబ్బులు జమకాకపోవడంతో బీసీ కార్పొరేషన్ కార్యాలయం, బ్యాంకుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు.
గత ఏడాదీ ఇదే పరిస్థితి...
2014-15 సంవత్సరానికి జిల్లాకు బీసీ కార్పొరేషన్ నుంచి 8,725 యూనిట్లకు రూ.23.96 కోట్లు రుణాలు అందజేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. వీటికోసం మున్సిపాలిటీలు, మండలాల్లో లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఈ ప్రక్రియ మార్చి 2015 నాటికి పూర్తిచేసి, సబ్సీడీ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా అధికారులు సిపార్సు చేశారు. వీటిలో 6,550 యూనిట్లు మంజూరీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇస్తూ వీటికి గాను *18.45 కోట్లు మంజూరు చేసేందుకు అనుమతులు ఇచ్చింది. వీటిలో ఇప్పటి వరకు 2690 యూనిట్లుకు రూ.7.71కోట్ల రాయితీ మాత్రమే విడుదల చేసింది. 3,097 యూనిట్లకు రూ.8.70 కోట్ల రాయితీని ఇంతవరకు ప్రభుత్వం విడుదల చేయలేదు.
అందని ‘అభ్యుదయం’
బీసీ అభ్యుదయ యోజన పథకం కింద మంజూచేయాల్సిన రాయితీలదీ ఇదే పరిస్థితి. జిల్లాలో 701 యూనిట్లకు రూ. 1.9 కోట్లు లక్ష్యంగా తీసుకోగా, వీటిలో 628 యూనిట్లకు రూ.1.7 కోట్లు విడుదల చేయడానికి అనుమతులిచ్చింది. ఇంతవరకు 303 యూనిట్లకు రూ.86.35 లక్షలు సబ్సిడీని విడుదల చేసింది. ఇంకా 224 యూనిట్లకు రూ. 63 లక్షలు రాయితీని విడుదల చేయాల్సి ఉంది. 2014-15 సంవత్సరానికి సంబంధించి వ్యక్తిగత యూనిట్లకు, అభ్యుదయ యోజన యూనిట్లకు కలిపి రూ.9 కోట్లకు పైగా రాయితీని విడుదల చేయాల్సి ఉంది. దీనికోసం జిల్లాలో 3,321 యూనిట్లకు సంబంధించిన లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.
ఎంపికలే జరగలేదు...
2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 5,547 యూనిట్లు లక్ష్యంగా తీసుకుంటే ఇప్పటివరకు ఈ యూనిట్లకు సంబంధించిన ఎంపికలు గ్రామ, మండలస్థాయిలో పూర్తి కాలేదు. ఇక ఈ ఏడాది రుణాలు విడుదల ఎప్పుడు జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు.
బీసీలకు అందని రుణ రాయితీలు
Published Fri, Jan 15 2016 12:26 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement