వీరఘట్టం బాలికోన్నత పాఠశాలలో పరీక్ష తీరు పరిశీలిస్తున్న రాష్ట్ర పరిశీలకులు అరుణకుమారి
వీరఘట్టం: పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడితే డీబార్ చేస్తామని, మాస్ కాపీయింగ్‌కు ప్రోత్సహించే ఇన్విజిలేటర్లను సస్పెండ్ చేస్తామని రాష్ట్ర పరిశీలకులు ఎస్.అరుణకుమారి హెచ్చరించారు. వీరఘట్టంలో బాలుర, బాలికోన్నత పాఠశాలల్లో జరుగుతున్న పదో తరగతి పరీక్షలను ఆమె శుక్రవారం పరిశీలించారు. ఇక్కడ ఇన్విజిలేషన్ నియామకాల్లో గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు చిలిచిలికి గాలివానలా మారడంతో గురువారం ఇన్విజిలేషన్ చేసిన ఉపాధ్యాయులను క్షణాల్లో రిలీవ్ చేసి వీరి స్థానంలో 22 మంది ఉపాధ్యాయులకు శుక్రవారం ఇన్విజిలేషన్ బాధ్యతలు అప్పగించారు. వెంటనే ఎంఈఓ జి.సుబ్రహ్మణ్యం ఈ రెండు పాఠశాలలకు చెరో 11 మందిని కేటాయించారు. అనంతరం అరుణకుమారి బాలుర, బాలికోన్నత పాఠశాలల పరీక్షా కేంద్రాల్లోని ప్రతీ గదిని క్షుణ్ణంగా పరిశీలించారు. మంచి వాతావరణంలో పరీక్షలు జరుగుతున్నప్పుడు ఎందుకు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఇద్దరు హెచ్‌ఎంలు డి.నాగమణి, ఎం.వి.నర్శంగరావును ప్రశ్నించారు. ఇక మీదట జరగబోయే పరీక్షలన్నింటినీ పక్కాగా నిర్వహించాలని స ూచించారు.
విద్యార్థులు బెంగ పడవద్దు
ఉపాధ్యాయుల మధ్య జరిగిన తగాదా చివరకు పరీక్షా కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా ముద్ర పడేలా చేసిందని అరుణకుమారి పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరుగుతుంటే ఎందుకు మాస్‌కాపీయింగ్ జరుగుతున్నట్టు పత్రికల్లో వార్తలు వచ్చాయని చీఫ్, డిపార్ట్‌మెంట్ అధికారులను ప్రశ్నించారు. ఎటువంటి బెంగ పడకుండా పరీక్షలను ప్రశాంతంగా రాయాలని విద్యార్థులకు సూచించారు. అయితే శుక్రవారం పరీక్షలు ప్రారంభమయినప్పటి నుంచి ముగిసే వరకు వరుసగా జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న అధికారులు వచ్చి పరీక్షల తీరు పరిశీలించడంతో విద్యార్థులు బిక్కు బిక్కుమంటూ పరీక్షలు రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సిట్టింగ్ స్క్వాడ్‌ల నియామకం
టెన్త్ పరీక్షల సందర్భంగా వీరఘట్టం బాలుర, బాలికోన్నత పాఠశాలల్లో మొదటి రోజు జరిగిన తగాదా నేపథ్యంలో రెండో రోజు ఇక్కడ సిట్టింగ్ స్క్వాడ్‌ల నియామకం జరిగింది. బాలుర ఉన్నత పాఠశాలలో సింహాద్రినాయుడు, బాలికోన్నత పాఠశాలలో పి.రామచంద్రరావు సిట్టింగ్ వేశారు. అన్ని గదులను పరిశీలించారు. ఇక ప్రతి రోజూ సిట్టింగ్ స్క్వాడ్‌లు వస్తుంటారని టెక్కలి ఉపవిద్యాశాఖాధికారి టి.జోగారావు తెలిపారు.
అకారణంగా మమ్మల్ని ఎందుకు రిలీవ్ చేశారు
వీరఘట్టం బాలుర, బాలికోన్నత పాఠశాలల్లో మొదటి రోజు జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ రెండు హైస్కూల్‌ల్లో ఇన్విజిలేషన్ చేస్తున్న 22 మందిని శుక్రవారం విధుల నుంచి తప్పించడంపై పలువురు ఉపాధ్యాయులు మండిపడ్డారు. అకారణంగా మమ్మల్ని ఎందుకు తొలగించారంటూ రాష్ట్ర పరిశీలకులు ఎస్.అరుణకుమారిని ప్రశ్నించారు. తప్పు చేసిన వారిని వదిలేసి ఇంత మందిని రిలీవ్ చేయడం సరైన విధానం కాదని పలువురు ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని, రిలీవ్ అయిన వారందరూ తప్పు చేసినట్టు కాదని, పరిస్థితులను అర్ధం చేసుకోవాలని ఆమె ఉపాధ్యాయులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment