మెళియాపుట్టిలో జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న ఆశావర్కర్లు
సాక్షి, అమరావతి/ సాక్షి, విశాఖపట్నం/ మెళియాపుట్టి: కనీవిని ఎరుగని రీతిలో ఆశా వర్కర్ల గౌరవ వేతనాన్ని రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంచడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఆశా వర్కర్లు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజాసంకల్ప యాత్రలో ఇచ్చిన హామీ మేరకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక తమ వేతనాలను పెంచుతూ నిర్ణయం తీసుకోవడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి విశాఖ నగర పర్యటనకు వచ్చిన సీఎం వైఎస్ జగన్‌కు అడుగడుగునా ఆశా కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు.
విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి చినముషిడివాడలోని శ్రీ శారదాపీఠం వరకు వందలాది మంది ఆశా వర్కర్లు బారులు తీరి జేజేలు పలికారు. వారికి సీఎం వైఎస్ జగన్ నమస్కరిస్తూ అభివాదం చేశారు. తమకు గౌరవ వేతనాన్ని కనీసం ఆరు వేలకు పెంచమని ఆందోళనలు చేసినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆశా వర్కర్లు పేర్కొన్నారు. కాగా, రాష్ట్రంలో ఉన్న 42 వేల మంది ఆశా వర్కర్లకు వేతనాన్ని రూ.10 వేలకు పెంచడం సీఎం వైఎస్ జగన్ తీసుకున్న గొప్ప నిర్ణయమని హంసా (హెల్త్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్) అధ్యక్షుడు ఎస్.అరవపాల్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టిలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో మంగళవారం ఆశా వర్కర్లు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎన్నో ఏళ్ల తర్వాత తమ కష్టాలు తీరాయని.. సీఎం వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటామని ఆశా వర్కర్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment