
అథ్లెటిక్స్.. అదుర్స్..
విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో జరుగుతున్న జియో 30వ జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ నువ్వానేనా.. అన్నట్టుగా సాగుతోంది. రెండోరోజైన గురువారం జరిగిన హర్డిల్స్, ట్రయథ్లాన్, రిలే పోటీలను ప్రేక్షకులు ఆసక్తిగా తిలకించారు. ఉదయం 6 గంటల నుంచే పోటీలు ప్రారంభమయ్యాయి. పోటీల నిర్వాహక కమిటీ చైర్మన్, నర్సారావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, తంగిరాల సౌజన్య, రాష్ట్ర కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి రామాంజనేయులు విజేతలకు మెడల్స్ అందజేశారు.
- విజయవాడ స్పోర్ట్స్
రేస్‌వాక్‌లో ప్రియాంక రికార్డు
30వ జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రెండోరోజైన గురువారం జాతీయ రికార్డు నమోదైంది. ఉత్తరప్రదేశ్ (మీరట్)కు చెందిన ప్రియాంక గోస్వామి 10వేల మీటర్ల రేస్ వాక్‌లో 2010లో కుష్బీర్‌కౌర్ (పంజాబ్) నెలకొల్పిన 49:21:21 జాతీయ రికార్డును 49:16:51 టైమింగ్‌తో అధిగమించింది. తన సమీప ప్రత్యర్థి (రజత పతకం సాధించిన) భావనాజాత్ (రాజస్థాన్ 55:24:39)కు దాదాపు ఆరు నిమిషాల తేడాతో లక్ష్య దూరాన్ని చేరుకుని ప్రియాంక సరికొత్త రికార్డు సృష్టించింది. బెంగళూరులోని భారత క్రీడా ప్రాధికార సంస్థ (శాయ్) ఎక్సెలెన్సీ సెంటర్‌లో భారత అథ్లెట్లకు శిక్షణ ఇస్తున్న రష్యన్ కోచ్ అలెగ్జాండర్ వద్ద ప్రియాంక శిక్షణ పొందుతోంది. 2016 రియో ఒలింపిక్స్‌లో పాల్గొనాలనే లక్ష్యంతో కృషిచేస్తోంది.
రెండోరోజు ఫలితాలు
అండర్-20 బాలికల పదివేల మీటర్ల రేస్‌వాక్‌లో ప్రియాంక (ఉత్తరప్రదేశ్, 49:16:51 సెకన్లు), భావనాజత్ (రాజస్థాన్, 55:24:39), మేరీ మార్గరేట్ (కేరళ, 56:48:06) వరుసగా మొదటి మూడు స్థానాలు పొందారు. అండర్-18 బాలుర పదివేల మీటర్ల రేస్ వాక్‌లో మనీష్ (హర్యానా, 45:36:00), సునీల్ (హర్యానా, 45:38:20), ఏకనాథ్ (ఢిల్లీ, 45:52:30) అండర్-20 బాలికల ఐదువేల మీటర్ల రన్‌లో నేహ (మధ్య ప్రదేశ్, 17:47:98), పూలాన్‌పాల్ (అసోం, 17:51:56), మౌనికా యాదవ్ (ఉత్తరప్రదేశ్, 18:03:96) వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. అండర్-20 బాలుర ఐదువేల మీటర్ల రన్నింగ్‌లో శర్వాన్ కార్బ్ (హర్యానా, 14:48:56), రాజేంద్ర (మధ్య ప్రదేశ్, 14:53:78), హర్షద్ (ఢిల్లీ, 15:01:04) మొదటి మూడు స్థానాలు కైవసం చేసుకున్నారు. అండర్-18 బాలికల హైజంప్‌లో లిబియా షాజీ (కేరళ, 1.66 మీటర్లు), చేష్మా (కేరళ, 1.64 మీటర్లు), లైమాన్ నర్జారే (అసోం, 1.61 మీటర్లు) మొదటి మూడు స్థానాలు కైవసం చేసుకున్నారు. అండర్-16 బాలికల 500 గ్రాముల జావలిన్ త్రోలో సంజనా చౌదరి (రాజస్థాన్, 38.22 మీటర్లు), ఎన్.హేమామాలిని (తమిళనాడు, 37.43 మీటర్లు), రంజున్ పేగూ (అసోం, 37.18 మీటర్లు) మొదటి మూడు స్థానాలు పాందారు. అండర్-16 బాలుర ఐదు కేజీల హేమర్‌త్రోలో అశిష్ జాఖర్ (హర్యానా, 67.09 మీటర్లు), ద మినీత్ సింగ్ (పంజాబ్, 59.43 మీటర్లు), మీరజ్ ఆలీ (ఉత్తరప్రదేశ్, 58.66 మీటర్లు), అండర్-18 బాలుర ఐదు కేజీల హేమర్ త్రోలో ప్రదీప్‌కుమార్ (రాజస్థాన్, 70.03 మీటర్లు), సబీల్ అహ్మద్ (ఉత్తరప్రదేశ్, 66.71 మీటర్లు), వివేక్ సింగ్ (ఉత్తరప్రదేశ్, 60.94 మీటర్లు) మొదటి మూడు స్థానాలు పొందారు.
పల్లెపల్లెలో క్రీడా పతాకం ఎగరాలి
2010 (ఢిల్లీ) కామన్వెల్ గే మ్స్, 2002 (బుసాన్), 2006 (దోహా), 2010 (చైనా), 2014 (కొరియా) ఏషియన్ గేమ్స్‌లో 4‘400 మీటర్ల భారత రిలే జట్టుకు కోచ్‌గా వ్యవహరించడమే కాదు క్రీడాకారులు స్వర్ణ పతకాలు సాధించడంలో కీలకపాత్ర పోషించిన శాయ్ (హైదరాబాద్) అథ్లెటిక్స్ కోచ్ నాగపూరి రమేష్. పేరొందిన ఆయన జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంప్‌లో పాల్గొనేందుకు ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియూనికి వచ్చారు. ఈ సందర్భంగా కొద్దిసేపు ‘సాక్షి’తో మాట్లాడారు.
- విజయవాడ స్పోర్ట్స్
కోస్తాతీరంలో క్రీడా ప్రతిభకు కొదవలేదు. పల్లె పల్లెకూ క్రీడా మైదానం ఉండేలా చూడాలి. అప్పుడే కొత్త రాష్ట్రంలో ఆరోగ్యమంతమైన సమాజం రూపుదిద్దుకుంటుంది. మెరికల్లాంటి యువత పుట్టుకొస్తుంది. మండలానికి ఒక రీజినల్ స్పోర్ట్స్ స్కూల్, జిల్లాకు ఒక ప్రధాన స్పోర్ట్స్ స్కూల్, రాజధానిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ స్పోర్ట్స్ స్కూల్ ఉండాలి. ప్రతి స్టేడియంలో సింథటిక్స్ ట్రాక్ ఏర్పాటుచేయూలి. యువత పెడదారి పట్టి తీవ్రవాదులుగా మారితే వారిని అణిచి వేయడానికి వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చుచేస్తోంది. ఆ ఖర్చు క్రీడల కోసం వినియోగిస్తే యువత పెడదారి పట్టకుండా ఉంటుంది. హ ర్యానా ప్రభుత్వం కొత్తగా ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. శారీరక శక్తి సామర్థ్యం పాసైన బాలబాలికలకు రూ.5వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు అందజేస్తోంది. విద్య, ఉద్యోగాల్లో క్రీడాకారులకు రెండు శాతం స్పోర్ట్స్ కోటా ఉండాలి. విద్యలో కేరళ మాదిరిగా బోనస్ మార్కులు ఇవ్వాలి. అభధ్రతా భావం లేని పర్మినెంట్ కోచ్‌లు ఉండాలి. ఏటా క్రీడాకారులతో పాటు కోచ్‌లకు, సంబంధిత సిబ్బందికి అవార్డులు ఇవ్వాలి. అథ్లెటిక్స్.. క్రీడల్లో తల్లి లాంటింది. మన అథ్లెట్ల శక్తి సామర్థ్యాలు పెంచేందుకు ప్రభుత్వంతో పాటు కార్పొరేట్ సంస్థలు ముందుకురావాలి. అప్పుడే కొత్త రాష్ర్ట శక్తి సామర్థ్యాలు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతారుు.