కబడ్డీ సందడి | ational kabaddi tournament | Sakshi
Sakshi News home page

కబడ్డీ సందడి

Published Fri, Jan 9 2015 3:05 AM | Last Updated on Sat, Sep 2 2017 7:24 PM

కబడ్డీ సందడి

కబడ్డీ సందడి

‘అనంత’లో జాతీయస్థాయి కబడ్డీ టోర్నీ
ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి
పాల్గొంటున్న 23 రాష్ట్రాల జట్లు

 
 అనంతపురం స్పోర్ట్స్ :  ‘అనంత’లో కబడ్డీ సందడి మొదలైంది. స్థానిక నీలం సంజీవరెడ్డి స్టేడియంలో గురువారం  60వ స్కూల్ గేమ్స్ జాతీయస్థాయి కబడ్డీ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌చౌదరి ముఖ్యఅతిథిగా  హాజరై..టోర్నీ ప్రారంభించారు. మొదట జ్యోతి ప్రజ్వలన చేశారు. జాతీయ, క్రీడా జెండాలను ఆవిష్కరించారు. అనంతరం వివిధ రాష్ట్రాల క్రీడాకారులు చేసిన మార్చ్‌ఫాస్ట్ అందరినీ ఆకట్టుకుంది. సుమారు 550 మంది క్రీడాకారులు, వందల సంఖ్యలో అధికారులు, అంపైర్లు, పీఈటీలు హాజరుకావడంతో స్టేడియం కిక్కిరిసిపోతోంది.

మృతులకు నివాళి : పెనుకొండ వద్ద బుధవారం జరిగిన బస్సు ప్రమాద ఘటనలో మృతిచెందిన వారికి క్రీడాకారులు, నిర్వాహకులు నివాళులర్పించారు. నిమిషం పాటు మౌనం పాటించి.. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆకట్టుకున్న నృత్యప్రదర్శన : చిన్నారులు బ్రహ్మి, ఖ్యాతి నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. భారతదేశ సంస్కృతీ సంప్రదాయాలను గుర్తు చేస్తూ ప్రదర్శన ఇచ్చారు. వీరిని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. నవభారత్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ విద్యార్థులు ‘సారే జహాసె అచ్ఛా’ అంటూ డ్యాన్స్ చేశారు.

చరిత్రాత్మక టోర్నీ  ఇది : ఎమ్మెల్యే

జాతీయస్థాయి కబడ్డీ టోర్నమెంట్ ‘అనంత’లో నిర్వహిస్తుండడం చరిత్రాత్మకమని ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అన్నారు. ప్రతిఒక్కరూ క్రీడా స్ఫూర్తితో సత్తాచాటాలన్నారు. అవకాశాలను సద్వినియోగం చేసుకుని.. ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. అడిషనల్ జాయింట్ కలెక్టర్ (ఏజేసీ) ఖాజామొహిద్దీన్ మాట్లాడుతూ భారత క్రీడాకారులైన అనూప్, రాకేష్, మమత, పుజారిలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. టోర్నీ పరిశీలకులడు కేఎస్ మూర్తి మాట్లాడుతూ ఎంచుకున్న లక్ష్యాలను సాధించాలన్నారు. డీఈఓ అంజయ్య మాట్లాడుతూ  23 బాలుర, 21 బాలికల జట్లు పాల్గొంటున్నాయని, పోటీలను విజయవంతంగా నిర్వహిస్తామని చెప్పారు. అనంతరం ఇండియా మాజీ క్రీడాకారుడు, వన్‌టౌన్ ఎస్సై విశ్వనాథ్ చౌదరి, జాతీయస్థాయి క్రీడాకారుడు రామయ్య(ఎస్‌ఐ), బండారు రవికుమార్, ఎస్‌బీఐ బ్రాంచ్ మేనేజర్ సంజయ్‌లను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ గంపన్న, ఏపీ స్కూల్ గేమ్స్ కార్యదర్శి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర, తెలంగాణ మధ్య మొదటి మ్యాచ్ జరిగింది. మొదటిరోజు పోటీలను వీక్షించేందుకు నగర ప్రజలు, క్రీడాకారులు భారీగా తరలివచ్చారు.

మ్యాచ్‌ల ఫలితాలిలా..

బాలికల విభాగం : జమ్మూకాశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 22 పాయింట్ల ఆధిక్యతతో, ఉత్తరప్రదేశ్‌తో మ్యాచ్‌లో కర్ణాటక 47 పాయింట్లు, తమిళనాడుతో మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ 12 పాయింట్ల ఆధిక్యతతో విజయం సాధించాయి.
 బాలుర విభాగం : పంజాబ్‌పై మధ్యప్రదేశ్ ఏడు పాయింట్ల ఆధిక్యతతో, కేరళపై మహారాష్ట్ర 21 పాయింట్లు, గుజరాత్‌పై హర్యానా ఏడు పాయింట్లు, ఒడిశాపై ఉత్తరాఖండ్ 16 పాయింట్ల ఆధిక్యతతో గెలుపొందాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement