చిత్తూరు కలెక్టరేట్: గత టీడీపీ ప్రభుత్వం క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం చూపింది. క్రీడాకారులు ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో నిస్తేజంగా మారారు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్రీడలకు పెద్దపీట వేసింది. ఇందులో భాగంగా ఆడుదాం ఆంధ్రా పేరుతో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు భారీ ఎత్తున క్రీడలను నిర్వహిస్తోంది.
వీటి ద్వారా ఆయా క్రీడల్లో గ్రామీణ ఆణిముత్యాలను వెలికితీస్తోంది. అయితే వీటిపైనా రామోజీరావు తన వక్రబుద్ధిని చాటుకున్నారు. ఆడుదాం ఆంధ్రా క్రీడల్లో ఒక కబడ్డీ క్రీడాకారిణి గాయపడితే ప్రభుత్వం పట్టించుకోలేదంటూ ‘ఈనాడు’లో అసత్య కథనాన్ని అచ్చేశారు. ‘సాయం కావాలా.. వెళ్లి సీఎంను అడగండి’ అనే శీర్షికతో విషం జిమ్మారు. ఈ నేపథ్యంలో అసలు వాస్తవాలు ఇవి..
చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం డీఆర్‌పురం గ్రామానికి చెందిన మునెమ్మకు కబడ్డీ అంటే ఎంతో ఇష్టం. టీడీపీ పాలనలో క్రీడలకు ప్రోత్సాహం లేకపోవడంతో ఆమె కబడ్డీ పట్ల ఉన్న ఆసక్తిని చంపేసుకుంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రస్తుతం ఆడుదాం ఆంధ్రా పోటీలు నిర్వహించడంతో ఎంతో సంతోషపడింది. గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పోటీల్లో పాల్గొని తన ప్రతిభను చాటుకుంది. గత నెల 25న నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన కబడ్డీ పోటీల్లో ఆమె ఎడమ కాలు బెణికింది.
ఆ సమయంలో అక్కడున్న వైద్యాధికారులు, అధికారులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్తామని చెప్పారు. అయితే కాలు బెణికిందంతే అని చెప్పి తన భర్తతో కలిసి పుత్తూరుకు వెళ్లి మునెమ్మ కట్టు కట్టించుకున్నారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎడమకాలు బెణికిన మునెమ్మ వైద్య చికిత్సల నిమిత్తం మంగళవారం అధికారులు రూ.35 వేలు ఆర్థిక సహాయం అందజేశారు.
ఆర్డీవో చిన్నయ్య, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బాలాజీ, కార్వేటినగరం తహసీల్దార్ పుష్పవతి, ఎంపీడీవో శ్రీధర్‌లు మునెమ్మ ఇంటికి వెళ్లి ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తనకు ఎలాంటి సమస్యలేదని, ఆటల్లో గాయాలు సహజమేనని మునెమ్మఅధికారులకు తెలిపారు.
ఆడే సమయంలో ఎడమ కాలు బెణికిందని చెప్పారు. ఆ సమయంలో నొప్పి ఏమీ లేకపోవడంతో తామే పుత్తూరుకు వెళ్లి కట్టు కట్టించుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎలాంటి సమస్య వచ్చినా జిల్లా యంత్రాంగం అండగా ఉంటుందని మునెమ్మకు అధికారులు హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment