munemma
-
కాలు బెణికింది అంతే
చిత్తూరు కలెక్టరేట్: గత టీడీపీ ప్రభుత్వం క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం చూపింది. క్రీడాకారులు ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో నిస్తేజంగా మారారు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్రీడలకు పెద్దపీట వేసింది. ఇందులో భాగంగా ఆడుదాం ఆంధ్రా పేరుతో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు భారీ ఎత్తున క్రీడలను నిర్వహిస్తోంది. వీటి ద్వారా ఆయా క్రీడల్లో గ్రామీణ ఆణిముత్యాలను వెలికితీస్తోంది. అయితే వీటిపైనా రామోజీరావు తన వక్రబుద్ధిని చాటుకున్నారు. ఆడుదాం ఆంధ్రా క్రీడల్లో ఒక కబడ్డీ క్రీడాకారిణి గాయపడితే ప్రభుత్వం పట్టించుకోలేదంటూ ‘ఈనాడు’లో అసత్య కథనాన్ని అచ్చేశారు. ‘సాయం కావాలా.. వెళ్లి సీఎంను అడగండి’ అనే శీర్షికతో విషం జిమ్మారు. ఈ నేపథ్యంలో అసలు వాస్తవాలు ఇవి.. చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం డీఆర్పురం గ్రామానికి చెందిన మునెమ్మకు కబడ్డీ అంటే ఎంతో ఇష్టం. టీడీపీ పాలనలో క్రీడలకు ప్రోత్సాహం లేకపోవడంతో ఆమె కబడ్డీ పట్ల ఉన్న ఆసక్తిని చంపేసుకుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రస్తుతం ఆడుదాం ఆంధ్రా పోటీలు నిర్వహించడంతో ఎంతో సంతోషపడింది. గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పోటీల్లో పాల్గొని తన ప్రతిభను చాటుకుంది. గత నెల 25న నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన కబడ్డీ పోటీల్లో ఆమె ఎడమ కాలు బెణికింది. ఆ సమయంలో అక్కడున్న వైద్యాధికారులు, అధికారులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్తామని చెప్పారు. అయితే కాలు బెణికిందంతే అని చెప్పి తన భర్తతో కలిసి పుత్తూరుకు వెళ్లి మునెమ్మ కట్టు కట్టించుకున్నారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎడమకాలు బెణికిన మునెమ్మ వైద్య చికిత్సల నిమిత్తం మంగళవారం అధికారులు రూ.35 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. ఆర్డీవో చిన్నయ్య, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బాలాజీ, కార్వేటినగరం తహసీల్దార్ పుష్పవతి, ఎంపీడీవో శ్రీధర్‌లు మునెమ్మ ఇంటికి వెళ్లి ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తనకు ఎలాంటి సమస్యలేదని, ఆటల్లో గాయాలు సహజమేనని మునెమ్మఅధికారులకు తెలిపారు. ఆడే సమయంలో ఎడమ కాలు బెణికిందని చెప్పారు. ఆ సమయంలో నొప్పి ఏమీ లేకపోవడంతో తామే పుత్తూరుకు వెళ్లి కట్టు కట్టించుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎలాంటి సమస్య వచ్చినా జిల్లా యంత్రాంగం అండగా ఉంటుందని మునెమ్మకు అధికారులు హామీ ఇచ్చారు. -
స్నేహితురాలిని అలా చూస్తూ..! ‘స్నేహం కోసం..’ సినిమాలో క్లైమాక్స్‌లా
తిరుపతి రూరల్: కుటుంబ బంధాలతోపాటు వారి మధ్య స్నేహం పెరిగింది. అలా 64 ఏళ్లపాటు తమ స్నేహబంధాన్ని కొనసాగించారు. అనారోగ్యంతో మృతి చెందిన స్నేహితురాలిని కడచూపు చూసేందుకు వచ్చింది. నిర్జీవంగా మారిన స్నేహితురాలిని తదేకంగా చూస్తూ.. తానూ తుది శ్వాస విడిచింది. ‘స్నేహం కోసం..’ సినిమాలో క్లైమాక్స్ సన్నివేశాన్ని తలపించిన ఈ ఘటన తిరుపతి మండలం మల్లంగుంటలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే... మల్లంగుంటకు చెందిన దివంగత కంబాల గంగయ్య భార్య కంబాల మునెమ్మ(80), అదే గ్రామానికి చెందిన అంజూరి పాపమ్మ (80) వరుసకు అక్కచెల్లెళ్లు. అంతకుమించి 64 ఏళ్లుగా మంచి స్నేహితులు. పిల్లల చదువుల నుంచి వారి పెళ్లిళ్లు, మనవళ్ల యోగక్షేమాల వరకు ఇరువురూ మాట్లాడుకునేవారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కంబాల మునెమ్మ ఈ నెల 9న రాత్రి మృతి చెందింది. ఆమె కుమారుడు అమెరికాలో ఉండటంతో శనివారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. గుండె సంబంధ వ్యాధితో బాధపడుతున్న అంజూరి పాపమ్మకు మునెమ్మ చనిపోయిన విషయం చెప్పకుండా కుటుంబ సభ్యులు దాచారు. చివరి నిమిషంలో తెలుసుకున్న పాపమ్మ అనారోగ్యంతో ఉన్నప్పటికీ స్నేహితురాలు మునెమ్మను కడచూపు చూసేందుకు శనివారం సాయంత్రం వచ్చింది. స్నేహితురాలిని ఫ్రీజర్ బాక్స్‌లో అచేతన స్థితిలో చూస్తూ పాపమ్మ కుప్పకూలి అక్కడే ప్రాణాలు వదిలింది. మునెమ్మ అంత్యక్రియలను శనివారమే ముగించగా.. పాపమ్మకు ఆదివారం నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. స్నేహబంధానికి నిదర్శనంగా నిలిచిన మునెమ్మ, పాపమ్మ స్నేహంపై గ్రామంలో అందరూ చర్చించుకుంటున్నారు. -
అయ్యో... అవ్వ
ముదిమిమీద పడి.. దేహం ముడతలు పడి నడవడానికీ ఇబ్బందులు పడుతున్న ఈ అవ్వపేరు నీలం మునెమ్మ. కడప నగరశివార్లలోని రూకవారిపల్లెలో నివాసముంటోంది. ఈమె వయసు సుమారు 80 ఏళ్లు. దాదాపు ఇరవై ఏళ్లుగా పింఛన్ తీసుకుంటోంది. నా అన్నవారు లేక... సమయానికి అన్నంపెట్టేవారు కానరాక అవస్థలు పడే మునెమ్మకు నెలానెలా వచ్చే పింఛనే ఆసరా. ప్రతి నెలా మాదిరే ఓ రోజు పింఛన్ కోసం అధికారుల వద్దకు పోయింది. అవ్వా ‘నీకు పింఛన్ ఆగిపోయింది’ అక్కడి వారి సమాధానం.. పాపం అవ్వకు గుండె ఆగినంత పనయింది. ‘ఏమయింది నాయనా ’ అంటూ నీళ్లు తిరిగిన కళ్లతో ఆవేదనగా అడిగింది. ‘ఏమో పైవాళ్లను అడుగుపో’ అన్నారు. అంతే ఒకటి రెండు కాదు 16 నెలలుగా అవ్వ పై సార్లను అడుగుతూనే ఉంది. కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉంది. ప్చ్.. ఏం లాభలేకపోయింది. ఆ వచ్చే పింఛన్‌తో అంతో ఇంతో అన్నానికి... మిగిలింది మందులకు వాడుకునేది. పింఛన్ ఆగిపోవడంతో అష్టకష్టాలు పడుతోంది. ఇక చేసేదీలేక స్థానికంగా ఉన్న ఓ మసీదు బిక్షం ఎత్తుతూ జీవనం సాగిస్తోంది. అవ్వ పడుతున్న కష్టాలు చూసినవారు చలించిపోతున్నారు. తాము తీసుకుంటున్న నిర్ణయాలే ఇలాంటి వారిపాలిట శాపాలుగా మారుతున్నాయని పాలకులు.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు ఎప్పుడు చలిస్తారో.. ఈ అవ్వ విషయమై అధికారులను ఆరా తీయగా మునెమ్మ ఆధార్‌కార్డు తిరస్కరణకు గురైందని.. కొత్త ఆధార్‌కార్డు తీసుకొని వస్తే పింఛన్ ఇస్తామని తెలిపారు. ఈమె పింఛన్ ఐడీ–360419, రేషన్ కార్డు నంబర్–ఆర్ఏపీ113111200461, ఆధార్ కార్డు నంబర్–271563481799 గా ఉన్నాయి. – కడప కార్పొరేషన్