తిరుపతి రూరల్: కుటుంబ బంధాలతోపాటు వారి మధ్య స్నేహం పెరిగింది. అలా 64 ఏళ్లపాటు తమ స్నేహబంధాన్ని కొనసాగించారు. అనారోగ్యంతో మృతి చెందిన స్నేహితురాలిని కడచూపు చూసేందుకు వచ్చింది. నిర్జీవంగా మారిన స్నేహితురాలిని తదేకంగా చూస్తూ.. తానూ తుది శ్వాస విడిచింది. ‘స్నేహం కోసం..’ సినిమాలో క్లైమాక్స్ సన్నివేశాన్ని తలపించిన ఈ ఘటన తిరుపతి మండలం మల్లంగుంటలో శనివారం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్లితే... మల్లంగుంటకు చెందిన దివంగత కంబాల గంగయ్య భార్య కంబాల మునెమ్మ(80), అదే గ్రామానికి చెందిన అంజూరి పాపమ్మ (80) వరుసకు అక్కచెల్లెళ్లు. అంతకుమించి 64 ఏళ్లుగా మంచి స్నేహితులు. పిల్లల చదువుల నుంచి వారి పెళ్లిళ్లు, మనవళ్ల యోగక్షేమాల వరకు ఇరువురూ మాట్లాడుకునేవారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కంబాల మునెమ్మ ఈ నెల 9న రాత్రి మృతి చెందింది.
ఆమె కుమారుడు అమెరికాలో ఉండటంతో శనివారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. గుండె సంబంధ వ్యాధితో బాధపడుతున్న అంజూరి పాపమ్మకు మునెమ్మ చనిపోయిన విషయం చెప్పకుండా కుటుంబ సభ్యులు దాచారు. చివరి నిమిషంలో తెలుసుకున్న పాపమ్మ అనారోగ్యంతో ఉన్నప్పటికీ స్నేహితురాలు మునెమ్మను కడచూపు చూసేందుకు శనివారం సాయంత్రం వచ్చింది.
స్నేహితురాలిని ఫ్రీజర్ బాక్స్‌లో అచేతన స్థితిలో చూస్తూ పాపమ్మ కుప్పకూలి అక్కడే ప్రాణాలు వదిలింది. మునెమ్మ అంత్యక్రియలను శనివారమే ముగించగా.. పాపమ్మకు ఆదివారం నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. స్నేహబంధానికి నిదర్శనంగా నిలిచిన మునెమ్మ, పాపమ్మ స్నేహంపై గ్రామంలో అందరూ చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment