అయ్యో... అవ్వ
ముదిమిమీద పడి.. దేహం ముడతలు పడి నడవడానికీ ఇబ్బందులు పడుతున్న ఈ అవ్వపేరు నీలం మునెమ్మ. కడప నగరశివార్లలోని రూకవారిపల్లెలో నివాసముంటోంది. ఈమె వయసు సుమారు 80 ఏళ్లు. దాదాపు ఇరవై ఏళ్లుగా పింఛన్ తీసుకుంటోంది. నా అన్నవారు లేక... సమయానికి అన్నంపెట్టేవారు కానరాక అవస్థలు పడే మునెమ్మకు నెలానెలా వచ్చే పింఛనే ఆసరా. ప్రతి నెలా మాదిరే ఓ రోజు పింఛన్ కోసం అధికారుల వద్దకు పోయింది. అవ్వా ‘నీకు పింఛన్ ఆగిపోయింది’ అక్కడి వారి సమాధానం.. పాపం అవ్వకు గుండె ఆగినంత పనయింది. ‘ఏమయింది నాయనా ’ అంటూ నీళ్లు తిరిగిన కళ్లతో ఆవేదనగా అడిగింది. ‘ఏమో పైవాళ్లను అడుగుపో’ అన్నారు. అంతే ఒకటి రెండు కాదు 16 నెలలుగా అవ్వ పై సార్లను అడుగుతూనే ఉంది. కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉంది. ప్చ్.. ఏం లాభలేకపోయింది. ఆ వచ్చే పింఛన్‌తో అంతో ఇంతో అన్నానికి... మిగిలింది మందులకు వాడుకునేది. పింఛన్ ఆగిపోవడంతో అష్టకష్టాలు పడుతోంది. ఇక చేసేదీలేక స్థానికంగా ఉన్న ఓ మసీదు బిక్షం ఎత్తుతూ జీవనం సాగిస్తోంది. అవ్వ పడుతున్న కష్టాలు చూసినవారు చలించిపోతున్నారు. తాము తీసుకుంటున్న నిర్ణయాలే ఇలాంటి వారిపాలిట శాపాలుగా మారుతున్నాయని పాలకులు.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు ఎప్పుడు చలిస్తారో.. ఈ అవ్వ విషయమై అధికారులను ఆరా తీయగా మునెమ్మ ఆధార్‌కార్డు తిరస్కరణకు గురైందని.. కొత్త ఆధార్‌కార్డు తీసుకొని వస్తే పింఛన్ ఇస్తామని తెలిపారు.
ఈమె పింఛన్ ఐడీ–360419, రేషన్ కార్డు నంబర్–ఆర్‌ఏపీ113111200461, ఆధార్ కార్డు నంబర్–271563481799 గా ఉన్నాయి. – కడప కార్పొరేషన్