సాక్షి, మచిలీపట్నం :సమైక్యాంధ్ర ఉద్యమానికి అన్నివర్గాల ప్రజల మద్దతు వెల్లువెత్తుతోంది. అటెండరు నుంచి ఆఫీసరు వరకు వేలాది మంది ఎన్జీవోలు సమ్మెబాట పట్టారు. ప్రభుత్వ యంత్రాంగం దాదాపుగా స్తంభించిందనే చెప్పాలి. శనివారం గన్నవరంలో జరిగిన మహా గర్జన సభ విజయవంతమైంది. విద్యార్థులు, మహిళలు పాల్గొని సమైక్యాంధ్ర కోసం నినదించారు. జేఏసీ జిల్లా చైర్మన్ విద్యాసాగర్‌తోపాటు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. హనుమాన్‌జంక్షన్‌లో వైఎస్సార్ సీపీ, నాన్ పొలిటికల్ జేఏసీ నేతృత్వంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. కొండపల్లిలో ముస్లిం సోదరులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.
ఇబ్రహీంపట్నంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. నందిగామ పట్టణంలో రిలే నిరాహారదీక్షలు, ర్యాలీలు, రాస్తారోకోలు యథావిధిగా కొనసాగాయి. జగ్గయ్యపేట పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రిలే దీక్షలో 216 మంది విద్యార్థులు కూర్చుని సంఘీభావం తెలిపారు. సీనియర్ రాజకీయ నేత సామినేని విశ్వనాథం, శాసనసభ్యుడు శ్రీరాం రాజగోపాల్ దీక్షాశిబిరాన్ని సందర్శించారు.
తిరువూరులో ఎన్జీవోలు బోసు సెంటర్లో, గురుకుల ఉపాధ్యాయులు కళాశాల ఆవరణలో ఆందోళన నిర్వహించారు. విస్సన్నపేటలో జేఏసీ నాయకులు సమైక్యాంధ్ర కోరుతూ అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. నూజివీడులో ఐకేపీ ఉద్యోగుల రిలే దీక్షలు 38వ రోజుకు, న్యాయవాదులు చేస్తున్న రిలేదీక్షలు 27వ రోజుకు చేరాయి. విద్యుత్ ఉద్యోగులు చిన్నగాంధీబొమ్మ సెంటర్‌లో ఆందోళన నిర్వహించారు. వైఎస్సార్ సీపీ నాయకుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. దీక్షలను పార్టీ యువజన విభాగం పట్టణ కన్వీనర్ పిళ్లా చరణ్, నియోజకవర్గ సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప్‌అప్పారావు ప్రారంభించారు.
కైకలూరులో వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షలు 39వ రోజుకు చేరాయి. తాలూకా సెంటర్‌లో ఎన్జీవోల దీక్షలు 32వ రోజుకు చేరాయి. వారికి మద్దతుగా భుజబలపట్నం పంచాయతీ పాలకవర్గం రిలే దీక్షలు చేపట్టింది. కైకలూరులో 1000 మంది మహిళలతో పొలికేక కార్యక్రమం జరిగింది. కలిదిండిలో ఏఎన్‌ఎం సిబ్బంది రిలే దీక్షలు చేశారు. మండవల్లిలో జేఏసీ ఆధ్వర్యంలో వీఆర్వోలు రిలే దీక్షలు చేశారు. ముదినేపల్లిలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలు 20వ రోజుకు చేరాయి. బంటుమిల్లిలో రైతు గర్జన జరిగింది.
నియోజకవర్గానికి చెందిన పలువురు అన్నదాతలు పాల్గొన్నారు. మైలవరంలో రైతన్నలు రోడ్డెక్కారు. ఎడ్లబళ్లు, ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ పరికరాలతో రైతులు సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం ఉద్యమించారు. అనంతరం బోసు బొమ్మ సెంటర్ లో జరిగిన సభలో వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి తదితరులు ప్రసంగించారు. జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలేదీక్షలు 18వ రోజుకు చేరాయి. మాదిగ సంఘం ర్యాలీ నిర్వహించింది. జి. కొండూరులో పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షలు 22వ రోజుకు చేరుకున్నాయి.
బెజవాడలో... మొన్నటివరకు ఉద్యమానికి దూరంగా ఉన్న ప్రైవేటు బస్సు ఆపరేటర్లు రంగంలోకి దిగారు. శుక్రవారం ఉదయం నుంచి బంద్ పాటిస్తున్న వారు శనివారం విజయవాడలో మహా బస్ ర్యాలీ చేశారు. హనుమాన్‌పేట నుంచి బయలుదేరిన ర్యాలీ బందరురోడ్డు, బెంజిసర్కిల్, రింగ్‌రోడ్డుల మీదగా ఏలూరు రోడ్డుకు చేరుకుని అక్కడ నుంచి హనుమాన్‌పేటకు వెనుదిరిగింది. చార్టెర్డ్ అకౌంటెంట్స్ పాదయాత్ర నిర్వహించారు. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు కళ్లకు గంతలు కట్టుకుని రిలే దీక్షలు చేశారు.
పంచాయతీరాజ్ కార్యాలయం వద్ద వికలాంగులు రిలేదీక్షల్లో పాల్గొన్నారు. దేవాదాయ, ధర్మాదాయ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బందరురోడ్డులోని అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం వద్ద రిలే దీక్షలు నిర్వహించారు. విద్యుత్‌ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో ఎస్‌ఈ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించి బందరు రోడ్డులో మానవహారం నిర్మించారు.
అటెండరు నుంచి ఆఫీసరు.. ఎన్జీవోల సమ్మెబాట
Published Sun, Sep 15 2013 1:40 AM | Last Updated on Fri, Sep 1 2017 10:43 PM
Advertisement
Advertisement