ఆడిట్ అక్షింతలు | Audit Alienation | Sakshi
Sakshi News home page

ఆడిట్ అక్షింతలు

Published Fri, Feb 14 2014 2:48 AM | Last Updated on Sat, Sep 2 2017 3:40 AM

Audit Alienation

సాక్షి, చిత్తూరు: పంచాయతీరాజ్ సంస్థలు, జిల్లా పరిషత్, మండల పరిషత్‌లు, గ్రామ పంచాయతీల్లో 2010-11 ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ఆడిట్ నివేదికను రాష్ట్ర ఆడిట్ డెరైక్టర్ జనరల్ విడుదల చేసింది. ఈ నివేదికలో చిత్తూరు జిల్లాకు సంబంధించి భారీ సంఖ్యలో ఆడిట్ అభ్యంతరాలు ఉన్నాయి. చంద్రబాబు నియోజకవర్గం కుప్పం పంచాయతీలో కనీసం ఆస్తిపన్ను, కొళాయిపన్ను, షాపింగ్ కాంప్లెక్స్‌ల అద్దె కూడా నిర్ణీత సమయంలో వసూలు చేయలేని దుస్థితిలో ఉన్నారని విమర్శించింది.
 
జిల్లాలో రూ.11 కోట్లకు పైగా అభ్యంతరాలు
 
చిత్తూరు జిల్లాలో జిల్లాపరిషత్ సంస్థ నుంచి 22 ఆడిట్ అభ్యంతరాలకు గాను రూ.4.05 కోట్లు దుర్వినియోగమైనట్టు గుర్తించారు. మండల పరిషత్‌లకు కేటాయించిన నిధులు, గ్రాంట్ల వినియోగంలో మొత్తం 813 ఆడిట్ అభ్యంతరాలను గుర్తించారు. వీటి కింద రూ.1.77 కోట్లమేర లెక్కలు సరిగా లేవని, సరైన ఓచర్లు లేవని, ఇతర సాంకేతిక కారణాలతోనూ ఆడిట్ అభ్యంతరాలు ఉన్నట్లు వెల్లడించారు.  గ్రామ పంచాయతీల్లో 19,398 ఆడిట్ అభ్యంతరాలను గుర్తించారు.
 
రాబడికన్నా చెల్లింపులే ఎక్కువ
 
జిల్లా పరిషత్, మండల పరిషత్‌ల్లో వచ్చిన రాబడులు, గ్రాంట్ల కన్నా అధికమొత్తంలో ఖర్చుచేసినట్లు ఆడిట్ అధికారులు గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా 2010-11 ఆర్థిక సంవత్సరంలో రాబడులు 4542.16 లక్షలు కాగా, ఖర్చులు 4843.70 లక్షలుగా ఉంది.  కొన్ని పంచాయతీలు నిర్ణీత సమయంలో ఇంటిపన్ను, కొళాయి పన్నులు వసూలు చేయడం లేదని పేర్కొన్నారు. ఇందులో కుప్పం టౌన్ పంచాయతీలో 3.20 లక్షల ఇంటిపన్ను, ఆస్తిపన్ను వసూలు కాలేదని ఆడిట్ అధికారులు చివాట్లు పెట్టారు.

చౌడేపల్లె  పంచాయతీలోనూ రూ.86 వేల బకాయిలు ఉన్నాయని పేర్కొన్నారు. 2012 నాటికి 65 మండలాల ఆడిట్ నివేదికలు పూర్తయినట్లు చూపారు. జిల్లాలో మూడు మండల పరిషత్తుల్లో గ్రాంట్ల దుర్వినియోగమైనట్లు నివేదికలో పేర్కొన్నారు. ప్రభుత్వ ఆడిట్ నిబంధనలు ఉల్లంఘించి ఖర్చుచేసిన ఖాతాల సంఖ్య పంచాయతీరాజ్ సంస్థల్లో 4,500 వరకు ఉన్నట్లు గుర్తించారు. వీటిల్లో రూ.కోటికి పైగా నిధులు దుర్వినియోగమైనట్లు పేర్కొన్నారు.
 
తిరుపతి కార్పొరేషన్‌కు చివాట్లు
 
రాష్ట్ర ఆడిటర్ డెరైక్టర్ జనరల్ విడుదల చేసిన నివేదికలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ నిధుల వ్యయంపై భారీగా తప్పులు జరిగినట్లు గుర్తించారు. ఖాతాల సంఖ్యలనే తారుమారు చేసినట్లు తేల్చారు. నిధులు దారిమళ్లించినట్టు వెల్లడించారు. ఇందులో రూ.6.59 లక్షలు ఒక పనికి సంబంధించిన నివేదికను వేరొక పనికి మళ్లించడాన్ని తప్పుబట్టారు. బకాయిల వసూళ్లలో తీవ్ర జాప్యం, నిర్లక్ష్యం ఉందని తప్పుబట్టారు. ఇందులో మొత్తం 15 ఆడిట్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వాటికి సంబంధించి మొత్తం 1277.56 లక్షల నిధులు వసూలు కావాల్సి ఉందని పేర్కొన్నారు. అడ్వాన్స్‌ల సర్దుబాటు పెండింగ్‌కు సంబంధించి రూ.14.84 లక్షలు లెక్కల్లో జమచేయకుండా ఉంచినట్లు పేర్కొన్నారు.

ఆడిట్ నియమావళి ఉల్లంఘించిన వ్యవహారంలో 9 తప్పులను గుర్తించారు. ఈ తప్పులకు సంబంధించి రూ.57.38 లక్షలు మున్సిపల్ కార్పొరేషన్ ఆడిట్ అభ్యం తరాలును పేర్కొన్నారు. ఓచర్లు లేని ఖాతా ఒకటి గుర్తించారు. దీనికింద రూ.1.11 లక్షలు దుర్వినియోగమైనట్లు పేర్కొన్నారు. అధిక చెల్లింపుల కింద 7 ఖాతాలకు రూ.611 లక్షలు చెల్లించారని, దీనికి సంబంధించిన వివరాలు సరిగ్గాలేవని ఆడిట్ అభ్యంతరం వ్యక్తమైంది. వృథా వ్యయం కింద తప్పు జరిగిందని పేర్కొంటూ అనవసరంగా *171.9 లక్షలు ఖర్చుచేశారని ఆడిటర్ జనరల్ నివేదికలో పేర్కొన్నారు.
 
శ్రీకాళహస్తిలో రూ.7.39 లక్షల చెల్లింపులు
 
శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో కాంట్రాక్టర్ల చెల్లింపుల నుంచి 1 శాతం లేబర్ సెస్ మినహాయించి నిధులు చెల్లిం చాల్సి ఉండగా, లేబర్ సెస్ మినహాయించకుండా రూ.7.39 లక్షలు చెల్లించినట్లు ఆడిట్ అధికారులు గుర్తించారు. ఈ మొత్తాన్ని సంబంధిత కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేయాల్సిందిగా సిఫార్స్ చేశారు.
 
 మార్కెట్ కమిటీల్లో ఆడిట్ అభ్యంతరాలు
 2010-11 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ఏడు మార్కెట్ కమిటీల్లో రూ.31.14 లక్షల గ్రాంట్ల అధిక వినియోగం జరిగినట్లు గుర్తించారు. నిధుల మళ్లింపునకు సంబంధించి మరో 7 మార్కెట్ కమిటీల్లో నిధులు రూ.50.5 లక్షల వరకు దారిమళ్లినట్టు తేల్చారు. వీటికి సంబంధించి అధికారులు వివరణ ఇవ్వాలని రిమార్కు రాశారు. శ్రీకాళహస్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో రూ.3.94 లక్షలు వసూలు చేయకుండా వదిలేశారని, ఇది పని నిర్లక్ష్యం కిందకు వస్తుందని నివేదికలో తప్పుబట్టారు. గ్రంథాలయాలకు సంబంధించి జిల్లాలో ఒక ఖాతా ద్వారా రూ.55.6 లక్షలు దారిమళ్లిందని పేర్కొన్నారు. సూచించిన అంశానికి కాకుండా వేరే అవసరాలకు వాడారని గుర్తించారు. దీనిపై అధికారుల వివరణ తీసుకోవాలని సూచించారు.
 

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement