ఇక పంచాయతీల్లో ఆన్‌లైన్ పాలన
పలమనేరు, న్యూస్‌లైన్: ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో పంచాయతీరాజ్ సంస్థలను శక్తివంతంగా తయారు చేసేందుకు పంచాయతీల్లో ఆన్‌లైన్ పాలనకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ-పంచాయత్స్ పేరుతో పిలిచే ఈ కార్యక్రమాన్ని 2008-09 సంవత్సరంలో జాతీయ సాంకేతిక సమాచార సంస్థ (ఎన్‌ఐసీ) వారి సాయంతో రూపొందించారు. వారం రోజుల్లో జిల్లాలోని 348 గ్రామ పంచాయతీల్లో తొలి దశగా ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన కంప్యూటర్లు, పరికరాలు, సంబంధిత ఎంపీడీవో కార్యాలయాలకు చేరాయి.
మూడంచెలుగా వినియోగం
2008-09లో రూపొందించిన ఈ కార్యక్రమాన్ని అభివృద్ధిపరచి మూడు అంచెలుగా ముందుకు తీసుకెళ్లనున్నారు. ప్రాథమికంగా గ్రామాల్లో జనన మరణాల నమోదు, ఇంటి పన్నులు, లెసైన్స్ ఫీజు వసూళ్లను చేపట్టనున్నారు. పనుల పర్యవేక్షణ, పంచాయతీ సమావేశాలు, ప్రజాప్రతినిధుల సమాచారం, ఉద్యోగుల వివరాలు, వేలం పాటలు, కోర్టు కేసులు, తని ఖీలు, సమాచార హక్కు చట్టం, ఆడిట్, ఫిర్యాదులకు సంబంధించిన ఎంఐఎస్ రిపోర్టులు, పంచాయతీరాజ్ నిధులకు సంబంధించి ఈ కేంద్రాల్లో నిర్వహించనున్నారు.
ముఖ్యమైన అప్లికేషన్లు ఇలా
ప్లాన్ ప్లస్ ద్వారా జిల్లా ప్రణాళిక కమిటీ నుంచి తుది ఆమోదం పొందేవరకు కార్యక్రమమంతా వెబ్ ఆధారిత సాఫ్ట్‌వేర్లు గ్రహించి రిపోర్టులను అందిస్తాయి. ఇవి కేంద్ర స్థాయిలో జాతీయ ప్రణాళికలను రూపొందించేందుకు ఉపయోగపడుతాయి. యాక్షన్ స్టాఫ్ ద్వారా స్థానిక రికార్డులు ఆర్థిక ప్రగతిని చూపెడతాయి. ప్రియాసాఫ్ట్ ద్వారా ఉద్యోగులకు శిక్షణ గురించి ఇందులో అప్లికేషన్లు ఉంటాయి. లోకల్ గవర్నమెంట్ డెరైక్టరీ ద్వారా అప్‌డేట్ సమాచారం ఉంటుంది. నేషనల్ పంచాయత్ పోర్టల్ ద్వారా పంచాయతీలకు సంబంధించిన సమాచారం లభ్యమవుతుంది. ఏరియా ప్రొఫైలర్, నేషనల్ అసెట్ డెరైక్టరీ, సర్వీసెస్, సోషల్ ఆడిట్ తదితర అంశాలు గ్రామీణుల చెంతకు రానున్నాయి. ఇప్పటికే సర్పంచులకు ప్రత్యేక శిక్షణనిచ్చారు. ఆపరేటర్లను నియమించారు. ఈ-పంచాయత్‌తో అన్ని రకాల సేవలు సామాన్యునికి అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయమై డీపీవో ప్రభాకర్‌ను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా పనులు జరుగుతున్నాయని, వారం రోజుల్లో కార్యక్రమం ప్రారంభమవుతుందని అన్నారు.