చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అడ్డాగా ఆటోనగర్
తుపాకుల విడిభాగాలు తయారీ గుట్టుగా మావోయిస్టులకు సరఫరా
ఏలూరు పోలీసుల తనిఖీల్లో వెలుగులోకి.. పసిగట్టని నగర పోలీసులు
ఎర్రచందనం నిల్వలను గుర్తించిన చిత్తూరు పోలీసులు
ఆసియాలోనే అతిపెద్దదైన జవహర్ ఆటోనగర్ అసాంఘిక శక్తులకు అడ్డాగా మారింది. అసాంఘిక శక్తులు ఇక్కడ స్థావరాలు ఏర్పాటుచేసుకున్నాయి. కొద్దిరోజుల కిందట కోట్లాది రూపాయల విలువైన ఎర్రచందనం దుంగల డంప్‌ను చిత్తూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది మరువకముందే మావోయిస్టులకు ఆయుధాలు సరఫరా చేస్తున్న వ్యక్తిని పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకోవడం సంచలనం సృష్టించింది. నగర పోలీసులతో సంబంధం లేకుండా ఏలూరు పోలీసులు ఈ ఆపరేషన్ నిర్వహించడం మన కమిషనరేట్ అధికారుల పనితీరును అద్దంపడుతోంది.
విజయవాడ : విఖ్యాత జవహర్ ఆటోనగర్ కొద్దికాలంగా చట్టవిరుద్ధ కార్యక్రమాలకు కేంద్రంగా మారింది. చిత్తూరు జిల్లాల నుంచి తీసుకొచ్చిన ఎర్రచందనం దుంగలను ఇక్కడే దాచారు. మావోయిస్టుల ఆయుధాలు ఇక్కడి పౌండ్రీల్లోనే తయారవుతున్నాయి. అక్రమ రవాణాకు కేంద్రంగా మారింది. నగరపోలీస్ కమిషనరేట్ అధికారులు నిఘా పెట్టకపోవడం వల్లే చీకటి కార్యకలాపాలు యథేచ్ఛగా సాగుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తుపాకుల విడిభాగాలకు కేంద్రంగా...
వారం రోజుల క్రితం మావోయిస్టు సానుభూతిపరుల అరెస్టు సమయంలో లభించిన సమాచారం మేరకు ఆటోనగర్‌లో ఉండే శరత్‌రెడ్డి అనే బీటెక్ విద్యార్థిని పశ్చిమ గోదావరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరుకు చెందిన శరత్ ఆటోనగర్‌లో నివాసముంటూ తుపాకుల విడి భాగాలను అసెంబ్లింగ్ చేయించి మావోయిస్టులకు సరఫరా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. శరత్‌ను అరెస్టు చేసిన వారం రోజుల వ్యవధిలోనే పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం సమీపంలో మావోయిస్టు సానుభూతిపరులను అక్కడి పోలీసులు అరెస్ట్‌చేశారు. వారి ద్వారా నగరంలోని ఆటోనగర్‌లో ఆయుధాల విడి భాగాలు తయారుచేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి ఆటోనగర్‌లోని ఓ పౌండ్రీపై దాడి చేసి ఆయుధాల తయారీకి ఉపయోగించే ముడి సరకును స్వాధీనం చేసుకున్నారు. పౌండ్రీ యజమాని శివరాజుతోపాటు ఇక్కడ పనిచేసే ఆంథోనీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. వీరిని పూర్తిస్థాయిలో విచారించడం ద్వారా ఆయుధాలు తయారు చేసేవారు మరెవరైనా ఉన్నారా.. అనే విషయాన్ని రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా పలు పౌండ్రీల్లో ఆయుధాలు తయారవుతున్నట్టు ప్రత్యేక పోలీసు విభాగం వద్ద సమాచారం ఉంది. పలు సందర్భాల్లో పట్టుబడిన ఆయుధాలను బీహార్ నుంచి తెచ్చినట్టు చెప్పడం ద్వారా పోలీసులు తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకున్నారని వరుస ఘటనలు స్పష్టంచేస్తున్నాయి.
దొంగ రవాణా... : ఆటోనగర్‌లోని ఓ ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయం నుంచి మావోయిస్టులకు ఆయుధాలు సరఫరా చేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. పదేళ్ల క్రితం ఆటోనగర్‌లోని ప్రధాన ట్రాన్స్‌పోర్టు కార్యాలయం నుంచి గుంటూరు జిల్లా అచ్చంపేటకు పెద్ద సంఖ్యలో రాకెట్ లాంఛర్లు, జిలెటిన్ స్టిక్స్ సరఫరా చేశారు. అక్కడి పోలీసుల సమాచారం ఆధారంగా స్థానిక పోలీసులు ట్రాన్స్‌పోర్టు కార్యాలయంపై దాడి చేసి అక్రమంగా నిల్వ ఉంచిన ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆటోనగర్‌లో నిఘా పెంచడంతోపాటు భద్రతను కట్టుదిట్టం చేస్తామని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. అధికారుల మాటలు కార్యరూపం దాల్చలేదు. ఇది అసాంఘిక శక్తులకు వరంగా మారింది.
మాయలోకంగా మారిన ఆటోనగర్...: ఆటోనగర్ మాయలోకంగా మారింది. దొంగతనంగా ఎవరు ఏ వస్తువు తెచ్చినా దాని నామరూపాలు లేకుండా భాగాలు విడగొట్టడంలో ఇక్కడ నిష్ణాతులు ఉన్నారు. చోరీ చేసిన వాహనాలను విడి భాగాలుగా విక్రయించడంలో గుంటూరు ప్రసిద్ధి. ప్రస్తుతం జవహర్ ఆటోనగర్ ఆ కీర్తిని సొంతం చేసుకుంది. మరోవైపు ఇక్కడ పనిచేసే వ్యక్తుల సమాచారం కూడా ఎవరి వద్ద లభించదు. వారు కూడా ఎప్పుడు ఎక్కడ పనిచేస్తారో తెలియదు.
నగరం అనువైన ప్రాంతమని... : నవ్యాంధ్ర రాజధానికి కేంద్రంగా ప్రకటించిన విజయవాడ మావోయిస్టులకు మంచి స్థావరంగా మారిందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పుడిప్పుడే తిరిగి మావోయిస్టుల కార్యకలాపాలు ప్రారంభమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2007 తర్వాత మావోయిస్టుల కార్యకలాపాలు పూర్తిస్థాయిలో లేకుండాపోయాయి. మావోయిస్టు నేత మాధవ్‌ను ప్రకాశం జిల్లా పాలుట్ల వద్ద పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడం, అదే జిల్లాలోని పుల్లలచెరువు మండలం ఎండ్రపల్లి వద్ద టెక్ మధును పోలీసులు హతమార్చడంతో మావోయిస్టులు ఆత్మరక్షణలో పడ్డారు. ఆ తర్వాత నల్లమలను చుట్టుముట్టిన పోలీసులు పదుల సంఖ్యలో మావోయిస్టు నేతలను ఎన్‌కౌంటర్ చేశారు. పలువురు సానుభూతిపరులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో మావోయిస్టులు నల్లమలను వీడాల్సి వచ్చింది. ఇటీవల తిరిగి తమ కార్యకలాపాలను నల్లమలలో కొనసాగించే కార్యక్రమంలో భాగంగా ఎవరికీ అనుమానం రాకుండా విజయవాడను ఆయుధాల తయారీ కేంద్రంగా మార్చుకున్నట్లు సమాచారం. ఇక్కడి నుంచి ఏలూరు వరకు ఆయుధాలు తీసుకువెళ్లగలిగితే ఏజెన్సీ ఏరియాలోకి సునాయాసంగా చేర్చే అవకాశం ఉంటుంది. ఇక గుంటూరు దాటించగలిగితే నల్లమలలోని తమ అనుయాయులకు అందజేయవచ్చు. గతంలో ప్రకాశం జిల్లాలోని పుల్లలచెరువు మండలం అక్కపాలెం గ్రామంలో తపంచాలు మావోయిస్టులు తయారుచేయించారు. అప్పట్లో మావోయిస్టుల కోసం గాలిస్తున్న ప్రత్యేక పోలీసు బలగాలు దాడులు చేసి తయారుచేస్తున్న వ్యక్తిని అరెస్ట్‌చేశారు. అందువల్ల నల్లమలను ఆనుకుని ఉన్న ఏ గ్రామాల్లో ఆయుధాలు తయారు చేసినా సులభంగా పోలీసులు గుర్తించే అవకాశం ఉందని, రాజధాని నగరంలో అయితే ఎవరికీ అనుమానం రాదని భావించినట్లు సమాచారం. ఆయుధాలను పూర్తిగా బిగించకుండా విడిభాగాలు మాత్రమే తయారుచేసి అడవుల్లోకి చేరిన తరువాత వాటిని బిగించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారని తెలిసింది.
మాకు తెలియదు
ఆటోనగర్‌లో ఆయుధాల తయారీ విషయం మాకు తెలియదు. కొద్దిరోజుల కిందట ఏలూరు పోలీసులు ఆయుధాలకు వినియోగించే మ్యాగ్జయిన్ తయారు చేస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అప్పుడే వాటి తయారీకి వినియోగించే ముడి సరుకు స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు పోలీసుల తనిఖీకి సంబంధించి మాకు సమాచారం లేదు. మేము ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు.
- లావణ్యలక్ష్మి, సెంట్రల్ జోన్ ఏసీపీ
నిద్దరోతున్న నిఘా!
Published Sun, Dec 28 2014 1:18 AM | Last Updated on Tue, Aug 21 2018 6:22 PM
Advertisement