autonagar
-
ఆటోనగర్లపై ప్రభుత్వ నిర్ణయం ఓ మంచి అవకాశం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఆటోనగర్లతో పాటు ఏపీఐఐసీ పారిశ్రామిక వాడలు, ఎస్టేట్లలో దివాలా తీసిన పరిశ్రమలు, యూనిట్ల భూములను బహుళ అవసరాలకు వినియోగించుకునేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కో–ఆర్డినేటెడ్ గ్రోత్ పాలసీని పారిశ్రామికవేత్తలు స్వాగతిస్తున్నారు. గతంలో నగరాలు, పట్టణాల చివర్ల ఉన్న ఆటోనగర్లు, పారిశ్రామిక పార్కుల చుట్టూ ఇప్పుడు నివాస ప్రాంతాలు వచ్చేశాయి. దీంతో ప్రజలు, పారిశ్రామికవేత్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆటోనగర్లలోని యూనిట్ల దారుల నుంచి ఆ భూములను రెసిడెన్షియల్, వాణిజ్య అవసరాలకు వినియోగించుకునే వెసులుబాటు కల్పించింది. నగరం మధ్య యూనిట్లు నడపడం కష్టంగా ఉన్న వారు స్వచ్ఛందంగా ముందుకు రావచ్చు. వీరు భూముల వినియోగ మార్పిడికి మార్కెట్ విలువలో 50 శాతం ఫీజుగా చెల్లించాలి, లేదా 50 శాతం భూమిని ఏపీఐఐసీకి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ భూమిని ఇతర అవసరాలకు వినియోగించుకోవడానికి ఏపీఐఐసీ నిరభ్యంతర సర్టిఫికెట్ ఇస్తుంది. అదే సొంతంగా భూమిని కొనుగోలు చేసుకున్న పారిశ్రామిక యూనిట్ల భూ వినియోగ మార్పిడికి మార్కెట్ విలువలో 15 శాతం ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు భూముల ధరలు భారీగా పెరగడంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపుతున్నారు. 50 శాతం ప్రభుత్వానికి చెల్లించినా లాభమే అని పేర్కొంటున్నారు. ఈ జీవోలు పారిశ్రామికవేత్తలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయని, విశాఖ ఆటోనగర్ ఎ, బి, సి బ్లాకుల్లోని యూనిట్లకు చక్కటి అవకాశమని ఏపీఐఐసీ ఐలా ఆటోనగర్ చైర్మన్ కె.సత్యనారాయణరెడ్డి (రఘు) తెలిపారు. విశాఖ ఆటోనగర్‌లో తన రెండు యూనిట్లు నివాసప్రాంతాలకు ఆనుకొని ఉన్నాయని, ఇప్పుడు ఈ ఆ యూనిట్లను మార్చుకునే అవకాశం లభించిందని పారిశ్రామికవేత్త సీహెచ్ రవికుమార్ చెప్పారు. మరింత స్పష్టత రావాలి... రాష్ట్ర ఫ్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వులపై మరింత స్పష్టత రావాల్సి ఉందని మరికొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పథకం కింద ఓ యూనిట్ మూసివేసి అక్కడ గృహ సముదాయాన్ని నిర్మిస్తే ఆ పక్కనే నడుస్తున్న యూనిట్ల నుంచి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందంటున్నారు. అలాగే మార్కెట్ విలువలో 50 శాతం కట్టమంటే చిన్న యూనిట్ దారులకు భారమవుతుందంటున్నారు. ఇప్పటికే ఈ ఉత్తర్వులపై ఏపీ చాంబర్స్ ప్రతినిధులు ఆటోనగర్ అసోసియేషన్‌తో సంప్రదింపులు జరిపామని, మరింత స్పష్టత కోసం త్వరలో ఏపీఐఐసీ అధికారులను కలవనున్నట్లు ఏపీ చాంబర్స్ ప్రెసిడెంట్ (ఎలెక్ట్) పొట్లూరి భాస్కరరావు పేర్కొన్నారు. -
ఈ వార్త ఎందుకో పొసగడం లేదు: ఐవైఆర్ ట్వీట్
-
అక్రమాలకు కేరాఫ్ ఆటోనగర్
సాక్షి, మంగళగిరి: పట్టణంలోని ఆటోనగర్ అక్రమాలకు కేరాఫ్‌గా మారిందనే విమర్శలున్నాయి. ఆటోమొబైల్ రంగం మొత్తాన్ని ఒక చోటకి చేర్చి ఉపాధి అవకాశాలు మెరుగుపరచి పరిశ్రమలు నెలకొల్పాలనే లక్ష్యంతో 2007వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏపీఐఐసీ పట్టణంలో ఆటోనగర్ ఏర్పాటు చేశారు. 116 ఎకరాల భూములను సేకరించి ఆటోనగర్ స్థాపించారు. 396 మందికి కేటాయింపు ఆటోనగర్‌లో వివిధ రంగాలకు చెందిన 396 మందికి పరిశ్రమలకు స్థలాలను కేటాయించారు. ప్రభుత్వ లక్ష్యం నెరవేరకపోగా స్థలాల ధరలు పెరిగిపోవడంతో చాలామంది లబ్ధిదారులు ఏపీఐఐసీ నుంచి తక్కువ ధరలకు తీసుకుని అధిక ధరలకు విక్రయించారనే విమర్శలున్నాయి. అధిక మంది లబ్ధిదారులు ఈ విధంగానే విక్రయాలు చేసి సొమ్ము చేసుకోగా ఇప్పుడున్న వారిలో సగానికి పైగా స్థలాలను విక్రయాలు జరిగాయనే ఆరోపణలు వినిపిస్తున్నా అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విశేషం. ఏపీఐఐసీ నిబంధనల మేరకు పరిశ్రమ నెలకొల్పేందుకు స్థలం తీసుకున్న యజమాని గడువు సమయంలో పరిశ్రమ ఏర్పాటు చేయకపోతే స్థలాన్ని స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. అయితే 12 ఏళ్లు కొందరు ఎలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేయకపోయిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికి 55 మంది తాను తీసుకున్న స్థలాల్లో ఎలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేయకపోవడంతో ఏపీఐఐసీ అధికారులు తిరిగి స్థలాలను అప్పగించాలని నోటీసులు జారీ చేయడంతో స్థలాల యజమానులు కోర్టును ఆశ్రయించి కాలయాపన చేస్తున్నారు. ప్రారంభం కాని కంపెనీలు పట్టణానికి దగ్గరగా ఉండడంతో ఆటోనగర్‌లోని స్థలాల ధరలు భారీగా పెరగడంతో విక్రయాలు చేయకూడదనే నిబంధనలను అతిక్రమించి విక్రయాలు జరిపారు. మరో వైపు స్థలాలకు రిజిస్ట్రేషన్ చేసే అవకాశం లేకపోయినా కొనుగోలుదారులు కేవలం స్వాధీన విక్రయ అగ్రిమెంట్లతో కొనుగోలు చేస్తున్నారు. మరి కొందరు నిబంధనలను తుంగలో తొక్కి కల్యాణ మండపాలు నిర్మించి సొమ్ము చేసుకుంటున్నారు. గ్యాస్ గోడౌన్ పేరుతో స్థలం పొంది కల్యాణ మండపం నిర్మించి రూ.లక్షలు అర్జిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. మరో వైపు ఐదేళ్ల క్రితం టీడీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం ఐటీ హబ్‌కు ఆటోనగర్‌లోని స్థలాలను తక్కువ ధరలకు కేటాయించింది. పది ఎకరాలు కేటాయించినా తొలి దశ పనులు పూర్తి కాగా రెండో దశ పనులు ప్రారంభం కాలేదు. మరికొన్ని ఐటీ కంపెనీలకు స్థలాలను కేటాయించగా వాటిలో ఇప్పటికి కొన్ని కంపెనీలు గడువు ముగిసినా పనులు ప్రారంభించలేదు. రాజధానిలో ప్రధాన పట్టణంగా విస్తరిస్తున్న మంగళగిరి ఆటోనగర్‌పై అధికారులు దృష్టి సారించి అక్రమాలకు అడ్డుకట్టవేసి పరిశ్రమలను స్థాపించే వారికి స్థలాలను కేటాయిస్తే పరిశ్రమలు ఏర్పాటు కావడంతో యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు మెరుగు అవుతాయని ఆ దిశగా నూతన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. నోటీసులు ఇస్తాం పరిశ్రమలు స్థాపించని 55 మందిని గుర్తించి నోటీసులు జారీ చేశాం. వారు కోర్టును ఆశ్రయించారు. ఐటీ పార్కులో పరిశ్రమలు స్థాపించని వారికి నోటీసులిస్తాం. నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు జరిపితే పరిశీలించి చర్యలు తీసుకుంటాం. –పీఎస్ రావు, జెడ్ఎం, ఏపీఐఐసీ -
విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్నిప్రమాదం..
సాక్షి, విజయవాడ: ప్రఖ్యాత పారిశ్రామిక, ఆటోమొబైల్ కేంద్రం ‘విజయవాడ ఆటోనగర్’లో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. కానూరు రోడ్డులోని ఓ కూలర్ల కంపెనీలో ఉదయం 11 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. గుర్తించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. నిమిషాల వ్యవధిలోనే మంటలు.. పక్కనున్న ఇంజన్ ఆయిల్ మిక్స్డ్ యూనిట్‌కు అంటుకున్నాయి. దీంతో అదుపుచేయలేనంత స్థాయిలో మంటల ఉధృతి పెరిగింది. ప్రస్తుతం పది ఫైరింజన్లలో మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు. ప్రమాదం జరిగి రెండు గంటలవుతున్నా మంటలు అదుపులోకి రాలేదు. అగ్ని మాపక సిబ్బంది 10 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటలను అదుపు చేసేందుకు ఎన్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగింది. కలెక్టర్ లక్ష్మీ కాంతం, జాయింట్ పోలీస్ కమిషనర్ క్రాంతి రానా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ముడి ఆయిల్ పరిశ్రమకు మంటలు వ్యాపించడంతో అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. ఆయిల్ పరిశ్రమలో 100 పీపాల ఆయిల్ ఉండటంతో పీపాలు పేలుతున్నాయి. కానూరు పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ప్రమాద స్థలంలో దట్టమైన పొగ కమ్మేసింది. ముందే వచ్చుంటే ఇంత ఘోరం జరిగేదికాదు.. కాగా, అగ్నిప్రమాద ఘటనలో అగ్నిమాపక సిబ్బంది తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 11:15కు మంటలు గుర్తించి ఫోన్ చేశామని.. అర గంట తర్వాతగానీ ఫైరింజన్ రాలేదని తెలిపారు. ‘‘మంటలు చిన్నగా ఉన్నప్పుడే ఫైరింజన్ వచ్చేదుంటే ఇంత ఘోరం జరిగేదేకాదు. వచ్చిన ఒక్క ఫైరింజన్ కూడా ఏమీ చెయ్యలేక, మరో నాలుగీటిని పిలిపించారు. అదృష్టవశాత్తూ కార్మికులు అందరూ బయటికి వచ్చేశారు’’ అని స్థానికులు చెప్పారు. అగ్నప్రమాదం కారణంగా ఆటోనగర్ ప్రాంతంమంతా దట్టమైన పొగ వ్యాపించి జనం ఇబ్బందులు పడ్డారు. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది. -
ఆటోనగర్‌లో అగ్నిప్రమాదం
-
కాసులివ్వండి..! నేరస్తులను తీసుకెళ్లండి..!!
లక్షలు నొక్కేసి నిందితుని వదిలివేత కమిషనరేట్‌లో పెరిగిన అవినీతి విజయవాడ సిటీ : ఆసియాలోనే అతిపెద్దదైన జవహర్ ఆటోనగర్‌లో పాత వాహనాల ఖండం(డిస్మాంటిలింగ్) వ్యవహారాలు అక్రమాలకు నెలవుగా మారుతున్నాయి. పోలీసు అధికారుల వెన్నుదన్నుతో నిబంధనలకు విరుద్ధంగా వాహనాల ‘సి బుక్’లను విక్రయించి కొందరు వ్యాపారులు కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. వీటిని కొనుగోలు చేసే వ్యక్తులు సరుకుల లోడు మాయం చేసేందుకు.. ఫైనాన్స్ కంపెనీలను మోసగించేందుకు వినియోగిస్తున్నారు. మూడు రోజుల కిందట సి బుక్‌ల విక్రయం కేసులో అదుపులోకి తీసుకున్న డిస్మాంటిల్ వ్యాపారిని లక్షలు నొక్కేసి పోలీసులు వదిలేశారు. గతంలో కూడా ఈ తరహా కేసుల్లో పలువురు పట్టుబడినప్పటికీ.. ఎప్పటికప్పుడు పోలీసులను మామూళ్ల మత్తులో ముంచుతూ బయటపడుతున్నట్టు ఆరోపణలు వినబడుతున్నాయి. ఇదీ జరిగింది ఆటోనగర్ ఐదో రోడ్డుకు చెందిన ఓ డిస్మాంటిల్ వ్యాపారి తన భాగస్వాములతో కలిసి నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో 200 పైబడి పాత వాహనాలు కొనుగోలు చేశాడు. వీటిని తుక్కు కింద చేసిన తర్వాత సి బుక్‌లను బళ్లారి ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులకు మోడల్‌ను బట్టి రూ.1లక్ష నుంచి 5లక్షల వరకు విక్రయించాడు. వీటిని దొంగ వాహనాలకు వినియోగించేందుకు అక్కడి వారు కొనుగోలు చేసినట్టు తెలిసింది. కొనుగోలు చేసిన సి బుక్స్‌లోని ఇంజిన్, ఛాసిస్ నంబర్లు మార్చేందుకు ఆటోనగర్‌లోనే కొందరు ప్రత్యేకంగా ఉన్నారు. వీరి ద్వారా లారీల ఇంజిన్, ఛాసిస్ నంబర్లను మార్చేసిన ‘బళ్లారి బాబులు’ పెద్ద ఎత్తున ఐరన్ ఓర్, నిత్యావసర సరుకులు మాయం చేసినట్టు తెలిసింది. వరుస ఘటనలపై దృష్టిసారించిన బళ్లారి పోలీసులకు ఈ వ్యవహారాలు విజయవాడ కేంద్రంగా సాగుతున్నట్టు గుర్తించారు. ఎవరెవరు ఇందుకు సూత్రధారులో గుర్తించేందుకు బళ్లారి పోలీసులు సమాయత్తమవుతున్న విషయం ‘తూర్పు మండలం’ లోని ఓ పోలీసు స్టేషన్ అధికారికి ఉప్పందింది. ఆపై ఆయన రంగంలోకి దిగి తన పని చక్కబెట్టుకున్నారు. రంగంలోకి పాత నేరస్తులు గతంలో ఈ తరహా నేరాలు చేసిన ఇద్దరు వ్యక్తులు పోలీసు అధికారిని కలిసి మంతనాలు జరిపారు. రూ.6 లక్షలు ఇస్తే వదిలేస్తానని ఆ అధికారి బేరం పెట్టారు. బెంజిసర్కిల్ సమీపంలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో ఇరువర్గాల మధ్య గంటలకొద్దీ చర్చలు జరిగాయి. ఎట్టకేలకు రూ.3లక్షలు ఇచ్చేందుకు మధ్యవర్తులు అంగీకరించారు. చర్చలు జరిగిన చోటనే నగదు లావాదేవీలు నిర్వహించేందుకు చేసుకున్న ఒప్పందంలో భాగంగా స్టేషన్లో ఉంచిన వ్యక్తిని వదిలేశారు. వ్యవహారం సద్దుమణిగే వరకు కొద్ది రోజుల పాటు ఊరు విడిచి వెళ్లాలంటూ ఆ పోలీసు అధికారి చేసిన సూచనకు వారు అంగీకరించారు. అనుకున్నట్టుగానే ఆదివారం నగదు ముట్టింది. విషయం కమిషనరేట్‌లోని కొందరు అధికారులకు తెలియడంతో.. బదిలీపై మరో జోన్‌కు వెళుతూ కూడా బహుమానంగా రూ.3లక్షలు పట్టుకెళ్లాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అర్ధరాత్రి వరకు హైడ్రామా సమాచారం వచ్చిన వెంటనే ఆటోనగర్‌కు చెందిన డిస్మాంటిల్ వ్యాపారిని గత శనివారం స్టేషన్‌కి తీసుకొచ్చి అర్ధరాత్రి వదిలేయడం వరకు హైడ్రామా చోటు చేసుకుంది. గతంలో రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం నుంచి ఈ తరహా కేసులు రాగా, సెటిల్ చేసుకున్న వ్యవహారాలను ఉటంకించారు. తుక్కు చేసిన వాహనాల సి బుక్స్ విక్రయించడం నేరం కాబట్టి కేసు నమోదు చేయక తప్పదన్నారు. తాను అరెస్టు చేసిన తర్వాత బళ్లారి పోలీసులు కూడా వచ్చి అరెస్టు చేస్తారని హెచ్చరించారు. ఏదో ఒకటి సెటిల్ చేసుకోమంటూ హితబోధ చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు స్టేషన్లోనే నిర్బంధించడంతో సెటిల్ చేసుకునేందుకు వారు ముందుకొచ్చారు. -
నిద్దరోతున్న నిఘా!
చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అడ్డాగా ఆటోనగర్ తుపాకుల విడిభాగాలు తయారీ గుట్టుగా మావోయిస్టులకు సరఫరా ఏలూరు పోలీసుల తనిఖీల్లో వెలుగులోకి.. పసిగట్టని నగర పోలీసులు ఎర్రచందనం నిల్వలను గుర్తించిన చిత్తూరు పోలీసులు ఆసియాలోనే అతిపెద్దదైన జవహర్ ఆటోనగర్ అసాంఘిక శక్తులకు అడ్డాగా మారింది. అసాంఘిక శక్తులు ఇక్కడ స్థావరాలు ఏర్పాటుచేసుకున్నాయి. కొద్దిరోజుల కిందట కోట్లాది రూపాయల విలువైన ఎర్రచందనం దుంగల డంప్‌ను చిత్తూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది మరువకముందే మావోయిస్టులకు ఆయుధాలు సరఫరా చేస్తున్న వ్యక్తిని పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకోవడం సంచలనం సృష్టించింది. నగర పోలీసులతో సంబంధం లేకుండా ఏలూరు పోలీసులు ఈ ఆపరేషన్ నిర్వహించడం మన కమిషనరేట్ అధికారుల పనితీరును అద్దంపడుతోంది. విజయవాడ : విఖ్యాత జవహర్ ఆటోనగర్ కొద్దికాలంగా చట్టవిరుద్ధ కార్యక్రమాలకు కేంద్రంగా మారింది. చిత్తూరు జిల్లాల నుంచి తీసుకొచ్చిన ఎర్రచందనం దుంగలను ఇక్కడే దాచారు. మావోయిస్టుల ఆయుధాలు ఇక్కడి పౌండ్రీల్లోనే తయారవుతున్నాయి. అక్రమ రవాణాకు కేంద్రంగా మారింది. నగరపోలీస్ కమిషనరేట్ అధికారులు నిఘా పెట్టకపోవడం వల్లే చీకటి కార్యకలాపాలు యథేచ్ఛగా సాగుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తుపాకుల విడిభాగాలకు కేంద్రంగా... వారం రోజుల క్రితం మావోయిస్టు సానుభూతిపరుల అరెస్టు సమయంలో లభించిన సమాచారం మేరకు ఆటోనగర్‌లో ఉండే శరత్‌రెడ్డి అనే బీటెక్ విద్యార్థిని పశ్చిమ గోదావరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరుకు చెందిన శరత్ ఆటోనగర్‌లో నివాసముంటూ తుపాకుల విడి భాగాలను అసెంబ్లింగ్ చేయించి మావోయిస్టులకు సరఫరా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. శరత్‌ను అరెస్టు చేసిన వారం రోజుల వ్యవధిలోనే పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం సమీపంలో మావోయిస్టు సానుభూతిపరులను అక్కడి పోలీసులు అరెస్ట్‌చేశారు. వారి ద్వారా నగరంలోని ఆటోనగర్‌లో ఆయుధాల విడి భాగాలు తయారుచేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి ఆటోనగర్‌లోని ఓ పౌండ్రీపై దాడి చేసి ఆయుధాల తయారీకి ఉపయోగించే ముడి సరకును స్వాధీనం చేసుకున్నారు. పౌండ్రీ యజమాని శివరాజుతోపాటు ఇక్కడ పనిచేసే ఆంథోనీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. వీరిని పూర్తిస్థాయిలో విచారించడం ద్వారా ఆయుధాలు తయారు చేసేవారు మరెవరైనా ఉన్నారా.. అనే విషయాన్ని రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా పలు పౌండ్రీల్లో ఆయుధాలు తయారవుతున్నట్టు ప్రత్యేక పోలీసు విభాగం వద్ద సమాచారం ఉంది. పలు సందర్భాల్లో పట్టుబడిన ఆయుధాలను బీహార్ నుంచి తెచ్చినట్టు చెప్పడం ద్వారా పోలీసులు తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకున్నారని వరుస ఘటనలు స్పష్టంచేస్తున్నాయి. దొంగ రవాణా... : ఆటోనగర్‌లోని ఓ ట్రాన్స్పోర్ట్ కార్యాలయం నుంచి మావోయిస్టులకు ఆయుధాలు సరఫరా చేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. పదేళ్ల క్రితం ఆటోనగర్‌లోని ప్రధాన ట్రాన్స్‌పోర్టు కార్యాలయం నుంచి గుంటూరు జిల్లా అచ్చంపేటకు పెద్ద సంఖ్యలో రాకెట్ లాంఛర్లు, జిలెటిన్ స్టిక్స్ సరఫరా చేశారు. అక్కడి పోలీసుల సమాచారం ఆధారంగా స్థానిక పోలీసులు ట్రాన్స్‌పోర్టు కార్యాలయంపై దాడి చేసి అక్రమంగా నిల్వ ఉంచిన ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆటోనగర్‌లో నిఘా పెంచడంతోపాటు భద్రతను కట్టుదిట్టం చేస్తామని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. అధికారుల మాటలు కార్యరూపం దాల్చలేదు. ఇది అసాంఘిక శక్తులకు వరంగా మారింది. మాయలోకంగా మారిన ఆటోనగర్...: ఆటోనగర్ మాయలోకంగా మారింది. దొంగతనంగా ఎవరు ఏ వస్తువు తెచ్చినా దాని నామరూపాలు లేకుండా భాగాలు విడగొట్టడంలో ఇక్కడ నిష్ణాతులు ఉన్నారు. చోరీ చేసిన వాహనాలను విడి భాగాలుగా విక్రయించడంలో గుంటూరు ప్రసిద్ధి. ప్రస్తుతం జవహర్ ఆటోనగర్ ఆ కీర్తిని సొంతం చేసుకుంది. మరోవైపు ఇక్కడ పనిచేసే వ్యక్తుల సమాచారం కూడా ఎవరి వద్ద లభించదు. వారు కూడా ఎప్పుడు ఎక్కడ పనిచేస్తారో తెలియదు. నగరం అనువైన ప్రాంతమని... : నవ్యాంధ్ర రాజధానికి కేంద్రంగా ప్రకటించిన విజయవాడ మావోయిస్టులకు మంచి స్థావరంగా మారిందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పుడిప్పుడే తిరిగి మావోయిస్టుల కార్యకలాపాలు ప్రారంభమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2007 తర్వాత మావోయిస్టుల కార్యకలాపాలు పూర్తిస్థాయిలో లేకుండాపోయాయి. మావోయిస్టు నేత మాధవ్‌ను ప్రకాశం జిల్లా పాలుట్ల వద్ద పోలీసులు ఎన్కౌంటర్ చేయడం, అదే జిల్లాలోని పుల్లలచెరువు మండలం ఎండ్రపల్లి వద్ద టెక్ మధును పోలీసులు హతమార్చడంతో మావోయిస్టులు ఆత్మరక్షణలో పడ్డారు. ఆ తర్వాత నల్లమలను చుట్టుముట్టిన పోలీసులు పదుల సంఖ్యలో మావోయిస్టు నేతలను ఎన్కౌంటర్ చేశారు. పలువురు సానుభూతిపరులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో మావోయిస్టులు నల్లమలను వీడాల్సి వచ్చింది. ఇటీవల తిరిగి తమ కార్యకలాపాలను నల్లమలలో కొనసాగించే కార్యక్రమంలో భాగంగా ఎవరికీ అనుమానం రాకుండా విజయవాడను ఆయుధాల తయారీ కేంద్రంగా మార్చుకున్నట్లు సమాచారం. ఇక్కడి నుంచి ఏలూరు వరకు ఆయుధాలు తీసుకువెళ్లగలిగితే ఏజెన్సీ ఏరియాలోకి సునాయాసంగా చేర్చే అవకాశం ఉంటుంది. ఇక గుంటూరు దాటించగలిగితే నల్లమలలోని తమ అనుయాయులకు అందజేయవచ్చు. గతంలో ప్రకాశం జిల్లాలోని పుల్లలచెరువు మండలం అక్కపాలెం గ్రామంలో తపంచాలు మావోయిస్టులు తయారుచేయించారు. అప్పట్లో మావోయిస్టుల కోసం గాలిస్తున్న ప్రత్యేక పోలీసు బలగాలు దాడులు చేసి తయారుచేస్తున్న వ్యక్తిని అరెస్ట్‌చేశారు. అందువల్ల నల్లమలను ఆనుకుని ఉన్న ఏ గ్రామాల్లో ఆయుధాలు తయారు చేసినా సులభంగా పోలీసులు గుర్తించే అవకాశం ఉందని, రాజధాని నగరంలో అయితే ఎవరికీ అనుమానం రాదని భావించినట్లు సమాచారం. ఆయుధాలను పూర్తిగా బిగించకుండా విడిభాగాలు మాత్రమే తయారుచేసి అడవుల్లోకి చేరిన తరువాత వాటిని బిగించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారని తెలిసింది. మాకు తెలియదు ఆటోనగర్‌లో ఆయుధాల తయారీ విషయం మాకు తెలియదు. కొద్దిరోజుల కిందట ఏలూరు పోలీసులు ఆయుధాలకు వినియోగించే మ్యాగ్జయిన్ తయారు చేస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అప్పుడే వాటి తయారీకి వినియోగించే ముడి సరుకు స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు పోలీసుల తనిఖీకి సంబంధించి మాకు సమాచారం లేదు. మేము ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. - లావణ్యలక్ష్మి, సెంట్రల్ జోన్ ఏసీపీ -
ప్రాణంమీదకు తెచ్చిన పోలీసుల అత్యుత్సాహం
హైదరాబాద్: పోలీసుల అత్యుత్సాహం ఇద్దరు యువకుల ప్రాణాల మీదకు తెచ్చింది. ముఖ్యమంత్రి కాన్వాయ్ కు అడ్డువచ్చారనే కారణంతో ద్విచక్రవాహనాన్ని పొలీసు వాహనంతో గుద్దించారు. ఫలితంగా బైకుపై వెళుతున్న ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వనస్థలిపురంలోని ఆటోనగర్ లో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల అత్యుత్సాహంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సహనం కోల్పోయి ఇద్దరు యువకులు గాయపడడానికి కారణమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.