
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఆటోనగర్లతో పాటు ఏపీఐఐసీ పారిశ్రామిక వాడలు, ఎస్టేట్‌లలో దివాలా తీసిన పరిశ్రమలు, యూనిట్ల భూములను బహుళ అవసరాలకు వినియోగించుకునేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కో–ఆర్డినేటెడ్ గ్రోత్ పాలసీని పారిశ్రామికవేత్తలు స్వాగతిస్తున్నారు. గతంలో నగరాలు, పట్టణాల చివర్ల ఉన్న ఆటోనగర్‌లు, పారిశ్రామిక పార్కుల చుట్టూ ఇప్పుడు నివాస ప్రాంతాలు వచ్చేశాయి. దీంతో ప్రజలు, పారిశ్రామికవేత్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆటోనగర్లలోని యూనిట్ల దారుల నుంచి ఆ భూములను రెసిడెన్షియల్, వాణిజ్య అవసరాలకు వినియోగించుకునే వెసులుబాటు కల్పించింది. నగరం మధ్య యూనిట్లు నడపడం కష్టంగా ఉన్న వారు స్వచ్ఛందంగా ముందుకు రావచ్చు.
వీరు భూముల వినియోగ మార్పిడికి మార్కెట్ విలువలో 50 శాతం ఫీజుగా చెల్లించాలి, లేదా 50 శాతం భూమిని ఏపీఐఐసీకి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ భూమిని ఇతర అవసరాలకు వినియోగించుకోవడానికి ఏపీఐఐసీ నిరభ్యంతర సర్టిఫికెట్ ఇస్తుంది. అదే సొంతంగా భూమిని కొనుగోలు చేసుకున్న పారిశ్రామిక యూనిట్ల భూ వినియోగ మార్పిడికి మార్కెట్ విలువలో 15 శాతం ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు భూముల ధరలు భారీగా పెరగడంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపుతున్నారు. 50 శాతం ప్రభుత్వానికి చెల్లించినా లాభమే అని పేర్కొంటున్నారు. ఈ జీవోలు పారిశ్రామికవేత్తలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయని, విశాఖ ఆటోనగర్ ఎ, బి, సి బ్లాకుల్లోని యూనిట్లకు చక్కటి అవకాశమని ఏపీఐఐసీ ఐలా ఆటోనగర్ చైర్మన్ కె.సత్యనారాయణరెడ్డి (రఘు) తెలిపారు. విశాఖ ఆటోనగర్‌లో తన రెండు యూనిట్లు నివాసప్రాంతాలకు ఆనుకొని ఉన్నాయని, ఇప్పుడు ఈ ఆ యూనిట్లను మార్చుకునే అవకాశం లభించిందని పారిశ్రామికవేత్త సీహెచ్ రవికుమార్ చెప్పారు.
మరింత స్పష్టత రావాలి...
రాష్ట్ర ఫ్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వులపై మరింత స్పష్టత రావాల్సి ఉందని మరికొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పథకం కింద ఓ యూనిట్ మూసివేసి అక్కడ గృహ సముదాయాన్ని నిర్మిస్తే ఆ పక్కనే నడుస్తున్న యూనిట్ల నుంచి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందంటున్నారు. అలాగే మార్కెట్ విలువలో 50 శాతం కట్టమంటే చిన్న యూనిట్ దారులకు భారమవుతుందంటున్నారు. ఇప్పటికే ఈ ఉత్తర్వులపై ఏపీ చాంబర్స్ ప్రతినిధులు ఆటోనగర్ అసోసియేషన్‌తో సంప్రదింపులు జరిపామని, మరింత స్పష్టత కోసం త్వరలో ఏపీఐఐసీ అధికారులను కలవనున్నట్లు ఏపీ చాంబర్స్ ప్రెసిడెంట్ (ఎలెక్ట్) పొట్లూరి భాస్కరరావు పేర్కొన్నారు.