అజిష్ట గుట్టు పెరుమాళ్లకెరుక | Azista industry In Kuppam | Sakshi
Sakshi News home page

అజిష్ట గుట్టు పెరుమాళ్లకెరుక

Published Thu, Mar 14 2019 10:41 AM | Last Updated on Sat, Mar 23 2019 8:59 PM

Azista industry In Kuppam - Sakshi

పరిశ్రమల శాఖ వెబ్‌సైట్‌లోని వివరాలు 

కుప్పం అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నాను. ఇందులో భాగంగా పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నా. శాంతిపురం మండలానికి అజిష్ట పరిశ్రమను తీసుకువచ్చాను’ అని సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. రెండు నెలల క్రితం పరిశ్రమకు శంకుస్థాపన కూడా చేశారు. ఇప్పటి వరకు పరిశ్రమ నిర్మాణ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. ప్రభుత్వం ఈ సంస్థతో చేసుకున్న ఒప్పందం, ఇచ్చిన అనుమతులపై సమాధానం లేని అనేక ప్రశ్నలకు ఆస్కారం ఇస్తోంది. 


సాక్షి శాంతిపురం: మండలంలోని అమ్మవారిపేట రెవెన్యూ పరిధిలో అజిష్ట ఫుడ్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు ప్రభుత్వం భూములు కేటాయించిం ది. సంస్థ ఆరు నెలల క్రితమే 21.20 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. భూములను కూడా చదు ను చేసింది. జనవరి 3న చంద్రబాబునాయుడు పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. రూ 21.18 కోట్ల పెట్టుబడితో వచ్చే పరిశ్రమకు ప్రభుత్వ ప్రోత్సాహకంగా రూ.5 కోట్లను ఇస్తున్నట్టు ప్రకటించారు. కూరగాయలు, పండ్లను డిహైడ్రేట్‌ చేసి ప్రాసెసిం గ్‌ చేస్తారని పేర్కొన్నారు. అధికారికంగా 18.16 ఎకరాల భూమిని అజిష్టకు ఇస్తున్నట్టు తెలిపారు. స్థానిక రెవెన్యూ అధికారులు మాత్రం 21.20 ఎకరాలను అప్పగించారు. శంకుస్థాపన చేసి రెండు నెలలు అవుతున్నా పనులు ప్రారంభం కాలేదు. 


25 ఉద్యోగాలు మాత్రమే..
రూ.5 కోట్ల ప్రభుత్వ రాయితీ, 21.20 ఎకరాల భూమి పొందిన ప్రైవేటు సంస్థ కల్పించే ఉద్యోగాలు మాత్రం 25 మాత్రమే. సాధారణంగా పరిశ్రమల్లో ప్రతి రూ.5 లక్షల పెట్టుబడికి ఒక ఉద్యోగం జనరేట్‌ అవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. పరిశ్రమ పేరుతో ఇస్తున్న రూ.5 కోట్ల రాయితీని పది మందికి ఉద్యోగాలు కల్పిం చే చిన్నతరహా పరిశ్రమల స్థాపనకు కేటాయిం చినా 500 కుటుంబాలకు ఉపాధి దొరుకుతుంది.


రోజుకు 69 వేల లీటర్ల నీరు
కుప్పం ప్రాంతంలో భూగర్భ జలాలు అంతంత మాత్రమే ఉన్నాయి. 1,500 అడుగుల లోతుతో బోర్లు తవ్వినా నీరు వస్తుందనే నమ్మకం లేదు. మార్చి నెలకే తాగునీటి బోర్లు ఎండిపోయి అనేక గ్రామాల్లో నీటి సమస్య ఎక్కువైంది. ఇవేవీ పట్టని ప్రభుత్వం అజిష్ట పరిశ్రమ రోజుకు 69 వేల లీటర్ల నీటిని తోడుకోవడానికి అనుమతులు ఇచ్చింది. ఇదే జరిగితే రామకుప్పం–శాంతిపురం మండలాల్లోని అనేక బోర్లు ఎండిపోయే ప్రమాదం ఉంది. తద్వారా గ్రామాలకు గ్రామాలు ఖాళీ చేయక తప్పని పరిస్థితి వస్తుంది. 


పరిశ్రమ వచ్చేనా?
అమ్మవారిపేట వద్ద అజిష్ట పరిశ్రమ ఏర్పాటుపై స్థానికుల్లో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 2004 సంవత్సరానికి ముందు సీఎంగా ఇదే భూముల్లో లీఫ్‌ టూ క్లాత్‌ పరిశ్రమ పేరుతో హడావుడి చేసినా ఒరిగింది ఏమీ లేదంటున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనం చెవిలో పూలు పెట్టే ప్రయత్నంలో భాగంగానే పరిశ్రమ ఏర్పాటును తెరపైకి తెచ్చారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement