బ్యాంక్ అధికారి బురిడీ | Bank officer buridi | Sakshi
Sakshi News home page

బ్యాంక్ అధికారి బురిడీ

Published Thu, Mar 19 2015 2:27 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

Bank officer buridi

ఉదయగిరి: కంచే చేను మేసిన చందంగా ప్రజాధనానికి జవాబుదారీగా ఉండాల్సిన ఓ సీనియర్ బ్యాంకు అధికారి అక్రమాలకు ప్పాలడ్డారు. బినామీ పేర్లతో భూములు కొనుగోలు చేసి నిబంధనలకు విరుద్ధంగా ఏకంగా రూ.3.25 కోట్లు కాజేసీ బ్యాంకు టోపీ పెట్టారు. 30 ఏళ్లపాటు తనకు అన్నం పెట్టిన సంస్థనే మోసం చేసిన ఘనుడికి ఉపయోగపడిన భూములు  ఉదయగిరి మండలం బండగానిపల్లిలో ఉన్నాయి. వివరాల్లోకెళ్తే...మండలంలోని బండగానిపల్లిలో సర్వే నం.408, 589, 384, 407, 509, 385ర్లలో 66 ఎకరాల మెట్టభూమిని జనార్దన్‌రెడ్డి, ప్రసూన అనే వారివద్ద నుంచి నెల్లూరులోని పొగతోట ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు(ఐఓబీ)లో సీనియర్ మేనేజరుగా పనిచేస్తున్న తాళ్లూరి నాగయ్య నెల్లూరులోని జెండావీధికి చెందిన 11 మంది బినామీల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించారు.

2014 మార్చి 18న అల్లూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో షేక్.కౌసిఫ్‌బేగ్, షేక్.ఫయాజుద్దీన్, షేక్.బీబీజాన్, షేక్.ఆస్మా, షేక్.సిరూనా, షేక్.సలావుద్దీన్, ఆమూరి శీనయ్య, షేక్.షావుద్దీన్, షేక్.సదావుద్దీన్, షేక్.అమీరుద్దీన్, షేక్.అబ్దుల్జ్రాక్‌ల పేర్లమీద ఒక్కొక్కరికి ఆరు ఎకరాల చొప్పున రిజిస్ట్రేషన్ చేశారు. ఎలాంటి పాస్‌పుస్తకాలు లేకుండా, కేవలం రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు ఆధారంగా రిజిష్టరు జరిగింది. రిజిష్టర్ అయిన వారంరోజులు తిరగకముందే 2014 మార్చి 23న వీరి పేర్లుమీద పొగతోట ఐఓబీలో అగ్రికల్చర్ గ్రీన్ క్రెడిట్ స్కీం కింద ఒక్కొక్కరికి రూ.25 లక్షలు చొప్పున రూ.2.75 కోట్లు మంజూరుచేశారు. అంతేకాకుండా భూమి అభివృద్ధి కోసం కిసాన్ క్రెడిట్ కార్డు పథకం ద్వారా రూ.5 లక్షలు చొప్పున మరో రూ.50 లక్షలు మంజూరుచేశారు. ఎందుకూ పనికిరాని గుట్టలు, రాళ్లతో కూడిన ఈ భూమికి నిబంధనలకు విరుద్ధంగా రుణాలు మంజూరుచేశారు.
 
అనుమానం వచ్చి.. ఇంత పెద్దమొత్తంలో రుణాలు మంజూరుచేయడంతో ఈ బ్యాంకుకు చెందిన రీజనల్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చి నివ్వెరపోయారు. కనీసం ఎకరా రూ.50 వేలు కూడా విలువచేయని భూములకు ఇంత పెద్దమొత్తంలో రుణాలు మంజూరుచేయడంతో సంబంధిత బ్యాంకు మేనేజరుపై చర్యలు చేపట్టి సస్పెండ్ చేయటమే కాకుండా నెల్లూరులోని వన్‌టవున్‌లో 2014 సెప్టెంబరులో కేసు పెట్టారు. నెల్లూరు క్రైంబ్రాంచ్ డీఎస్పీ శ్రీధర్‌కు ఈ కేసు అప్పగించారు. రిజిస్ట్రేషన్ వద్ద నుంచి బ్యాంకు రుణాలు మంజూరు చేసేవరకు అన్నిచోట్ల నిబంధనలు పాటించలేదని ఆయన తేల్చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా బుధవారం ఆయన క్రైంబ్రాంచ్‌కు చెందిన ఏఎస్సై వెంకటేశ్వర్లుతో కలిసి ఉదయగిరిలోని రెవెన్యూ అధికారులతో చర్చించారు.

అనంతరం బండగానిపల్లిలోని పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఈ కేసులో బ్యాంకు అధికారి నాగయ్య 11 మంది తమ అనుచరులకు ఎరవేసి వారి పేరు మీద రిజిస్ట్రేషన్లు చేసి బ్యాంకు లోను మొత్తం కాజేశారన్నారు. ఈ బ్యాంకు అధికారి కూడా ఉదయగిరి ప్రాంతానికి చెందిన వ్యక్తి అని తెలిపారు. కాగా బండగానిపల్లికి చెందిన ఈ భూమికి సంబంధించి పలు వివాదాలున్నాయి. రిజర్వ్ ఫారెస్ట్‌కు చెందిన భూమిగా గ్రామస్తులు, అటవీ అధికారులు చెబుతున్నప్పటికీ ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం సెటిల్‌మెంట్‌గా ఉండటంతో వాటిని కొంతమంది వ్యక్తులు కొనుగోలు చేశారు. వీటిపై కూడా అనేకసార్లు గ్రామస్తులు, అధికారులు, హక్కుదారుల మధ్య వివాదాలు నడిచాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement