ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : బ్యాంకింగ్ రంగంలో చేపడుతున్న సంస్కరణలను తక్షణం నిలిపివేయడంతో పాటు, వేతన సవరణ చేపట్టాలని కోరుతూ బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన ఒక రోజు సమ్మె విజయవంతమైంది. యునెటైడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వగా బుధవారం జిల్లాలోనూ చేపట్టారు. సుమారు 3 వేలకు పైగా ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. దీంతో బ్యాంకులు తెరుచుకోలేదు. ఇది బ్యాంకింగ్ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపింది. కోట్ల రూపాయల లావాదేవీలు నిలిచిపోయాయి.
నిరసనలు
జిల్లాలో ఎస్‌బీహెచ్, ఎస్‌బీఐ, ఆంధ్రాబ్యాంక్‌తో పాటు పలు పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్(ఏఐబీఈఏ), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్(ఏఐబీవోఏ)తో పాటు పలు అసోసియేషన్లు సమ్మెలో పాల్గొని నిరసన తెలిపాయి. జిల్లా కేంద్రంలోని శివాజీచౌక్‌లో గల ఎస్‌బీహెచ్ ప్రధాన శాఖ ఎదుట వివిధ అసోసియేషన్లు నిరసన చేపట్టాయి.
ఈ సందర్భంగా ఏఐబీఈఏ సెంట్రల్ కమిటీ సభ్యులు ఎస్.అమరేందర్, ధర్మేందర్, ఏఐబీవోఏ సభ్యులు వెంకటేశం, మోతిలాల్ తదితరులు మాట్లాడారు. ప్రతి ఐదు సంవత్సరాలకోసారి వేతన సవరణ చేపట్టాల్సి ఉండగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2012 నవంబర్ తర్వాత వేతన సవరణ జరగాల్సి ఉన్నా ఇప్పటికీ చేపట్టకపోవడంపై మండిపడ్డారు. బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని, కార్పొరేట్‌కు లెసైన్స్ ఇవ్వడం, కొత్తగా చేపడుతున్న సంస్కరణలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఎస్‌బీహెచ్‌ను ఎస్‌బీఐలో విలీనం చేయాలనే చర్యలను విడనాడాలని స్పష్టం చేశారు. కాగా సమ్మె విషయం తెలియక పలువురు వినియోగదారులు బ్యాంకులకు వచ్చి వెనుదిరగడం కనిపించింది.
బ్యాంకు ఉద్యోగుల సమ్మె విజయవంతం
Published Thu, Dec 19 2013 5:35 AM | Last Updated on Sat, Sep 2 2017 1:46 AM
Advertisement
Advertisement