
చదువుల తల్లి శాశ్వత ‘సెలవు’
భీమ్‌గల్, న్యూస్‌లైన్ :
చదువుల తల్లి కొలువైన బాసర క్షేత్రంలోని ట్రిపుల్ ఐటీలో సీటు వచ్చిం దని సంబరపడ్డ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 2010-11లో పదో తరగతి లో భీమ్‌గల్ మండల టాపర్‌గా నిలిచిన స్రవంతి బాసర ట్రిపుల్ ఐటీలో సీటు దక్కించుకుంది. ఉన్నత విద్యాభ్యాసం చేసి తమకు పేరు తెస్తుందనుకున్న బిడ్డ ఇప్పుడు వారి నుంచి శాశ్వతంగా దూరమైపోయిందన్న వేదనను తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో ఈ-1 చదువుతున్న స్రవంతి సెలవుల కోసం వచ్చి ఇంటి వద్ద సోమవారం కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుని మృతి చెందడం కలకలం రేపుతోంది.
ఇంటికి వెళ్లి..
ట్రిపుల్ ఐటీలో పరీక్షలు ముగిశాయి. సెలవుల్లో అందరితోపాటు గత నెల 24న స్రవంతి ఇంటికి వచ్చింది. బడా భీమ్‌గల్‌కు చేరుకున్న స్రవంతి సోమవారం ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడిం ది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రంగా కాలిపోయిన బాధితురాలిని కుటుంబ సభ్యులు హుటాహుటీన నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ స్రవంతి(19) మరణిం చింది. దీంతో ఆమె కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
నిరుపేద కుటుంబం
స్రవంతి తండ్రి రాజా గంగారాం కూలి పనులు చేస్తూ, తల్లి భూదేవి ఇంటి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ దంపతుల పెద్ద కూతురు స్రవంతికి ట్రిపుల్ ఐటీలో సీటు వచ్చిందని ఎంతో సంబరపడ్డారు. నిరుపేద కుటుంబం కావడంతో స్రవంతి తండ్రి రాజాగంగారాం కుటుంబాన్ని పోషించేందుకు దుబాయి వెళ్లాడు. తల్లి భూదేవి బడాభీమ్‌గల్‌లో ఉంటూ పిల్లలను చదివిస్తోంది. పెద్ద కూతురు ట్రిపుల్ ఐటీలో చదువుతుంటే కుమారుడు ప్రసాద్ స్థానికంగా తొమ్మిదో తరగతి, చిన్నకూతురు శ్రావణి ఏడో తరగతి చదువుతున్నారు. చదువుల తల్లి తమ కళ్లముందే ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
ట్రిపుల్ ఐటీలో విషాదం
భైంసా : స్రవంతి చనిపోయిందని తెలియగానే బాసరలోని ట్రిపుల్ ఈ-1లో చది వే తోటి విద్యార్థులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. అందరితో కలుపుగోలుగా ఉండేదని పేర్కొన్నారు. సెలవుల కోసం వెళ్లిన స్నేహితురాలు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందని తెలి సి విద్యార్థులు విచారం వ్యక్తం చేశారు. ట్రిపుల్ ఐటీలో పని చేసే మెంటర్లు విద్యార్థిని ఆత్మహత్య విషయం తెలుసుకుని విస్మయానికి లోనయ్యారు. తోటి విద్యార్థులంతా ఈ విషయాన్ని తెలుసుకుని ఇదే విషయంపై చర్చించారు. ఆత్మహత్య చేసుకునేందుకు గల కారణాలు తెలియరాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు భీమ్‌గల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.