ట్రిపుల్ ఐటీ ‘క్యాంపస్’లో పల్లె వెలుగు | Rural student Gunapati RamMohan selected in iiit campus | Sakshi
Sakshi News home page

ట్రిపుల్ ఐటీ ‘క్యాంపస్’లో పల్లె వెలుగు

Published Thu, Nov 28 2013 2:32 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

Rural student Gunapati RamMohan selected in iiit campus

పుట్టి పెరిగింది పల్లెలోనే కావొచ్చు.. కాస్త ప్రోత్సహిస్తే ‘కార్పొరేట్’ విద్యార్థులతోనూ పోటీపడగలమనే ఆత్మవిశ్వాసం.. తాను నేర్చుకున్న విద్య రైతన్నలకు వెన్నుదన్నుగా ఉండాలనే సంకల్పం.. వెరసి ఆ విద్యార్థిని విజేతగా నిలిపాయి. దేశానికి పట్టుగొమ్మలైన పల్లెసీమల ప్రతిభ మసకబారకూడదన్న  ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆలోచనల నుంచి పుట్టిన ట్రిపుల్ ఐటీల్లో ఇటీవల తొలి ప్రాంగణ నియామకాలు జరిగాయి. వీటిలో రూ. 5.2 లక్షల వార్షిక వేతనంతో ‘ఎఫ్‌ఎన్ సీ టె క్నాలజీస్’ కంపెనీకి ఎంపికైన గుణపాటి రామ్మోహన్ సక్సెస్ స్పీక్స్..

 

 మాది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని చిన్నారెడ్డి పాలెం అనే పల్లెటూరు. నాన్న రఘురామిరెడ్డి చిన్న రైతు. ఉన్న రెండెకరాల్లో సేద్యం చేస్తుంటారు. పొలం పనిలో ఎక్కువగా తేలికపాటి పనిముట్లు ఉపయోగించడం వల్ల శ్రమ తెలిసేది కాదు. దీంతో నాకు వ్యవసాయ పనిముట్లపై ఉత్సుకత పెరిగింది.

 

 ఆర్థిక అండ లేకనే:

 అమ్మానాన్నలు నిరక్షరాస్యులు. అందుకే మమ్మల్ని బాగా చదివించాలని తపిస్తుండేవారు. అయితే ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోవడం వల్ల ఇద్దరు అక్కయ్యల చదువు పదో తరగతితోనే ఆగిపోయింది. నా ఆసక్తిని గమనించి ఎలాగైనా కష్టపడి చదివించాలనుకున్నారు. బిట్రగుంటలో హోలీ ఫ్యామిలీ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో పదో తరగతి వరకూ చదివా. 600కు 533 మార్కులు రావడంతో ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో సీటొచ్చింది. నాకిష్టమైన మెకానికల్ ఇంజనీరింగ్ (ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్) చేసేఅవకాశం వచ్చింది.

 

 చేయడం ద్వారా నేర్చుకోవడం:

 ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యం ఇస్తారు. చేయడం ద్వారా నేర్చుకోవడం (లెర్నింగ్ బై డూయింగ్) విధానం విద్యార్థుల్లో అప్లికేషన్ నైపుణ్యాల మెరుగుదలకు ఉపయోగపడుతోంది. క్యాంపస్‌లో చదువుతున్న కోర్సు.. రేపటి అవసరాలకు, క్షేత్రస్థాయిలో సంస్థల అవసరాలకు తగిన విధంగా సాగుతుంది. అకడమిక్స్‌లో ఇంటర్న్‌షిప్ కూడా కీలకం. నేను టాటా మోటార్స్‌లో 45 రోజులు ఇంటర్న్‌షిప్ చేశా. గేర్‌బాక్సు యూనిట్లో పనిచేశా. ఆర్మీ ట్రక్కులు, లారీలు తక్కువ ఇంధనంతోనే భారీ బరువులను తీసుకెళ్లేందుకు ఉపయోగపడే పరిజ్ఞానంపై నేను అందజేసిన నివేదికకు మంచి గుర్తింపు లభించింది.

 

 ప్రత్యేక శిక్షణ తీసుకోలేదు:

 క్యాంపస్ ప్లేస్‌మెంట్ కోసం ఇడుపులపాయ, బాసర, నూజివీడు క్యాంపస్‌ల నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ గ్రూపు నుంచి 45 మందిని ఎంపిక చేశారు. తర్వాత 15 మంది ఇంటర్వ్యూ వరకూ వెళ్లారు. చివరకు ఇద్దరు ఎంపికయ్యారు. ఎంపిక ఐదు దశల్లో జరిగింది. అవి.. రాతపరీక్ష, బృందచర్చ, హెచ్‌ఆర్, టెక్నికల్ రౌండ్ -1, టెక్నికల్ రౌండ్-2, ఇంటర్వ్యూ. కోర్ మెకానికల్, బేసిక్ అప్లికేషన్స్ తదితరాలపై రాతపరీక్షలో ప్రశ్నలు వచ్చా యి. బృంద చర్చకు ‘సేఫ్టీ ఆఫ్ ఉమెన్ ఇన్ ఇండియా’ అంశమిచ్చారు.

 

 హెచ్‌ఆర్ రౌండ్‌లో కుటుంబ వివరాలు, నా బలాలు-బలహీనతలు, ట్రిపుల్ ఐటీలో బోధనా విధానం గురించి అడిగారు. రాతపరీక్షలో కరెక్టుగా రాసిన ప్రశ్నలను విశ్లేషించమన్నారు. ఇంటర్వ్యూలో ఇంటర్న్‌షిప్, కంపెనీ అవసరాలకు అనుగుణంగా పనిచేయాల్సిన విధానాలపై ప్రశ్నించారు. ప్లేస్‌మెంట్స్ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకోలేదు. కాలేజీలో నిర్వహించిన మాక్ టెస్ట్‌లు, బృందచర్చలు ఉపయోగపడ్డాయి. సాక్షి భవితలో వచ్చే విజేతల కథనాలు స్ఫూర్తినింపాయి. అధ్యాపకులు మధుసూదన్‌రెడ్డి ప్రోత్సాహం మరవలేనిది.

 

 

 తక్కువ ధరకే వ్యవసాయ పరికరాలు:

 వ్యవసాయంలో రైతుల కష్టాన్ని తగ్గించేందుకు ఏదైనా చేయాలనుకునే వారు నాన్న. మా దగ్గర చిన్న ట్రాక్టరు ఉండేది. దానికి చిన్నచిన్న మార్పులు చేస్తూ వివిధ రకాల వ్యవసాయ పనులకు ఉపయోగించేవారు. ఇవన్నీ నా మనసులో నాటుకుపోయాయి. రైతులకు వ్యవసాయ పనుల్లో ఉపయోగపడే పనిముట్లను తక్కువ ధరకే లభ్యమయ్యేలా చేయాలన్నది నా లక్ష్యం. తగిన ఆర్థిక వనరులు, పరిజ్ఞానం సంపాదించిన తర్వాత తప్పకుండా సొంతంగా పరిశ్రమను ఏర్పాటు చేస్తానన్న ఆత్మవిశ్వాసం ఉంది. నా జీవిత లక్ష్యం అదే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement