సాక్షిప్రతినిధి, కరీంనగర్ : తెలంగాణ సంస్కృతిని, పల్లెజీవనశైలిని పాటలతో చాటిచెప్పే ప్రకృతి పండుగ బతుకమ్మ శుక్రవారం మొదలవుతోంది. సాంస్కృతిక అస్థిత్వం నిలుపుకునే క్రమంలో తెలంగాణకే ప్రత్యేకమైన బతుకమ్మకు ప్రాధాన్యం ఏటేటా పెరుగుతోంది. ప్రత్యేక రాష్ట్రం కోసం మొదలైన మలిదశ ఉద్యమం తర్వాత ఇది వేగంగా జరుగుతోంది. దశాబ్దం క్రితం గ్రామాల్లో బతుకమ్మను ఆడేవారు తక్కువగా ఉండేవారు.
కేవలం సద్దుల బతుకమ్మకే పరిమితమయ్యే గ్రామాల్లోని పెద్ద కుటుంబాల వారు సైతం ఇప్పుడు నాలుగైదు రోజులు ఆడుతున్నారు. పూర్తిగా ప్రకృతిని, అత్మీయతలను మననం చేసుకోవ డం ప్రధాన ఉద్దేశంగా బతుకమ్మ పాటలు ఉం టాయి. బతుకు తీరును చెప్పే బతుకమ్మ పాట లన్నీ ఎక్కువ నిరక్షరాస్యులే పాడుతుంటారు. తరతరాలుగా ఈ పాటల వారసత్వ పరంపర అలా కొనసాగుతూ వస్తోంది. మంచి వర్షాలతో పంటల సాగు విస్తీర్ణం పెరిగిన తరుణంలో ఈ ఏడాది జరుగుతున్న బతుకమ్మతో తెలంగాణ పల్లెలకు కల వచ్చింది.
ప్రత్యేక వాతావరణం...
బతుకమ్మ పండుగ వచ్చే రోజులకు ప్రత్యేకత ఉంటుంది. వానాకాలం వరినాట్లకు, కోతలకు ఇది మధ్యకాలం. వర్షాకాలం ముగింపు, చలికాలం మొదలయ్యే తరుణం. అందుకే దీన్ని కొత్తపాత సందు అంటారు. అశ్వయుజమాసం అమావాస్య రోజున ఎంగిలిపూలతో తొలిరోజు బతుకమ్మ పండగ మొదలవుతుంది. సద్దుల పండుగతో తొమ్మిదోరోజు ముగుస్తుంది. పరమేశ్వరుడి సతి పార్వతిని దేశమంతా శక్తిస్వరూపిణిగా, ఉగ్రరూపిణిగా కొలుస్తారు.
ఒక్క తెలంగాణలో మాత్రం బతుకమ్మ రూపంలో ప్రకృతి మాతగా పూజిస్తారు. బతుకమ్మను పూలతో పేర్చడం, మట్టిలో ఆడడం, నీళ్లలో కలపడం అంతా ప్రకృతితో మమేకమైన ప్రక్రియగానే సాగుతుంది. పార్వతి... గిరిరాజు పుత్రిక. అందుకే బతుకమ్మను కొండలాగా పేర్చుతారు. బతుకమ్మ పేర్చడం కోసం వినియోగించే ఒక్కో పువ్వులో ఒక్కో రకమైన రోగనిరోధక శక్తి ఉంటుంది. తంగేడు పువ్వు లేకుండా బతుకమ్మ పేర్చడం ఉండదు. ఆకులు లేకుండా పువ్వులను సేకరించడం తంగేడు విషయంలో సాధ్యం కాదు.
బతుకమ్మలో తప్పకుండా ఉండే తంగేడుపూలు, ఆకులలో రోగనివారణ శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇది శాస్త్రీయంగా నిర్ధారణ జరిగింది. తంగేడు వేర్లు చర్మరోగాల నివారణకు వినియోగిస్తారు. ఆకులు, పూలు, కొమ్మలను దగ్గరగా పట్టుకోవడం వల్ల అస్తమా, డయాబెటిస్, మూత్రవిసర్జన సమస్యల నివారణ జరుగుతుంది. వర్షాకాలం చివర, చలికాలం ఆరంభంలో ఉండే ఆరోగ్య సమస్యలకు నివారణగా తంగేడు పూలతో ఉండే బతుకమ్మ పేర్పు దోహదం చేస్తుంది.
ఆడబిడ్డ... బతుకమ్మ
తెలంగాణలో బతుకమ్మను ఇంటి ఆడబిడ్డగా చూసుకుంటారు. అందుకే ఆడబిడ్డ పండుగకు రాకపోతే అవమానంగా భావిస్తారు. ఆడబిడ్డను శుక్రవారం, బుధవారం పుట్టింటి నుంచి పంపరు. అందుకే సద్దుల బతుకమ్మను... శుక్రవారం, బుధవారం జరుపరు. తిథి ప్రకారం ఈ రోజుల్లో సద్దుల బతుకమ్మ వచ్చినా మరుసటి రోజు నిర్వహిస్తారు. బతుకమ్మ పేర్చే తీరు ప్రత్యేకంగా ఉంటుంది.
ఎనిమిది రోజులూ సిబ్బి(వెదురు అల్లిక)లో బతుకమ్మలు పేరుస్తారు. గుమ్మడి ఆకులతో మొదటి వరుస పేర్చి వాటిపైన గునుగు పూలను, ఆకులతో ఉన్న తంగేడు పూలను పేరుస్తారు. చివరగా బీర, గుమ్మడి, కట్ల, రుద్రాక్ష... ఇతర రంగురంగుల పూలను కోణాకారంలో అమర్చుతారు. మధ్యలో గౌరమ్మ (గుమ్మడిపువ్వు మధ్య భాగం)ను పెడతారు. బతుకమ్మ పేర్పునకు ఇదే మూలం. పసుపు, కుంకుమ పెట్టి గౌరమ్మను పూజిస్తారు. సద్దులనాడు మాత్రం పెద్ద పెద్ద బతుకమ్మలు పేరుస్తారు.
దీనికోసం తాంబాళం ఉపయోగిస్తారు. మొదటి రోజు ఎంగిపూల బతుకమ్మ, రెండో రోజు పప్పుబెల్లం బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ, ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ... (ఈ రోజు బతుకమ్మ ఆడరు), ఏడో రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ, తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ. ఇలా ప్రతి రోజు ఈ సీజనులో వచ్చిన పంట ఉత్పత్తులతో చేసిన ప్రసాదాలను బతుకమ్మ ఆడే వద్దకు తీసుకువస్తారు. ఒకరికొకరు వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటున్నారు. మొదటి రోజు ఆలయాల్లో... తర్వాత రోజులు ఊరి చెరువులో నిమజ్జనం చేస్తారు.
పూల కొరత..
ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో విరివిగా లభించే తంగేడు, గునుగు, గుమ్మడి, బంతి, ఇతర పూలు ప్రస్తుతం అంతగా లభించడం లేదు. గ్రామాల్లో కూడా కాంక్రీట్ నిర్మాణాలు వెలుస్తుండడంతో ఇంటి చుట్టూ, పెరట్లో పూల పెంపకం తగ్గిపోయింది. గతంలో పెరళ్లలో గునుగు, గుమ్మడి వంటి పూలు పెంచితే, ఇటీవల కాలంలో వాణిజ్య పంటలు వేస్తుండడంతో వీటి పెంపకం పూర్తిగా తగ్గిపోయింది. బీడుభూముల్లో విరివిగా లభించే తంగేడు పూలు సైతం ఇప్పుడు పెద్దగా దొరకడం లేదు. పట్టణాలతోపాటు చుట్టుపక్కల గ్రామస్తులు కూడా ఇప్పుడు మార్కెట్‌లో పూలు కొనుగోలు చేసి బతుకమ్మ పేర్చుతున్నారు. ధరల కారణంగా పూలు కొనలేని వారు కాగితం బతుకమ్మలతో సంతృప్తి చెందుతున్నారు.
ఒక్కేసి పువ్వేసి చందమామ..
Published Fri, Oct 4 2013 4:34 AM | Last Updated on Fri, Sep 1 2017 11:18 PM
Advertisement
Advertisement