- కాపు, బలిజల్లో అత్యంత వెనుకబడిన వారి అభివృద్ధికి కృషి చేస్తే వ్యతిరేకించం
- అన్నా రామచంద్రయ్య హెచ్చరిక
తిరుపతి కల్చరల్: కాపులను, బలిజలను బీసీల్లో చేర్చే ప్రయత్నాన్ని టీడీపీ ప్రభుత్వం విస్మరించకుంటే బీసీల తిరుగుబాటుతో రాష్ట్రం అగ్నిగుండం కాక తప్పదని అఖిల భారతీయ యాదవ మహాసభ జాతీయ ఉపాధ్యక్షుడు అన్నా రామచంద్రయ్య హెచ్చరించారు. శుక్రవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వివిధ వృత్తులతో బతుకులు సాగిస్తున్న 93 కులాలు అనాదిగా అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. వ్యవసాయం, వ్యాపార రంగాల్లో రాణిస్తూ రాజకీయ రంగంలో అభివృద్ధి పథంలో నడుస్తున్న బలిజలను బీసీల్లో చేర్చాలనుకోవడం బీసీలను దగా చేయడమేనని విమర్శించారు. అధికారం కోసం చంద్రబాబు నాయుడు అనేక మాటలు చెప్పుండచ్చు కానీ బీసీల పేరుతో దోపిడీ చేస్తూ వారి కడుపు కొట్టడం దగా కోరుతనమన్నారు.
బలిజ, కాపులలో అత్యంత వెనుకబడిన వారి అభివృద్ధికి కృషి చేయాల్సిన బాధ్యతను ప్రభుత్వ చేపడితే తాము వ్యతిరేకం కాదన్నారు. పాలక ప్రభుత్వాలు రాజకీయ కుట్రలో బలిజ, కాపులు బలికావద్దని సూచించారు. టీడీపీ సర్కార్ బీసీలను దగా చేస్తున్నా రాజకీయంలో ఉన్న బీసీ ప్రజాప్రతినిధులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం అమానుషమన్నారు. బలిజ, కాపులను బీసీల్లో చేర్చే విధానాన్ని బీసీ ప్రజాప్రతినిధులు వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వారి ఇళ్ల ముందు ధర్నాలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ యాదవ మహాసభ రాష్ట్ర నేతలు పాల్గొన్నారు.
కాపులను బీసీల్లో చేర్చితే రాష్ట్రం అగ్నిగుండమే
Published Sat, Jan 30 2016 4:28 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
Advertisement
Advertisement