
వెలుగు మాటున అంధకారం
నంద్యాల/ కర్నూలు రూరల్ :
కొద్ది రోజుల్లో పంట చేతికొస్తుంది.. అప్పులు తీరుతాయని రైతుల ఆశ. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. శ్రీశైలం డ్యామ్‌లో నీటిమట్టం రోజు రోజుకూ పడిపోతోంది. విద్యుత్ ఉత్పాదన పేరుతో దిగువకు నీటిని విడుదల చేయడమే ఇందుకు కారణం. విద్యుత్ వెలుగుల కోసం నీటిని విడుదల చేస్తుండడంతో రాయలసీమ జిల్లాల రైతుల బతుకుల్లో అంధకారం అలుముకోనుంది. ప్రస్తుతం డ్యామ్‌లో 859.80 అడుగుల నీటిమట్టం ఉంది. 105 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
నాగార్జునసాగర్‌కు 70 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మరో పది రోజుల్లో 854 అడుగులకు చేరే అవకాశం ఉంది. ఇలాగైతే పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదల కష్టమే. రాయలసీమ రైతులకు పోతిరెడ్డిపాడు వరప్రదాయిని. ఇక్కడి నుంచి కర్నూలు, వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాల్లో దాదాపు 10 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతోంది. నీటి విడుదల ఆగిపోతే పంట మట్టిపాలు కావాల్సిందే. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే తెలుగుగంగ ప్రాజెక్టు కింద మినహాయిస్తే మిగిలిన ఏ ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేయడం సాధ్యం కాదని నీటిపారుదల శాఖ అధికారులే అంగీకరిస్తున్నారు.
వెలుగోడు రిజర్వాయర్‌లో 13 టీఎంసీల నీరు నిల్వ ఉండడంతో ఈ కాల్వ కింద పంటలకు ఎలాంటి ఢోకా ఉండదని చెబుతున్నారు. కేసీ కెనాల్, ఎస్సార్బీసీలకు నీరందకపోతే ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందదు. అలాగే 600 గ్రామాల్లో తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొంటుంది.
ఇదిలా ఉంటే అధికార పార్టీ నాయకులు.. రైతుల ఇబ్బందులను పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. నాగార్జునసాగర్‌కు నీటి విడుదలపై టీడీపీ నేతలు నోరు మెదపకపోతే అన్నదాతల ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందని రైతు సంఘం నాయకులు మహేశ్వరరెడ్డి, బొజ్జా దశరథరామిరెడ్డి తదితరులు హెచ్చరిస్తున్నారు. అయితే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటి విడుదలను నిలిపి వేయాలని నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నీటి పారుదల మంత్రులను కలిసినట్లు సమాచారం. వారి నుంచి ఆయనకు సరైన హామీ లభించలేదని తెలుస్తోంది.
బాబు జీఓ.. సీమ రైతుకు శాపం
శ్రీశైలం రిజర్వాయర్ నిర్వహణపై 1996లో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే జీ.ఓ నెంబరు69ని జారీ చేసింది. ఇందులో శ్రీశైలంలో 860 నుంచి 863 అడుగుల మధ్య నీటి నిల్వ ఉన్నప్పుడు ప్రకాశం బ్యారేజీ, నాగార్జునసాగర్‌లకు తాగు, సాగు నీటి అవసరమైనా, లేకపోయినా జూలై నుంచి అక్టోబర్ వరకు 15 రోజులకు ఒకసారి 11 వేల క్యూసెక్కుల చొప్పన కేవలం ఆరు టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించాలని స్పష్టంగా ఉంది.
అయితే కోస్తా ప్రాంతానికి చెందిన అధికార పార్టీ నేతలు ఎలాంటి అనుమతులు లేకుండానే కృష్ణా జలాలను తరలించుకుపోతున్నా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఏ మాత్రం పట్టించుకోకుండా మొద్దనిద్రలో ఉన్నారు. ఇప్పటికే రోజుకి 4.7 నుంచి 7 టీఎంసీల ప్రకారం సుమారు 250 టీఎంసీల నీటిని దిగువకు వదిలారు. దీని వల్ల కృష్ణా జలాలపై ఆధారపడి ఉన్న ఎస్‌ఆర్‌బీసీ, తెలుగుగంగ, కేసీ ఎస్కేప్ చానల్ పరిధిలోని ఆయకట్టులో సాగైన ఖరీఫ్ పంటల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారనుంది. ప్రస్తుతం వరి పంట పొట్ట దశలో ఉంది. ఈ సమయంలో కాల్వలకు నీరు బంద్ అయితే అన్నదాతలకు తీరని నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.
సర్కార్ కుట్ర
రాష్ట్ర ప్రజలందరినీ సమానంగా చూడాల్సిన పాలకులు ఒక ప్రాంతానికి అన్యాయం చేసి మరో ప్రాంతానికి మేలు చేసేలా వ్యవహరిస్తున్నారు. శ్రీశైలం నీటి వాడకంలో రాజకీయం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ కొరత నేపథ్యంలో శ్రీశైలం ఎడమగట్టు కేంద్రం నుంచి 14820 క్యూసెక్కుల నీటిని వాడేసుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వం గగ్గోలు పెడుతుంది.
అయితే ఇక్కడే అసలు కుట్ర జరుగుతోంది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా డెల్టా ఆయకట్టుకు మున్ముందు సాగు నీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తతో శ్రీశైలం కుడిగట్టు కేంద్రం నుంచి ఎడాపెడా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది. ఇప్పటి వరకు 8 మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేసింది. అంటే సుమారు 40 వేల క్యూసెక్యుల నీటిని ఏపీ ప్రభుత్వమే దిగువకు వదిలేయడం గమనార్హం.
రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు.. ముఖ్యమంత్రిపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేసి కుడిగట్టు కేంద్రం నుంచి ప్రతి రోజూ రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు 20 వేల క్యూసెక్కుల నీటిని వినియోగించి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. శ్రీశైలంలో కనీస నీటిమట్టం తగ్గిస్తూ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ఇటీవల వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి నాయకత్వంలో శ్రీశైలం డ్యామ్ వద్ద ధర్నా నిర్వహించారు. అయినా ప్రభుత్వంలో చలనం లేదు.