ప్రయూణికులకు మెరుగైన సౌకర్యాలు | better facilities passengers | Sakshi
Sakshi News home page

ప్రయూణికులకు మెరుగైన సౌకర్యాలు

Published Sat, Sep 13 2014 2:15 AM | Last Updated on Sat, Sep 2 2017 1:16 PM

better facilities passengers

శ్రీకాకుళం అర్బన్: ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందేలా కృషి చేస్తామని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎ.రామకృష్ణ అన్నారు. వంద రోజుల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతి డిపోలోనూ బస్సుల పనితీరు, నిర్వహణ, బస్సుల్లో సీట్లు బాగున్నాయో? లేదో? చూడడం, పాడైన బస్సు గ్లాసులు బాగు చేయడం తదితరవి పరిశీలిస్తున్నామన్నారు. ప్రయాణికులను ఆకట్టుకునేలా అన్ని డిపోలను సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. ఆర్టీసీపై ప్రతినెలా డీజిల్ భారం పడడం వల్ల నష్టాల బాటలో నడుస్తోందన్నారు.
 
సంస్థ లాభాల బాట పట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. జిల్లాలో సరుబుజ్జిలి బస్‌స్టేషన్‌లో సీసీ రోడ్డు నిర్మాణం చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. టెక్కలి కాంప్లెక్స్‌లో అదనపు ప్లాట్‌ఫారాలను నిర్మించనున్నామన్నారు. శ్రీకాకుళం కాంప్లెక్స్ ఆవరణలో కొత్తగా సులభ్‌కాంప్లెక్స్ నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు.  దసరా పండగను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఈ నెలాఖరు నుంచి విజయవాడకు, హైదరాబాదుకు ప్రత్యేక బస్సులను నడుపుతామన్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు బస్సులను తిప్పుతామన్నారు.
 
శ్రీకాకుళం రెండవ డిపోపై ప్రత్యేక దృష్టి
జోన్‌లో ఏ డిపోలో లేని విధంగా శ్రీకాకుళం రెండవ డిపో సుమారు *4 కోట్ల మేర నష్టాల్లో ఉందన్నారు. ఈ డిపో లాభాల బాట పట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. తొలుత శ్రీకాకుళం రెండో డిపో గ్యారేజీలో బస్సుల పనితీరు, నిర్వహణ, పిట్‌లోకి దిగి బస్సు కండిషన్‌ను పరిశీలించారు.
 
స్పేర్‌పార్టులు గది, గ్యారేజీ యార్డు, స్టాఫ్ రెస్ట్‌రూం, స్టోరు రూం తదితర గదులను తనిఖీ చేశారు. రెండవ డిపో గ్యారేజీ ఆవరణలో ఉన్న మొక్కలను పరిశుభ్రం చేసిన తీరుపై సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఆర్.అప్పన్న, డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ జి.సత్యనారాయణ, శ్రీకాకుళం ఒకటి, రెండు డిపోల మేనేజర్లు ఎం.సన్యాసిరావు, ఎం.ముకుందరావు, బస్ స్టేషన్ మాస్టర్ బీఎల్‌పీ రావు, డీఈ బమ్మిడి రవికుమార్, రెండో డిపో ఎం.ఎఫ్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement