రూ. 8 కోట్లతో బస్టాండ్ల అభివృద్ధి | 8 crores for bustand development | Sakshi
Sakshi News home page

రూ. 8 కోట్లతో బస్టాండ్ల అభివృద్ధి

Published Wed, Aug 7 2013 4:09 AM | Last Updated on Fri, Sep 1 2017 9:41 PM

8 crores for bustand development

మార్కాపురం, న్యూస్‌లైన్: చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఉన్న 32 ఆర్టీసీ బస్టాండ్లలో జూలై 2వ తేదీ నుంచి ప్రతి టికెట్‌పై ప్రయాణికుల నుంచి ఒక రూపాయి వసూలు చేస్తున్నామని, వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ విధంగా వసూలయ్యే రూ. 8 కోట్ల నిధులతో బస్టాండ్లలో ప్రయాణికులకు అవసరమైన కనీస వసతులు కల్పిస్తామని నెల్లూరు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ సూర్యచంద్రరావు తెలిపారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టికెట్లపై అదనపు వసూలు ద్వారా నెలకు దాదాపు రూ. 80 లక్షలకుపైగా ఆదాయం రావచ్చని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. తాగునీటి సౌకర్యం, ప్రయాణికులు కూర్చొనేందుకు బెంచీల ఏర్పాటు, బస్టాండ్ల మరమ్మతులు చేపడతామన్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు ఏడాదికి రూ. 2 కోట్లకు మించి ఇవ్వడం లేదని, దీంతో ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయామన్నారు.
 
  మూడు జిల్లాల్లోని మూడు రీజియన్లలో మూడేసి బస్టాండ్ల చొప్పున మొత్తం 9 బస్టాండ్ల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని, సెప్టెంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి నిధులిస్తే ఆర్టీసీ మరికొంత కలిపి సంబంధిత బస్టాండ్లను అభివృద్ధి చేస్తామన్నారు. జోన్ పరిధిలో మార్చి నెలాఖరు నాటికి 210 బస్సులు రావాల్సి ఉండగా, ఇప్పటికే 60 బస్సులు వచ్చినట్లు చెప్పారు. అవి పాత బస్సుల స్థానంలో వచ్చాయన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ పట్టణాభివృద్ధి పథకం కింద నెల్లూరు రీజియన్‌కు వంద బస్సులు కావాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని, ఇవి వస్తే నెల్లూరుకు 50, తిరుపతికి 50 బస్సులు కేటాయిస్తామన్నారు. చిత్తూరు, ప్రకాశం రీజియన్‌లో ఆర్టీసీ నష్టాల్లో ఉందని తెలిపారు. తిరుమల, తిరుపతి, అలిపిరి, నెల్లూరు- 2 డిపోలు మాత్రమే లాభాల్లో ఉన్నాయన్నారు.
 
  ప్రకాశం జిల్లాలో కనిగిరి డిపో లాభాల బాటలో ఉండగా, అద్దంకి  డిపో నష్టాల్లో ఉందన్నారు. జిల్లాలోని మిగిలిన 7 డిపోలు నష్టాలను అధిగమించాయన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంతో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 7 రోజులుగా ఆర్టీసీ బస్సులు నడవడం లేదని చెప్పారు. ఒంగోలులో మూడు రోజులు బస్సులు తిరగలేదన్నారు. డీజిల్ ధరలు పెరగడంతో తమపై భారం పడుతోందని, నష్టాలు అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రయాణికులను అధిక సంఖ్యలో ఎక్కించుకోవడంతో పాటు ఇంధన పొదుపు పాటిస్తున్నామని తెలిపారు. కిలోమీటరుకు తమకు రూ. 27 ఖర్చవుతుండగా, రూ. 20 ఆదాయం వచ్చినా బస్సులు తిప్పుతామని చెప్పారు. మార్కాపురం డిపోకు నూతనంగా ఆరు బస్సులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. కంభం, దోర్నాల పట్టణాల్లో బస్టాండ్ల అభివృద్ధికి ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, సురేశ్‌లు నిధులు కేటాయించారన్నారు. త్వరలో ఇక్కడ పనులు ప్రారంభిస్తామన్నారు.  
 
 బస్టాండ్‌లో పర్యటన:
 ఈడీ సూర్యచంద్రరావు స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో పర్యటించారు. డిపోలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. వివిధ డిపోల కండక్టర్లతో మాట్లాడి ఆదాయ, వ్యయాలను పరిశీలించారు. ప్రయాణికులను గౌరవిస్తూ సంస్థ గౌరవాన్ని నిలబెట్టి నష్టాలను తగ్గించేందుకు కృషి చేయాలని కోరారు. ఆయన వెంట డిపో మేనేజర్ సునీల్ జోసఫ్, ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ చిన్నయసూరి తదితరులు ఉన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement