
ఆన్‌లైన్ షాపింగ్‌లో జాగ్రత్త...
ఆన్‌లైన్ షాపింగ్‌లో వినియోగదారులు జాగ్రత్త వహించాలని జేసీ భరత్‌గుప్త కోరారు.
వినియోగదారుల దినోత్సవంలో జేసీ భరత్‌గుప్త సూచన
చిత్తూరు(సెంట్రల్): ఆన్‌లైన్ షాపింగ్‌లో విని యోగదారులు జాగ్రత్త వహించాలని జేసీ భరత్‌గుప్త కోరారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ భవనంలో జరిగిన జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ- కామర్స్ పై అవగాహన, అసత్య ప్రకటనలు అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో మాట్లాడారు. ఆన్‌లైన్‌లో కొనుగోలుదారులను కొన్ని కంపెనీలు దగా చేస్తున్నాయన్నారు. దీని పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్యారంటీ కలిగిన నాణ్యమైన వస్తువులనే కొనాలని, వాటిలో లోపాలు ఏర్పడితే వినియోగదారుల చట్టాన్ని ఉపయోగించుకుని నష్టపరిహా రం పొందాలన్నారు. జిల్లా వినియోగదారుల సంఘం అధ్యక్షులు రాజారెడ్డి మాట్లాడుతూ ఏదైనా వస్తువు కొని మోసపోతే వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాలన్నారు. వినియోగదారుల హక్కులపై విద్యార్థులు, ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలు అవగాహన కల్పించాలన్నారు.
మహిళా వినియోగదారుల సంఘం అధ్యక్షురాలు వి.ఉషాదేవి మాట్లాడుతూ కల్తీ ఆహార పదార్థాలు జింక్ ఫుడ్స్ వాడకాన్ని తగ్గించాలన్నారు. జిల్లా స్థాయి డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఈ-కామర్స్ పై నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ విజేతలకు జేసీ భరత్‌గుప్తా ప్రశంసాపత్రాలను అందజేశారు. అంతకుముందు ఆయన ఈ-కామర్స్ ఆన్‌లైన్ షాపింగ్‌పై విశ్లేషణ అనే అంశంపై ముద్రించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ సత్యనారాయణరెడ్డి, పీవీకేఎన్ కళాశాల అధ్యాపకుడు దండపాణిరెడ్డి, పౌరసరఫరాల శాఖ సిబ్బంది అశోక్, కృష్ణకుమార్, శిరీషా పాల్గొన్నారు.