దుకాణాల కూల్చివేత ను అడ్డుకున్న భూమా | bhuma nagi reddy stopped demolition of shops | Sakshi
Sakshi News home page

దుకాణాల కూల్చివేత ను అడ్డుకున్న భూమా

Published Mon, Jul 7 2014 12:38 AM | Last Updated on Sat, Sep 2 2017 9:54 AM

bhuma nagi reddy stopped demolition of shops

ఆళ్లగడ్డ రూరల్/టౌన్:  ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో దుకాణాలను ఆదివారం అధికారులు కూల్చివేశారు. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఘటన స్థలానికి చేరుకొని కూల్చివేతను అడ్డుకొన్నారు. అహోబిలం మఠానికి ఒక న్యాయం న్యాయం..సామాన్య ప్రజలకు మరో న్యాయమా అంటూ అధికారులపై భూమా మండిపడ్డారు.

బాధితులకు అన్నీ సమకూర్చిన తరువాతే కూల్చివేత పనులు ప్రారంభించాలని సూచించారు. అహోబిలంలో 210 సర్వే నంబర్ దేవస్థానానికి చె ందిన ఆస్తి. అయితే ఇందులో 50 సంవత్సరాల క్రితం గ్రామస్తులు రేకులషెడ్లు వేసుకొని వ్యాపారం చేస్తున్నారు. దాదాపు 250 కుటుంబాల వారు ఈ దుకాణాల్లో భక్తులకు అవసరమైన వస్తువులు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. అయితే దేవస్థానం పరిధిలోని దుకాణాలు తొలగించాలని మఠం ప్రతినిధి రంగరాజన్ కోర్టు ఉత్తర్వులతో పోలీసులను వెంటబెట్టుకొని ఆదివారం ఇక్కడికి వచ్చారు.

 ప్రొక్లయిన్లతో చిన్న సుంకన్న, పల్లె సాంబయ్య, వీరభద్రుడుల దుకాణాలను కూల్చివేశారు. దీంతో బాధితులు పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి తరలి వచ్చి నిరసన తెలిపారు. వ్యాపార సముదాయాలను కూల్చివేస్తే తాము ఎలా బతకాలంటూ కొందరు ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు వారిని వారించారు. వందలాది మంది బాధితులు ఒక వైపు, మఠం ప్రతినిధులు మరొక వైపు ఉండడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

 భూమా రాకతో ఆగిన కూల్చివేత పనులు..
 అహోబిలంలో వ్యాపారుల రేకుల షెడ్లు కూల్చివేస్తున్నారని సమాచారం తెలుసుకున్న భూమా నాగిరెడ్డి  ఘటన స్థలానికి చేరుకున్నారు. తొలగింపు ప్రక్రియ వెంటనే నిలిపివేయించారు. బాధితుల తరఫున అక్కడే అధికారులతో మాట్లాడారు. 210 సర్వే నంబర్‌లో మఠం విశ్రాంతి గదులను మొదట కూల్చివేసి తరువాత దుకాణాల సముదాయాలను తొలగించాలని డిమాం డ్ చేశారు. మఠం ఆస్తులకో న్యాయం, సామాన్య ప్రజలకో న్యాయం పనికిరాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు స్టే ఇచ్చినా లెక్క చేయకుండా సాంబయ్య ఇంటిని, దుకాణాన్ని ఎలా తొలగిస్తారని భూమా ప్రశ్నించారు. బాధితులకు పునరావాసం కల్పించకుండా తొలగింపు పనులు ఎలా చేపడతారని మండిపడ్డారు.  

 భారీ పోలీస్ బందోబస్త్: దుకాణాల కూల్చివేతలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎస్పీ రామాంజనేయరెడ్డి, సీఐలు సుధాకర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, పది మంది ఎస్‌ఐలు, 40 మంది కానిస్టేబుళ్లు, స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ 50 మంది, 30 మంది మహిళా కానిస్టేబుల్ బందోబస్తులో పాల్గొన్నారు. భూమా వెంట వైఎస్సార్సీపీ నాయకులు బీవీ రామిరెడ్డి, కుమార్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, రాముయాదవ్, రామోహన్‌రెడ్డి, సిద్ది సత్యం, న్యాయవాదులు శివరామిరెడ్డి, సూర్యనారాయణరెడ్డిలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement