
పర్యావరణహిత పెట్టుబడులు
సాక్షి, హైదరాబాద్: పర్యావరణహితమైన రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి భూటాన్‌లో మంచి అవకాశాలున్నాయని ఆ దేశ ప్రధానమంత్రి లియోంఖెన్ షెరింగ్ టొబ్గే అన్నారు. తమ దేశంలో మెరుగైన పని వాతావరణం, నాణ్యమైన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని, వాటిని వినియోగించుకోవడం ద్వారా తమ దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలంటూ భారత పారిశ్రామికవేత్తలను ఆయన ఆహ్వానించారు. ‘పెట్టుబడుల కేంద్రంగా భూటాన్’ అనే అంశంపై భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఐటీ, మౌలిక సదుపాయాల కల్పన, సాంప్రదాయేతర ఇంధన వనరులు, ఆరోగ్యం, విద్యా రంగాలను పెట్టుబడులు పెట్టడానికి ప్రాధాన్యరంగాలుగా గుర్తించామని చెప్పారు. భారత్, భూటాన్ పరస్పరం కలిసి పనిచేయడానికి, కార్యాలయాలు నెలకొల్పడానికి అవకాశముందన్నారు. తమ దేశంలో సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధికి మెరుగైన అవకాశాలున్నాయని చెప్పారు. భూటాన్ ప్రధాని ఆహ్వానంపై సీఐఐ సానుకూలంగా స్పందించింది. ఆరు నెలల్లో సీఐఐ ప్రతినిధి బృందం భూటాన్‌లో పర్యటిస్తుందని సీఐఐ సదరన్ రీజియన్ మాజీ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి తెలిపారు.
మనవరాలిని కలిసేందుకు: భూటాన్ ప్రధానమంత్రి షెరింగ్ టొబ్గే, ఆయన సతీమణి హమ్‌తోషి డొమాలు మంగళవారం రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలోని కొండకల్ శివారులో ఉన్న ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్‌ను సందర్శించారు. వీరి మనవరాలు గలేక్ 10+2 చదువుతోంది. ఇతర దేశాలకు చెందిన విద్యార్థులు ‘స్టూడెంట్స్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రాం’లో భాగంగా ఏటా నాలుగు నెలలపాటు చదువుతోపాటు ఇతరత్రా శిక్షణ పొందేందుకు ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు వస్తుంటారు.
ఈ నేపథ్యంలో 15 రోజులక్రితం 40 మంది విద్యార్థులు, 20 మంది ఉపాధ్యాయులు ఇక్కడకు వచ్చారు. వీరిలో భూటాన్ ప్రధాని షెరింగ్ టొబ్గే మనవరాలు గలేక్ కూడా ఉంది. కాగా మంగళవారం హైదరాబాద్‌ను సందర్శించిన టొబ్గే దంపతులు తమ మనవరాలిని చూసేందుకు ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు వెళ్లారు. హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గం ద్వారా సాయంత్రం ఐదున్నర గంటలకు పాఠశాలకు చేరిన ఈ దంపతులకు స్కూల్ ప్రిన్సిపాల్ ఓంకార్ జోషి ఘనస్వాగతం పలికారు. అనంతరం టొబ్గే దంపతులు తమ మనవరాలు గలేక్‌తోపాటు ఇతర విద్యార్థులతో ముచ్చటించారు. ఇక్కడి వాతావరణ పరిస్థితులు, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడి చదువులపై ఆరాతీశారు. అనంతరం రాత్రి 7.20కి తిరుగుపయనమయ్యారు. ఈ సందర్భంగా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.