ధవళేశ్వరం, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనకు కేంద్రం తీసుకున్న నిర్ణయం చారిత్రక తప్పిదమని వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. ధవళేశ్వరం లూథరన్ హైస్కూల్ గ్రౌండ్‌లో పార్టీ రాజమండ్రి రూరల్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు అధ్యక్షతన ఆదివారం సాయంత్రం జరిగిన సమైక్య శంఖారావం సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రతో పాటు తెలంగాణ ప్రాంత ప్రజలు నష్టపోతారన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న పోరాటానికి ప్రతి ఒక్కరూ సంపూర్ణ మద్దతు ప్రకటించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తే రాష్ట్రం సమైక్యంగా ఉండటంతో పాటు సువర్ణ పాలన లభిస్తుంద ని అన్నారు.
పార్టీ సీఈసీ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ కేంద్రానికి విస్తృత అధికారాలు ఉంటే ప్రమాదమన్న విషయాన్ని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆనాడే చెప్పారన్నారు. హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిగా చేయాలని కూడా ఆయన చెప్పారన్నారు. ప్రస్తుతం కేంద్రం ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించాలని చూస్తోందన్నారు. పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగితే డెల్టా తీవ్రంగా నష్టపోతుందన్నారు. విద్యార్థులు, ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందన్నారు. పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కొల్లి నిర్మలకుమారి మాట్లాడుతూ కుట్రలతో జైలు గోడల మధ్య బంధించినా సమైక్య రాష్ట్రం కోసం ఆమరణ దీక్ష చేపట్టిన ఏకైక నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డేనని అన్నారు.
ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ పార్లమెంట్, అసెంబ్లీలలో కాంగ్రెస్, టీడీపీ నాయకుల ద్వంద్వ వైఖరి బయటపడిందన్నారు. వివిధ పార్టీల మద్దతు కూడగట్టి రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. ఆకుల వీర్రాజు మాట్లాడుతూ సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ వైఎస్సార్‌సీపీకి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ కో ఆర్డినేటర్లు బొమ్మన రాజ్‌కుమార్, రెడ్డి ప్రసాద్, విప్పర్తి వేణుగోపాలరావు, మిండగుదిటి మోహన్, వివిధ విభాగాల కన్వీనర్లు శెట్టిబత్తుల రాజబాబు, రెడ్డి రాధాకృష్ణ, కర్రి పాపారాయుడు, గారపాటి ఆనంద్, యువనేత జక్కంపూడి రాజా, నాయకులు టీకే విశ్వేశ్వరరెడ్డి, యాదల సతీష్‌చంద్ర స్టాలిన్, సుంకర చిన్ని, ఆదిరెడ్డి వాసు, ఎన్.వసుంధర, ఇసుకపల్లి శ్రీనివాస్, రావూరి వెంకటేశ్వరరావు, అజ్జరపు వాసు తదితరులు పాల్గొన్నారు.
విభజన నిర్ణయం చారిత్రక తప్పిదం
Published Mon, Dec 23 2013 1:27 AM | Last Updated on Wed, Apr 4 2018 9:31 PM
Advertisement