గణనాథుల చెంతకు ఘనమైన లడ్డూలు
‘భక్తాంజనేయ’ నుంచి గాజువాకకు 7,885 కేజీల లడ్డూ
తాపేశ్వరం ‘సురుచి’ నుంచి ఖైరతాబాద్‌కు 5,150 కేజీల లడ్డూ
మండపేట రూరల్ (తూర్పుగోదావరి జిల్లా): ఆంధ్రప్రదేశ్‌లోని తాపేశ్వరంలో తయారైన 2భారీ లడ్డూలు గురువారం గణనాథులను చేరేందుకు తరలివెళ్లాయి. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద లడ్డూగా తాపేశ్వరం శ్రీ భక్తాంజనేయ స్వీట్‌స్టాల్ అధినేత సలాది శ్రీనుబాబు సారథ్యంలో తయారైన 7,885 కిలోల లడ్డూ విశాఖలోని గాజువాకకు తరలింది. ఈ లడ్డూను ఎంతో శ్రమకోర్చి రెండు భారీ క్రేన్‌ల సాయంతో 16 చక్రాల వాహనంలోకి ఎక్కించి, భారీ ఊరేగింపు నడుమ విశాఖ తరలించారు. అక్కడి శ్రీ నవతరం యూత్ నెలకొల్పనున్న 60 అడుగుల గణనాథుని చెంత దీనిని ఉంచనున్నారు.
సురుచి ఫుడ్స్ అధినేత పోలిశెట్టి మల్లిబాబు ఆధ్వర్యంలో తయారైన 5,150 కేజీల లడ్డూను.. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ప్రతిష్ఠించే 60 అడుగుల ‘శ్రీ కైలాస విశ్వరూప మహా గణపతి’ చేతిలో ఉంచేందుకు తరలించారు. లడ్డూను భారీ క్రేన్ సహాయంతో ప్రత్యేక వాహనంలోకి చేర్చి హైదరాబాద్ తరలించారు. అంతకుముందు మల్లిబాబు దంపతులు లడ్డూకు ప్రత్యేక పూజలు చేశారు. లడ్డూను మంగళవాయిద్యాలతో, బాణసంచా కాల్పుల మధ్య ఊరేగించారు. ఖైరతాబాద్ గణపతికి లడ్డూను ఉచితంగా అందించడం వరుసగా ఇది ఐదోసారని మల్లిబాబు చెప్పారు. కాగా, స్టేట్ బుక్ ఆఫ్ రికార్డ్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధుల సమక్షంలో ఈ లడ్డూల బరువు పరిశీలించారు.